మరో రికార్డు దిశగా నిజామాబాద్.. తొలిసారిగా కౌంటింగ్‌కు 36 టేబుళ్లు..

మరో రికార్డు దిశగా నిజామాబాద్.. తొలిసారిగా కౌంటింగ్‌కు 36 టేబుళ్లు..
x
Highlights

లోక్‌సభ ఎన్నికల్లో సరికొత్త రికార్డులతో దేశం దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ కౌంటింగ్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకోనుంది. దేశంలోనే తొలిసారిగా ఓట్ల...

లోక్‌సభ ఎన్నికల్లో సరికొత్త రికార్డులతో దేశం దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ కౌంటింగ్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకోనుంది. దేశంలోనే తొలిసారిగా ఓట్ల లెక్కింపు కోసం 36 టేబుళ్లను ఏర్పాటు చేయడం ద్వారా ఈ ఎన్నిక మరో రికార్డును సొంతం చేసుకోనుంది. 36 టేబుళ్ల పై ఓట్లు లెక్కించే నియోజవకర్గంగా నిజామాబాద్ చరిత్రలోకి ఎక్కనుంది.

నిజామాబాద్ లోక్ సభ ఎన్నికలు రికార్డులు సృష్టిస్తున్నాయి. అభ్యర్థుల పోటీ నుంచి ఇప్పుడు కౌంటింగ్ వరకు ప్రతీ విషయంలోనూ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా నిజామాబాద్ లోక్ సభ ఓట్ల లెక్కింపు కోసం దేశంలోనే తొలిసారిగా 36 టేబుళ్ల ఏర్పాటుకు అనుమతిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీలతో కలిపి 185 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. నోటాతో కలిపి 186 గుర్తులతో ఎన్నిక జరిగింది. ఎన్నికల సంఘం చరిత్రలో తొలిసారిగా 12 బ్యాలెట్ యూనిట్లతో ఎం-3 యంత్రాల ద్వారా పోలింగ్ నిర్వహించారు. ఇప్పటి వరకు 24 టేబుళ్ల పైనే ఓట్లు లెక్కించిన రికార్డు ఉండగా 36 టేబుళ్లపై లెక్కించేందుకు అనుమతి పొందడంతో.. దేశంలోనే తొలిసారిగా నిజామాబాద్ లోక్‌సభ స్థానం మరో రికార్డును నమోదు చేయనుంది.

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 1788 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. 18 టేబుళ్ల ద్వారా ఓట్లు లెక్కిస్తే 13 నుంచి 16 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఇందుకు 31 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. లెక్కింపు పక్రియ ఆలస్యం జరగకుండా ఉండేందుకు 36 టేబుళ్లకు అనుమతి ఇచ్చారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రెండేసి కౌంటింగ్ హాళ్లలో ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నారు.

నిజామాబాద్ అర్బన్ రూరల్ నియోజకవర్గాల్లో 16 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుందని అధికారులు ప్రకటించారు. కోరుట్ల, జగిత్యాలలో 15 రౌండ్లలో, బాల్కొండ, బోధన్‌లో 14 రౌండ్లలో, ఆర్మూర్‌లో 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. అయితే ఇప్పుడు 36 టేబుళ్ల ఏర్పాటు చేయడం ద్వారా రౌండ్ల సంఖ్య సగానికి సగం తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో అన్ని స్థానాలతో పాటే నిజామాబాద్ ఎంపీ ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే నిజామాబాద్ ఎన్నిక ఈసీ చరిత్రలో ఓ మైలురాలిగా మిగలగా.. కౌంటింగ్ పక్రియ సైతం సరికొత్త రికార్డు సృష్టించి చరిత్రలో మిగలనుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories