logo

కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు

కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు

అంతర్గత ప్రజాస్వామ్యం కాసింత ఎక్కువగా కనిపించే కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు అత్యంత సాధారణం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాయకుల మధ్య భేదాభిప్రాయాలు మరింత ఉధృతంగా కనిపిస్తుంటాయి. ఆశావహుల సంఖ్య ఎక్కువగా కనిపించే నియోజకవర్గాల్లో హస్తం పాలిటిక్స్ హాట్‌ హాట్‌గా సాగుతాయి. తాజాగా గ్రేటర్‌తో పాటు భువనగిరి, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ సమావేశాల్లో అసమ్మతి నేతల హంగామాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కాంగ్రెస్‌ రాజకీయాలు రచ్చ రచ్చవుతున్నాయి. ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆగ్రహావేశాలు తాజాగా భగ్గుమంటున్నాయి. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం విషయంలో ఇద్దరు దిగ్గజాల మధ్య వార్ గాంధీభవన్‌లోనే మంటరాజేసింది. మాజీ క్రికెటర్, కాంగ్రెస్ సీనియర్ లీడర్ అజారుద్దీన్ సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు ఇటీవల చేసిన ప్రకటన ఆ పార్టీ గ్రేటర్‌ క్యాడర్‌లో అగ్గిరాజేసింది. అజహర్ ప్రకటనపై సోమవారం గాంధీభవన్‌లో జరిగిన గ్రేటర్ నాయకుల సమావేశంలో అంజన్‌ కుమార్ యాదవ్ వర్గం ఆందోళనకు దిగింది.

ఏఐసీసీ ఇంఛార్జ్ బోస్‌ రాజు ముందే అంజన్‌ కుమార్ యాదవ్ అనుచరులు అజహరుద్దీన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సమావేశం రసాబాసాగా మారింది. పరిస్థితిని గమనించిన పీసీసీ చీఫ్ ఉత్తమ్, సర్వే సత్యనారాయణ ఉద్రిక్తతను చల్లార్చే ప్రయత్నం చేశారు. సికింద్రాబాద్ స్థానం నుంచి తానే పోటీచేస్తానని ప్రకటించిన అంజన్ అజహారుద్దీన్‌కు దమ్ముంటే హైదరాబాద్ నుంచి ఒవైసీపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. మరోవైపు అజారుద్దీన్ వెనక రాష్ట్ర క్యాడర్‌కు చెందిన కొందరు లీడర్లున్నారని హెచ్‌ఎం టీవీకి తెలిపారు. రాహుల్ గాంధీ ఆదేశంతోటే చేయి గుర్తుపైనే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

ఇటు ఈ వర్గవిభేదాలు ఒక్క గ్రేటర్‌కే పరిమితం కాలేదు. యాదాద్రి భువనగిరి కాంగ్రెస్‌ లో కూడా సేమ్ అలాంటి సీన్ కనిపించింది. భువనగిరి పార్లమెంట్ పరిధి కాంగ్రెస్ సమీక్షా సమావేశంలో రసాబాసా నెలకొంది. నినాదాలు చేస్తూ రెండు వర్గాల నాయకులు హోరెత్తించారు. నియోజకవర్గ ఇంచార్జీ కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వర్గీయుల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అనిల్‌కుమార్‌ వర్గీయులకే ప్రాధాన్యమిస్తున్నారని కోమటిరెడ్డి వర్గానికి చెందిన నాయకులు ఆరోపిస్తూ నినాదాలు చేశారు.

ఇదిలా ఉంటే నిజామాబాద్ కాంగ్రెస్‌లో కూడా అసమ్మతి భగ్గుమంది. ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్ కృష్ణన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీఎస్ ను మళ్లీ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించవద్దంటూ నాయకులు ఖరాఖండిగా చెప్పేశారు. నాలుగేళ్లుగా పార్టీని కాపాడుకుంటున్నామని డీఎస్ వస్తే మళ్లీ వర్గపోరు మొదలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా సాగుతుండగానే జుక్కల్, డిచ్‌పల్లికి చెందిన పలువురు కార్యకర్తలు సమావేశంలో గలాటా సృష్టించారు. తమ నాయకులకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆందోళనకు దిగారు. దీంతో సమావేశానికి కాసేపు బ్రేక్ పడింది.

లైవ్ టీవి

Share it
Top