కుర్చీల కోసం కోట్లాడుకుంటున్న తెలుగు త‌మ్ముళ్లు

Submitted by arun on Sat, 01/13/2018 - 11:22
kurnool

కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో అధికార టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సందర్భం ఏదైనా.. వేదిక ఎక్కడైనా.. రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి తమ ఆధిపత్యం చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిన్నటి వరకు ఎస్వీ, టీజీ భరత్ లకే పరిమితమైన మాటల యుద్ధంలోకి టీజీ ఎంటరయ్యారు. ఒకే కుటుంబానికి మూడు సీట్లు ఉన్నాయని, ఒక సీటు తగ్గినా నష్టం లేదని జన్మభూమి ముగింపు వేదికపై ఎస్వీకి టీజీ కౌంటర్ వేశారు. 


కర్నూలులో తెలుగు తమ్ముళ్లు బహిరంగంగా కుర్చీల కోసం కొట్లాడుతున్నారు. ప్రతి చోటా ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. విభేదాలు వీడి నేతలంతా కలసి మెలసి ఉండాలని పార్టీ అధినేత హెచ్చరించడంతో.. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్ని చోట్లా కలిసి కనిపిస్తున్నారు. అయితే మైకు పట్టుకుంటే మాత్రం మాటల యుద్ధమే జరుగుతోంది. జన్మభూమి చివరి రోజున మాటల యుద్ధం కొత్త పుంతలు తొక్కింది.

తనంటే గిట్టనివారు దుష్ప్రచారం చేస్తున్నారని సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పరోక్షంగా టీజీ వెంకటేష్ పై అసంతృప్తి వెళ్లగక్కారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన కర్నూలు నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునేందుకు ఊపిరున్నంత వరకు ప్రయత్నిస్తానని ఎస్వీ చెప్పారు. తనపై వస్తున్న పుకార్ల మేరకు తాను పత్తికొండ సీటు అడిగితే.. ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి తనను తుంగభద్రలో కలిపేస్తారని.. అదే ఆళ్లగడ్డ సీటు అడిగితే.. భార్యాపిల్లలు తనను ఇంట్లోకి రానివ్వరని సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నారు. 

కర్నూలు అసెంబ్లీ టికెట్ విషయంలో ఎస్వీ మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై టీజీ వెంకటేష్ కౌంటర్ ఇచ్చారు. ఒకే కుటుంబానికి మూడు సీట్లా అని ప్రశ్నించారు. మూడింటిలో ఒకటి పోతే ఏమీ కాదని వ్యాఖ్యానించారు. ఎస్వీ మోహన్ రెడ్డి టికెట్ కు ఢోకా లేదని.. నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది కాబట్టి అందరికీ టికెట్లు వస్తాయని టీజీ వేడెక్కిన వాతావరణాన్ని కొంత చల్లార్చబోయారు. 
అయితే ఒకే కుటుంబానికి మూడు సీట్లా అంటూ టీజీ వెంకటేష్ కొత్త వాదన తెరపైకి తేవడం చర్చనీయాంశం అయింది. 

English Title
SV Mohan Reddy vs tg venkatesh

MORE FROM AUTHOR

RELATED ARTICLES