హాట్ కేక్‌గా జిల్లా పరిషత్ ఛైర్మెన్ పదవి

హాట్ కేక్‌గా జిల్లా పరిషత్ ఛైర్మెన్ పదవి
x
Highlights

జిల్లా పరిషత్ పీఠం అనేక మంది రాజకీయ ఉద్దండులను తీర్చిదిద్దింది. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం జెడ్పీ చైర్మెన్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి....

జిల్లా పరిషత్ పీఠం అనేక మంది రాజకీయ ఉద్దండులను తీర్చిదిద్దింది. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం జెడ్పీ చైర్మెన్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. జెడ్పీటీసీగా గెలిచి జెడ్పీ చైర్మన్ పదవిని అలంకరించిన అనేక మంది నేతలు ఉన్నత స్థాయికి ఎదిగారు. మండల, జిల్లా పరిషత్ లు రాజకీయ ఎదుగుదలకు ప్లాట్ ఫామ్ గా భావిస్తారు స్థానిక నేతలు.

తెలంగాణలో జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి ఇప్పుడు హాట్ కేక్ గా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం ఇరవై మూడు జిల్లాలు ఉండటంతో తక్కువ మందికి అవకాశం వచ్చేది. రాష్ట్ర విభజన జరిగాక తెలంగాణలో 33 జిల్లాలు ఏర్పాటు చేశారు. 32 జిల్లా పరిషత్లు ఏర్పాటు అయ్యాయి. దీంతో చాలా మంది జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్నారు.

ఉమ్మడి రాష్ట్ర్రంలో నాటి ఎన్టీఆర్ సర్కార్ మూడు అంచెల పంచాయితీరాజ్ వ్యవస్థలో భాగంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీపీ పదవులు వచ్చాయి. మండల స్థాయిలో మండల పరిషత్, జిల్లాస్థాయిలో జిల్లా పరిషత్ లు అభివృద్ది, సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షిస్తాయి. రాజకీయ ఎదుగుదల ఇదో ఓ ప్లాట్ ఫామ్ గా స్థానిక నాయకులు భావిస్తారు.

జిల్లాలో ఇంచార్జీ మంత్రి తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ ముఖ్యమైన పదవి. జెడ్పీ సమావేశాల్లో అధ్యక్షత వహించే చైర్మన్ కు జిల్లాకు కావాల్సిన అభివృద్ది పథకాలను సాధించే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మంత్రి కంటే ఎక్కువ పవర్స్ వినియోగించుకోవచ్చు. జిల్లా సీఈవో, కలెక్టర్లతో అభివృద్ది పనులు చేయించుకోవచ్చు. దీంతో ఈ పదవంటే చాలా మంది నాయకులు ఇష్టపడుతారు.

ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు అభివృద్ధి నిధులను ప్రశ్నించే హక్కు ఉంటుంది. రహదారులు, తాగునీటి సమస్యలు, ప్రభుత్వ భవనాల మరమ్మతులకు నిధులు రాబట్టవచ్చు. మండలం అభివృద్ధికి కృషి చేయవచ్చు. ఐసీడీఎస్, డ్వాక్రా, ఉపాధి హామీ తదితర పనులు పరిశీలించి అభివృద్ధికి తోడ్పడవచ్చు. ఏవైనా అవకతవకలు జరిగితే మండల, జిల్లా పరిషత్ సమావేశల్లో ప్రశ్నించవచ్చు.

జిల్లా పరిషత్లు, మండల పరిషత్ లు వచ్చాక అనేక మంది యువత రాజకీయాల్లోనికి వచ్చి ఉన్నత స్థాయికి ఎదిగారు. మాజీ మంత్రి ఎంపీ దేవేందర్ గౌడ్ రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్ గా పని చేసారు. కాసాని జ్ఞానేశ్వర్ జెడ్పీటీసీగా ఎన్నికై ఎమ్మెల్సీగా ఎన్నికైతే, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే గా పనిచేసారు. డీ.కే.అరుణ జెడ్పీటీసీ నుంచే ఎమ్మెల్యే అయ్యారు. వరంగల్ కు చెందిన బొడకుంటి వెంకటేశ్వర్లు జెడ్పీ చైర్మన్ గా,ఎంపీగా చేసి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి సునీతా మహేందర్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, మహబూబ్ నగర్ టీఆర్ఎంస్ ఎంపీగా పోటీ చేసిన శ్రీనివాస్ రెడ్డి గతంలో ఎంపీటీసీగా పనిచేసినవారే. అచ్చంపేట్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గతంలో ఎంపీటీసీగా పనిచేసారు. ఇలా అనేక మంది స్థానిక నాయకులు తమ రాజకీయ భవిష్యత్తును సర్పంచ్ గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా పని చేసి ఉన్నత స్థాయికి ఎదిగారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు ఆయా పార్టీల్లో మంచి డిమాండ్ ఉంది. మహిళా రిజర్వేషన్ల స్థానాలలో కుటుంబ సభ్యులను బరిలో దించేందుకు పెద్ద నాయకులు ఆసక్తి చూపుతుండడం ఆ పదవుల పరపతిని తెలియజేస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories