logo

హంగ్‌ వస్తే.. ఎవరు ఎటువైపు...ఆసక్తికరంగా మారిన తెలంగాణ పొలిటికల్‌ స్క్రీన్‌

హంగ్‌ వస్తే.. ఎవరు ఎటువైపు...ఆసక్తికరంగా మారిన తెలంగాణ పొలిటికల్‌ స్క్రీన్‌

ఫలితాలకు మరికొన్ని గంటలే మిగిలి ఉండటంతో విజయం ఎవరివైపు మొగ్గుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అన్ని పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూనే.. రాబోయే పరిణామాలపై ముందస్తు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోతే పరిస్థితి ఏంటనే దానిపై కూడా చర్చ జరుగుతోంది. హంగ్‌ వస్తే కింగ్‌ ఎవరు..? కింగ్‌ మేకర్‌ ఎవరనే దాని చుట్టే రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. మొదటి నుంచి మజ్లీస్‌ పార్టీ తమకు మద్దతిస్తుందని అందుకే వారి స్థానాల్లో తమకు ఫ్రెండ్లీ పోటీ ఉందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ చెప్పుకొస్తూనే ఉన్నారు. అయితే తాజా పరిణామాలతో ఎంఐఎం వైఖరి ఎలా ఉండబోతోందనే దానిపైనే ఆసక్తి నెలకొంది.

నిన్న కేసీఆర్‌కు ఫోన్‌ చేసిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఇవాళ ఆయనతో భేటీ కానున్నారు. దీంతో వీరిద్దరి సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ప్రచారం సమయంలో కూడా టీఆర్ఎస్‌కే ఓటెయ్యాలని అసదుద్దీన్‌ ఒవైసీ చెప్పుకొచ్చారు. తాము లేనిచోట్ల టీఆర్ఎస్‌ అభ్యర్థులకే మద్దతివ్వాలని స్పష్టం చేశారు. అయితే ఫలితాలపై అంచనాలు మారడంతో మజ్లీస్‌ తన వైఖరి మార్చుకునే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు.

ఇటు మజ్లీస్‌ను తమ దారికి తెచ్చుకునేందుకు ప్రజాకూటమి కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. వారితో ఒకదఫా చర్చలు కూడా జరిపినట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయంపై అప్పుడే స్పందించబోనని ఒవైసీ చెప్పుకొచ్చారు. దీంతో మజ్లీస్‌ ఎటువైపు అనేది ఆసక్తికరంగా మారింది. మరో 5 నెలల్లో సాధారణ ఎన్నికలు రానున్నాయి. అలాగే రేపు వెలువడనున్న 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ విజయంపై ధీమా వ్యక్తం చేస్తోంది. ఒకవేళ 4 రాష్ట్రాల ఫలితాల్లో కాంగ్రెస్‌ గ్రాండ్‌ విక్టరీ కొడితే వచ్చే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా తెలంగాణలో మజ్లీస్‌ ప్రజాకూటమికి మద్దతిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు బీజేపీ కూడా తనవంతు వ్యూహాలను సిద్ధం చేస్తోంది. గతం కన్నా ఎక్కువ స్థానాల్లో గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్న కమలం పార్టీ ఫలితాల తర్వాత ఎవరికి మద్దతివ్వాలనే దానిపై కసరత్తులు ముమ్మరం చేస్తోంది. కాంగ్రెస్‌, మజ్లీస్‌ పార్టీలు లేని ప్రభుత్వానికే తమ మద్దతని బీజేపీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు అధికారం దక్కకుండా చూడాలనేదే ఆ పార్టీ వ్యూహంగా తెలుస్తోంది. ఒకవేళ హంగ్‌ వస్తే తమ పార్టీ మద్దతు కీలకం అని భావిస్తున్న బీజేపీ పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. లేకపోతే టీఆర్ఎస్‌ మజ్లీస్‌ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఏం చేయాలనేదానిపై కూడా చర్చించినట్లు చెబుతున్నారు. అవసరాన్ని బట్టి ప్రభుత్వంలో చేరకుండా.. బయటి నుంచి మద్దతిచ్చేందుకు కూడా సిద్ధమనే సంకేతాలు ఇస్తోంది.

ఒకవేళ ప్రభుత్వ ఏర్పాటుకు తమ మద్దతే కీలకం అనుకుంటే.. కచ్చితంగా సంకీర్ణంలో చేరాలని కూడా బీజేపీ యోచిస్తోంది. అయితే ఈ తాజా ప్రతిపాదనలను.. రాష్ట్ర నాయకత్వం.. హైకమాండ్‌ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్‌కు అధికారం దక్కకుండా చేయడమే తమ ముందున్న లక్ష్యమని.. అందులో భాగంగానే ఈ ప్రతిపాదనలని.. ఢిల్లీ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఫలితాలు వెలువడ్డాకే పూర్తిస్థాయి నిర్ణయం తీసుకోవాలని.. హైకమాండ్‌ నుంచి ఆదేశాలు కూడా అందాయని చెబుతున్నారు.

తెలంగాణలో ఒకవేళ కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రజాకూటమి అధికారంలోకి వస్తే.. జాతీయస్థాయిలో సమీకరణాలు మారే అవకాశం ఉందని.. బీజేపీ భావిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌, ఏపీలో టీడీపీ బలపడే అవకాశం ఉంటుందని.. దీంతో ఈ ఫలితాలు వచ్చే సార్వత్రిక ఎన్నికలపై పడుతుందని.. రాష్ట్ర బీజేపీ నాయకత్వం భావిస్తోంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు అధికారం దక్కకూడదనే ఏకైక ఎజెండాతో బీజేపీ పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు.

లైవ్ టీవి

Share it
Top