ఆ జిల్లాలో టీడీపీ టిక్కెట్లు వారికైనా..?

Submitted by nanireddy on Tue, 07/31/2018 - 10:13
tdp tickets this leaders in prakasam distric

ప్రకాశం జిల్లా టీడీపీలో అప్పుడే టిక్కెట్ల సందడి మొదలైంది. మళ్ళీ ఈసారి టికెట్ తెచ్చుకోవాలని సిట్టింగులు ప్రయత్నిస్తుంటే.. గత ఎన్నికల్లో టికెట్ దక్కని నేతలు ఈసారి ఎలాగైనా సీటు సంపాదించాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇదిలావుంటే ఇప్పటికే సీట్ల విషయంలో ఓ అంచనాకు వచ్చిన టీడీపీ అధిష్టానం గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని అనుకుంటోంది. అందులో భాగంగా ఒకటి రెండు నియోజకవర్గాల్లో మినహా దాదాపు సిట్టింగులకే సీట్లు ఇవ్వాలని టీడీపీ భావిస్తోంది.

ఒంగోలు నియోజకవర్గంనుంచి మళ్ళీ దామచర్ల జనార్దన్ కు అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంనుంచి జెడ్పి ఛైర్మెన్ ఈదర హరిబాబు టికెట్ ఆశిస్తున్నారు. కానీ దామచర్ల వైపే బాబు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఇటు కందుకూరులో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన పోతుల రామారావుకె టికెట్ దక్కే అవకాశముంది. అయితే గత ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసిన దివి శివరాం కూడా పోటీ చెయ్యడానికి సిద్ధమయ్యారు.

కొండెపిలో గెలిచిన డోలా బాలవీరాంజనేయస్వామికే 2019 మళ్ళీ అవకాశమివ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. మరోవైపు లోకేష్ మాత్రం గత ఎన్నికల్లో వైసీపీనుంచి పోటీచేసిన జూపూడి ప్రభాకర రావుకు టికెట్ ఇస్తే గెలుపు ఖాయమన్న అభిప్రాయంలో ఉన్నారు. ఇక అద్దంకి లో ద్విముఖ పోటీ నెలకొంది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గొట్టిపాటి రవి, టీడీపీ నుంచి కరణం బలరాం కుమారుడు వెంకటేష్ పోటీ చేశారు. విజయం గొట్టిపాటిని వరించింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా గొట్టిపాటి టీడీపీలో చేరిపోయారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ తనదేనని ఫిక్స్ అయ్యారు. ఇదిలావుంటే ఈసారి కూడా టికెట్ తమకే దక్కుతుందని కరణం వర్గం భావిస్తోంది. టికెట్ దక్కకుంటే కరణం బలరాం వైసీపీలో చేరుతారనే ప్రచారం కూడా ఊపందుకుంది.

ఇక పర్చూరు నుంచి ఎటువంటి మార్పు లేకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును బరిలో దించాలని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ దగ్గుబాటి ఫ్యామిలీ టీడీపీలో చేరితే మాత్రం దగ్గుబాటి వారసుడు చెంచురామ్ కు టికెట్ ఇచ్చేందుకు సిద్ధమైంది టీడీపీ. అలాగే కాస్ట్లీ నియోజకవర్గంగా పేరొందిన దర్శి నుంచి కూడా ఎటువంటి మార్పు లేకుండా మంత్రి శిద్దా రాఘవరావునే పోటీ చేయించాలని టీడీపీ అనుకుంటోంది. ఇటు సంతనూతల పాడు నుంచి మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ లేదా హోసింగ్ కార్పొరేషన్ ఛైర్మెన్ వర్ల రామయ్యను బరిలో దింపే ఆలోచనలో టీడీపీ ఉంది. సింహభాగం విజయ్ కుమార్ కె అవకాశం దక్కే వాతావరణం కనిపిస్తోంది.

కాగా పశ్చిమ ప్రకాశంవిషయానికొస్తే మార్కాపురం నియోజకవర్గంనుంచి మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కే మళ్ళీ టికెట్ ఇచ్చే అవకాశముంది. మరోవైపు శిద్దా రాఘవరావు కుమారుడు అభ్యర్థిత్వాన్ని కూడా టీడీపీ పరిశీలిస్తోంది. యర్రగొండపాలెం నుంచి వైసీపీనుంచి టీడీపీలో చేరిన డేవిడ్ రాజుకు టికెట్ దక్కనుంది. లేదంటే 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసిన అజితారావును బరిలోకి దింపే అవకాశముంది. డేవిడ్ రాజు పోటీపై టీడీపీ సీనియర్ నేత మన్నే రవీద్ర అసంతృప్తిగా ఉన్నారు.

ఇక గిద్దలూరు నియోజకవర్గంనుంచి వైసీపీలో గెలిచి టీడీపీలో చేరిన ముత్తుముల అశోక్ రెడ్డికి టికెట్ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు వైసీపీ నాయకురాలు పిడతల సాయికల్పనారెడ్డి టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. తనకు కాకపోయినా తన కుమారుడికి అవకాశం కల్పించాలని టీడీపీ అధిష్టానాన్ని ఆమె కోరుతున్నట్టు సమాచారం. కనిగిరి సీటు విషయంలో సందిగ్దత నెలకొంది.. సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావుకు ఈసారి టికెట్ దక్కక పోవచ్చేనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి లేదా వైసీపీ నేత మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి లలో ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం.

English Title
tdp tickets this leaders in prakasam distric

MORE FROM AUTHOR

RELATED ARTICLES