పల్నాడులో పంతం నెగ్గించుకునే నేత ఎవరు?

పల్నాడులో పంతం నెగ్గించుకునే నేత ఎవరు?
x
Highlights

గుంటూరు జిల్లా గురజాల అసెంబ్లీ నియోజకవర్గం. పల్నాటి యుద్ధం బ్రహ్మనాయుడు చాపకూటి సిద్ధాంతం ఇవి వింటే మొట్టమొదటగా గుర్తొచ్చేది గురజాలే. చారిత్రక నేపథ్యం...

గుంటూరు జిల్లా గురజాల అసెంబ్లీ నియోజకవర్గం. పల్నాటి యుద్ధం బ్రహ్మనాయుడు చాపకూటి సిద్ధాంతం ఇవి వింటే మొట్టమొదటగా గుర్తొచ్చేది గురజాలే. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ నియోజకవర్గంలో తాజా ఎన్నిక ఉత్కంఠ కలిగిస్తోంది. టీడీపీ, వైసీపీలు తాడోపేడో తేల్చుకునేందుకు రంగంలోకి దిగాయి. గురజాల వైసీపీ అభ్యర్థిగా మాజీ సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి తమ్ముడి మనవడు కాసు మహేశ్‌ రెడ్డి, తెలుగుదేశం నుంచి సీనియర్‌ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌ సై అన్నారు. ఈసారి ఎలాగైనా గెలవాలని వైసీపీ పట్టుదలగా ఉండగా, తిరిగి స్థానాన్ని కాపాడుకోవాలని తెలుగుదేశం అస్త్రశస్త్రాలూ ప్రయోగించింది. మరి పల్నాటిగడ్డపై ఈసారి వాడివేడి కత్తి దూసింది ఎవరు?

గుంటూరు జిల్లా గురజాల, పల్నాటి యుద్ధంలో తొడగొట్టిన ప్రాంతం. ఈసారి జరిగిన ఎన్నికలు కూడా, పల్నాటి సమరాన్నే తలపించాయి. నువ్వానేనా అన్నట్టుగా టీడీపీ, వైసీపీ అభ్యర్థులు కత్తులు దూశారు. గురజాల నియోజకవర్గంలో ప్రధానంగా టీడీపీ, వైఎస్‌ఆర్‌ సీపీ మధ్య హోరాహోరీ పోరు సాగింది. గురజాల ఎమ్మెల్యే అభ్యర్ధిగా టీడీపీ నుంచి యరపతినేని శ్రీనివాసరావు ఆరోసారి బరిలో నిలిచారు. వైసీపీ నుంచి కాసు మహేష్‌ రెడ్డి సై అన్నారు.

నియోజకవర్గంలో 2లక్షల 60 వేలకు పైగా ఓటర్లు వున్నారు. గురజాల, దాచేపల్లి, మాచవరం, పిడుగురాళ్ల టౌన్, రూరల్ మండలాలలో పురుషులు కంటే మహిళ ఓటర్లే ఎక్కువుగా వున్నారు. వారి తీర్పు ఎవరి వైపు అన్నది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికలలో పిడుగురాళ్ల రూరల్ మినహా అన్ని మండలాల్లో టీడీపీ ఆధిపత్యం చూపింది. యరపతినేనికి దీటైన అభ్యర్థి కోసం అన్వేషించింది వైసీపీ. ఈ వేటలో కాసు కుటుంబ వారసుడు, కాసు మహేష్ రెడ్డి కనిపించాడు. దీంతో వెంటనే మహేష్‌ను రంగంలోకి దించింది. ఎన్నికలు ఏడాది ముందుగానే కాసు మహేశ్వర రెడ్డిని గురజాల ఇంచార్జ్‌గా ప్రకటించింది. అప్పటి నుంచే నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టారు మహేష్.

ఎన్నికల ప్రచారంలో ఇద్దరు అభ్యర్థులూ హోరాహోరీగా దూసుకెళ్లారు. పదునైన అస్త్రాలనే సంధించారు. యరపతినేని శ్రీనివాసరావు తాను లోకల్ కాసు మహేష్‌ రెడ్డి నాన్ లోకల్ అంటూ ప్రచారం చేశారు. పసుపు కుంకుమ, వృద్ధులుకు షష్ఠి పూర్తి, బాలింతలకు శ్రీమంతాలు లాంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువయ్యారు. 1994లో యువనాయకుడుగా రాజకీయలో ఎంట్రీ ఇచ్చిన యరపతినేని,1994,2004లో రెండుసార్లు ఓడిపోయినా, అత్యధికసార్లు గెలిచారు.

కాసు మహేష్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. కాసు బ్రహ్మనందరెడ్డికి మనవడు, కాసుకృష్ణా రెడ్డికి తనయుడు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండటంతో కాసు మహేష్‌ను గురజాల నుంచి పోటీ చేయాలని అదేశించింది వైసీపీ. దీంతో యరపతినేనికి కాసు గట్టి ప్రత్యర్థిగా భావించింది వైసీపీ. యరపతినేని నియోజకవర్గాన్ని దోచుకున్నారని, మైనింగ్ పేరుతో కోట్లాది రూపాయల అవినీతి సొమ్ము వెనకేసుకున్నారంటూ అనేక ఆరోపణలు సంధించారు కాసు. ఇవే తనను గెలుపు తీరానికి చేరుస్తాయని నమ్మకంగా ఉన్నారు. జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వాలన్న పిలుపు కూడా బాగా పని చేసిందని లెక్కలేస్తున్నారు. ఏదిఏమైనా నియోజకవర్గంలో రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఎవరు గెలుస్తారన్నది ఊహకే అందడం లేదు. పల్నాటి యుద్ధంలా ఎన్నికలు హోరాహోరీగా సాగాయని, స్థానికులంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories