ఏపీ కేంద్రంగా ఢిల్లీ రాజకీయాలు..ఆంధ్రప్రదేశ్ పై ఫోకస్ చేసిన బీజేపీ అధిష్టానం

ఏపీ కేంద్రంగా ఢిల్లీ రాజకీయాలు..ఆంధ్రప్రదేశ్ పై ఫోకస్ చేసిన బీజేపీ అధిష్టానం
x
Highlights

హస్తినలో ఏపీ కేంద్రంగా రాజకీయాలు త్వరత్వరగా మారుతున్నాయి. చిరకాల మిత్రపక్షం అయిన తెలుగుదేశం ఎన్డీయే నుంచి బయటకు వెళ్లిపోవడం.. అవిశ్వాసం పెట్టడం వంటి...

హస్తినలో ఏపీ కేంద్రంగా రాజకీయాలు త్వరత్వరగా మారుతున్నాయి. చిరకాల మిత్రపక్షం అయిన తెలుగుదేశం ఎన్డీయే నుంచి బయటకు వెళ్లిపోవడం.. అవిశ్వాసం పెట్టడం వంటి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న బీజేపీ అధిష్టానం.. రాష్ట్రానికి చెందిన తమ పార్టీ నాయకులను ఢిల్లీకి రావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో.. ఏపీ నాయకులు కీలక సమావేశం కానున్నారు.

విభజన హామీల అమలు లక్ష్యంగా పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ.. తొలుత కేంద్ర మంత్రివర్గం నుంచి.. ఆ తర్వాత ఎన్డీయే నుంచి బయటకు వచ్చి కేంద్రంపై పోరాటం ఉధృతం చేసింది. అందులో భాగంగా మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో గత కొన్ని రోజులుగా ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న బీజేపీ అధిష్టానం ఎట్టకేలకు స్పందించింది. రాష్ట్రానికి చెందిన తమ పార్టీ నాయకులను ఢిల్లీకి రావాలంటూ సమాచారాన్ని పంపింది.

శనివారం సాయంత్రం.. ఏపీ కోర్ కమిటీ నాయకులతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కీలక సమావేశం కానున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్‌రాజు తదితరులకు హస్తిన నుంచి పిలుపు వచ్చింది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై వీరంతా కూలంకషంగా చర్చించనున్నారు. విభజన హామీల అమలుతో పాటు.. ప్రత్యేక హోదా అంశం కూడా చర్చకు రానుంది. అంతేకాకుండా.. భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాలపై కూడా వీరు చర్చించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. ఏ రకమైన వ్యూహన్ని అనుసరిస్తే రాజకీయంగా బీజేపీకి ప్రయోజనం ఉంటుందనే అంశంపై చర్చించే అవకాశం ఉంది.

ఇటు రాష్ట్రంలో కూడా బీజేపీతో పొత్తుకు మంగళం పాడిన దరిమిలా.. వచ్చే ఎన్నికల్లో ముందుకు వెళ్లే అవకాశాలను కూడా పరిశీలించనున్నారు. చాలాకాలం నుంచి టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తున్న రాష్ట్ర నాయకత్వం.. సొంతంగా ఎదిగే అవకాశాలను అధిష్టానం ముందుంచనున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందనే అంశం ఆసక్తిగా మారనుంది. 2019 లో ఒంటరిగా వెళ్తుందా.. లేక కలిసి వస్తానన్న జగన్ తో అడుగులు వేస్తుందా అనే అంశంపై కూడా ఓ అంచనాకు రానున్నారు. అయితే రానున్న రోజుల్లో రాష్ట్రంలో చోటు చేసుకునే రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని పొత్తులపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories