భగ్గుమన్న తాడిపత్రి

x
Highlights

అనంతపురం జిల్లా తాడిపత్రిలో పరిస్ధితి నివురుగప్పిన నిప్పులానే ఉంది. ప్రబోదానందస్వామి భక్తులకు జేసీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం ఇంకా కొనసాగుతూనే...

అనంతపురం జిల్లా తాడిపత్రిలో పరిస్ధితి నివురుగప్పిన నిప్పులానే ఉంది. ప్రబోదానందస్వామి భక్తులకు జేసీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. వినాయక నిమజ్జన సమయంలో రేగిన వివాదం చినికిచినికి గాలివానగా మారి 48 గంటలు గడుస్తున్నా పరిస్ధితులు ఇంకా సద్దుమణగలేదు. చిన్నపడమల, పెద్దపడమల గ్రామాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గాల కు చెందిన పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసం అయ్యాయి. తాడిపత్రి పోలీసు స్టేషన్ ఎదుట భైఠాయించిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రబోదానందస్వామి ఆశ్రమాన్ని సీజ్ చేయాలంటూ పట్టుబట్టారు. పట్టణంలో 144వ సెక్షన్ విధించిన పోలీసులు వినాయక నిమజ్జన వేడుకలను వాయిదా వేశారు. పరిస్దితి విషమించే అవకాశాలు ఉండటంతో భారీగా బలగాలను మోహరించారు.

చిన్నపొలమడ గ్రామంలో శనివారం రోజు గణేశ్‌ నిమజ్జన ఉత్సవం నిర్వహిస్తూ ఉండగా ఈ వివాదం చోటు చేసుకుంది. పెద్దపొలమడకు చెందిన టీడీపీ కార్యకర్తలు వినాయక విగ్రహాలను ఊరేగిస్తూ ఉండగా ప్రబోధానంద ఆశ్రమం దగ్గర చేరుకున్న సమయంలో ఘర్షణ ప్రారంభమైంది. తమపై రంగులు చల్లారంటూ ఆశ్రమంలోని కొందరు భక్తులు గ్రామస్తులతో వాగ్వాదానికి దిగారు. మాటమాట పెరగడంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో గ్రామస్తులకు చెందిన వాహనాలతో పాటు రెండు బండల ఫ్యాక్టరీలను ఆందోళనకారులు తగులబెట్టారు.

ఇదే సమయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ప్రబోధానంద శిష్యులు రోడ్డుపై భైఠాయించి ఆందోళనకు దిగారు. దీనికి పోటీగా టీడీపీ కార్యకర్తలు కూడా నిరసనకు దిగడంతో పరిస్ధితి విషమించింది. ఇదే సమయంలో టీడీపీ కార్యకర్తలకు మద్ధతుగా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సైతం ఆందోళనకు కూర్చోవడం పోలీసులు నచ్చజెప్పినా వినకపోవడంతో పరిస్ధితి నివురుగప్పిన నిప్పులా మారింది. జిల్లా ఎస్పీ స్వయంగా పరిస్ధితులను సమీక్షిస్తున్నా పరిస్ధితుల్లో మార్పు రాకపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories