గురుకులాల గూడులో చిన్నబోయిన కార్పొరేట్‌ కాలేజీలు

గురుకులాల గూడులో చిన్నబోయిన కార్పొరేట్‌ కాలేజీలు
x
Highlights

వారంతా లక్షలకు లక్షలు పెట్టి చదువుకోలేదు. అత్యాధునిక వసతులు కలిగిన కార్పోరేట్ కాలేజీలకు వెళ్లలేదు. ట్యూటర్ల సమక్షంలో 24 గంటలు పుస్తకాలతో కుస్తీలు...

వారంతా లక్షలకు లక్షలు పెట్టి చదువుకోలేదు. అత్యాధునిక వసతులు కలిగిన కార్పోరేట్ కాలేజీలకు వెళ్లలేదు. ట్యూటర్ల సమక్షంలో 24 గంటలు పుస్తకాలతో కుస్తీలు పట్టలేదు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుంటూ అత్యుత్తమ ఫలితాలను సాధించారు. ఉపాధ్యాయుల సహకారంతో తమదైన ప్రతిభతో కొత్త చరిత్రను స్పష్టించారు. కార్పోరేట్ కాలేజీలు సైతం చిన్నబోయేలా ఫలితాలు సాధించి నవ చరిత్రకు నాంది పలికారు.

గత కొన్నేళ్లుగా అటు మార్కుల్లో, ఇటు ఉత్తీర్ణతలో అగ్రస్ధానంలో నిలుస్తూ వచ్చిన కార్పోరేట్ కాలేజీలకు తెలంగాణ గురుకులాల విద్యార్థులు చెక్ పెట్టారు. బీసీ గురుకులాల విద్యార్ధులు ఏకంగా 89.8 శాతం ఉత్తీర్ణత సాధించి అగ్రభాగాన నిలవగా 88.8 శాతంతో విద్యాశాఖ గురుకులాలు రెండో స్థానంలో నిలిచాయి. తరువాతి స్ధానాల్లో ఎస్సీ, ఎస్టీ గురుకులాలు, మోడల్‌స్కూల్స్, కేజీబీవీలు మూడు, నాలుగు స్ధానాల్లో నిలిచాయి. తొలి సంవత్సరం పరీక్షలకు 2,272 మంది హాజరవగా 1934 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 1633 మంది హాజరవగా 1474 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది ఫలితాల్లో ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కాలేజీలు ఉత్తీర్ణత శాతంలో ఐదో స్థానానికి పడిపోయాయి.

ఉత్తీర్ణతలోనే కాదు అధిక శాతం మార్కులు సాధించడంలోనూ గురుకుల విద్యార్ధులు సత్తా చాటారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాల విద్యార్థుల్లో 59 శాతంమంది 90% పైగా మార్కులు సాధించగా.. 29% విద్యార్థులు 95% పైగా మార్కులు సాధించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 470కి 464 మార్కులు సాధించి గురుకులాల సత్తాచాటారు. ర్యాంకులపరంగా ఇది రాష్ట్రస్థాయిలో నాలుగోర్యాంకు సాధించారు. ఎంపీసీలో వరుసగా మొదటి పది ర్యాంకులు కూడా సాధించినట్టు అధికారులు ప్రకటించారు. బైపీసీలో 440 మార్కులకుగాను వరుసగా 432, 431, 430, 429, 428 మార్కులు సాధించి రాష్ట్ర స్ధాయిలో గురుకుల విద్యార్ధులు సత్తా చాటారు.

ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్ర సగటు ఉత్తీర్ణత 65% ఉండగా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకన్నా గురుకుల విద్యార్థులు మెరుగైన ప్రతిభ చూపించారు. సెకండియర్ ఫలితాల్లో బీసీ గురుకులాల సొసైటీ కళాశాలల్లోని విద్యార్థులు రాష్ట్రంలోనే అత్యధికంగా 90.29% ఉత్తీర్ణత సాధించారు. మహేశ్వరం, నాగార్జునసాగర్ గురుకులాల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 100% ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫలితాలను స్వాగతిస్తున్న విద్యా ప్రముఖులు, సామాజికవేత్తలు కేజీ టూ పీజీ ఉచిత దిశగా ఇదో అడుగంటున్నారు. ప్రభుత్వం మరిన్ని అవకాశాలు కల్పిస్తే లక్ష్మి కటాక్షం లేని సరస్వతి పుత్రులకు కొండంత అండ లభిస్తుందని చెబుతన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories