బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం

x
Highlights

పంచాయతీ ఎన్నికలకు ప్రతిబంధకంగా మారిన బిసి రిజర్వేషన్లపై కేసీఆర్‌ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రత్యేక ఆర్డినెన్స్...

పంచాయతీ ఎన్నికలకు ప్రతిబంధకంగా మారిన బిసి రిజర్వేషన్లపై కేసీఆర్‌ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. 2018 పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించనుంది. పంచాయతి ఎన్నికలకు హైకోర్టు విధించిన గడువు ముంచుకొస్తున్న సమయాన తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. బీసీ రిజర్వేషన్ల పెంచి పంచాయతీ ఎన్నికలు వెళ్దామనుకున్న సర్కారుకు సుప్రీంకోర్టు తీర్పు శరాఘాతంలా మారింది. దీంతో తీవ్ర కసరత్తులు జరిపిన కేసీఆర్‌ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. 2018 పంచాయతి చట్టం ద్వారా బీసీలకు కల్పించాల్సిన 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్‌ను విడుదల చేసింది.

హైకోర్టు తీర్పు మేరకు జనవరి 10 లోగా పంచాయితీ ఎన్నికలను పూర్తి చేసే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. ఇందుకు బీసీ రిజర్వేషన్ల గండాన్ని గట్టెక్కేందుకు ఎడతెగని చర్చలు జరిపిన ప్రభుత్వం చివరకు ఆర్డినెన్స్‌ ద్వారానే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. 2012 లో ఉమ్మడి రాష్ట్రంలో 34 శాతం బిసి రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలని భావించారు. దీనిపై దాఖలైన కేసులో విచారించిన సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50 శాతం మించరాదని తేల్చిచెప్పింది. అయితే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు 34 శాతం బీసీ రిజర్వేషన్లతో ఎన్నికలకు కోర్టు అనుమతిచ్చింది.

ఆరు నెలల కిందట పంచాయతీ ఎన్నికల కోసం నిర్వహించిన కసరత్తులో భాగంగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను మొత్తం 60.19 శాతంగా ఖరారు చేసింది. ఇందులో ఎస్టీలకు 5.73 శాతం, ఎస్సీలకు 20.46 శాతం, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించారు. రాజ్యాంగపరమైన హక్కు కలిగి ఉన్న ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుంది. అయితే ఇటీవల సుప్రీంకోర్టు మాత్రం రిజర్వేషన్లు 50 శాతానికి లోబడి ఉండాలని స్పష్టం చేసింది. దీంతో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగగా బీసీల కోసం ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకురావాల్సి వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories