మోడీకి భార్య - పిల్ల‌లుంటే ఇలా చేయ‌రు క‌దా

Submitted by lakshman on Sun, 04/08/2018 - 16:01
TDP MPs Arrested In Delhi For Protesting In Front Of PM Modi House

ప్రత్యేక హోదా కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు పోరాటం చేస్తున్నాయి. పైచేయి కోసం టీడీపీ, వైసీపీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓ వైపు ఢిల్లీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆమరణ దీక్ష చేస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతలు ఆదివారం ప్రధాని మోడీ నివాసం వద్ద ఆందోళనకు దిగారు. వైసీపీ ఎంపీల ఆమరణ దీక్ష, మరోవైపు టీడీపీ ఎంపీల ఆందోళన.. ఇలా డిల్లీలో ఇరు పార్టీలు పైచేయి కోసం ప్రయత్నిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. 
వైసీపీ ఎంపీల ఆమరణ నిరాహార దీక్ష నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ ఎంపీలను మరో రెండు రోజులు ఢిల్లీలోనే ఉండాలని ఆదేశించినట్లుగా పలువురు భావిస్తున్నారు. ఎంపీలు ఏపీకి బయలుదేరి చంద్రబాబు ఆదేశాలతో వెనక్కి వెళ్లినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. శనివారం తిరిగి వెళ్లినవారు ఆదివారం ప్రధాని నివాసం ఎదుట ఆందోళన చేపట్టారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఢిల్లీ పర్యటనకు వచ్చారు.తమను పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో టీడీపీ ఎంపీలు ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు. మోడీ నియంతలా వ్యవహరిస్తున్నారని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ప్రతి రాష్ట్రాన్ని గోద్రాలా మార్చాలని చూస్తున్నారన్నారు. పెళ్లాం, పిల్లలు ఉన్నవాళ్లకు ఏపీ ఆందోళనలు అర్థమవుతాయన్నారు. ప్రేమ, కుటుంబం లేని వ్యక్తి మోడీ అన్నారు. ఆయనది లెక్కలేనితనం అన్నారు. కనీసం భార్యాపిల్లలు లేకున్నా ఇద్దరిని దత్తత తీసుకున్నా కుటుంబం విలువ తెలిసేదన్నారు. మోడీ కర్కోటక హృదయుడు అన్నారు. హింస.. హింస.. అని ధ్వజమెత్తారు.
 చాలా అనైతికంగా విభజన జరిగిందని, ఆ సమయంలో ప్రధాని మోడీ హామీలు ఇచ్చారని, వాటినే అమలు చేయమని అడుగుతున్నామని, ఇచ్చిన హామీలను అమలు చేయమని ప్రశ్నిస్తే ఇలా వ్యవహరిస్తారా అని మురళీ మోహన్ అన్నారు. తాము ప్రధాని నివాసం వద్ద నిరసన వ్యక్తం చేయాలని వచ్చామన్నారు. తమ రాష్ట్రానికి న్యాయం చేయమంటే అరెస్టు చేస్తున్నారన్నారు. మా గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఏపీకి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్నారు.
 ఏపీకి న్యాయం చేయాలని పార్లమెంటులో గొంతు చించుకున్నామని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. కానీ ప్రధాని మాత్రం ఒక్క మాట మాట్లాడలేదన్నారు. ఎంపీలం అని కూడా చూడకుండా అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. ప్రధాని స్వయంగా దీనిపై స్పందించాలన్నారు. 30 రోజుల నుంచి పార్లమెంటులో తాము గొంతు చించుకుంటున్నామన్నారు. ఇది సరికాదన్నారు. ఏపీకి న్యాయం చేయాలని, దీనిపై ప్రధాని మాట్లాడాలన్నారు. మోడీకి అన్ని విషయాలు తెలుసునని చెప్పారు. ఎంపీలు అని చూడకుండా అదుపులోకి తీసుకుంటారా అన్నారు. వీ వాంట్ జస్టిస్ అని నినాదం చేశారు.
 

English Title
TDP MPs Arrested In Delhi For Protesting In Front Of PM Modi House

MORE FROM AUTHOR

RELATED ARTICLES