ఐర్లాండ్ నుంచి వచ్చి.. సర్పంచ్ బరిలో నిలిచి

Sushmita
x
Sushmita
Highlights

విదేశాల్లో ఉన్నత ఉద్యోగం నెలకు లక్షల్లో జీతం కోరుకున్నట్టు సాగిపోతున్న ఆనందకరమైన జీవితం. కాని అవధులు లేని ఆనందాన్ని వద్దనుకుంది. పుట్టి పెరిగిన పల్లెనే ప్రపంచంగా భావించింది.

విదేశాల్లో ఉన్నత ఉద్యోగం నెలకు లక్షల్లో జీతం కోరుకున్నట్టు సాగిపోతున్న ఆనందకరమైన జీవితం. కాని అవధులు లేని ఆనందాన్ని వద్దనుకుంది. పుట్టి పెరిగిన పల్లెనే ప్రపంచంగా భావించింది. సొంతూరుకు సేవ చేయడమే నిజమైన అదృష్టంగా భావించింది. పల్లె మట్టి పరిమలాలతోనే పయనం సాగించాలని నిర్ణయించుకుంది. అనుకుందే తడవుగా సొంతూరుకు వచ్చి రాజకీయ రంగ ప్రవేశం చేసింది.

ఈ యువతి పేరు సుస్మిత నాయుడు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లికి చెందిన సుస్మితా ఐర్లాండ్ లోనే ఎంబీఏ పూర్తి చేసింది. అక్కడే సాప్ట్ వేర్ ఉద్యోగినిగా స్ధిరపడింది. లక్షల్లో వేతనం సాగిస్తూ ఆనందకరమైన జీవిస్తూ ఉండేది. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పంచాయతి ఎన్నికల నోటిఫికేషన్‌లో ఎడపల్లిని బీసీ మహిళకు రిజర్వ్ చేసింది. తండ్రి రాజకీయాల్లో ఉండటంతో చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే సుస్మితకు ఆసక్తి ఉండేది. అయితే ప్రజా సేవలో పాల్గొనే అవకాశం రాకపోవడంతో ఉద్యోగానికే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో అనుకోకుండా వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు లక్షల్లో వస్తున్న వేతనాన్ని వదులుకుంది.

ప్రజా సేవే తన లక్ష్యమంటూ ప్రకటించిన సుస్మిత నామినేషన్ వేసిన రోజు నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఇంటింటి ప్రచారం చేస్తోంది. గ్రామాభివృద్ధి కోసం తన దగ్గరున్న ప్రణాళికలను వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటోంది. మౌళిక వసతుల కల్పన, గ్రామ పరిధిలోనే మెరుగైన ఉపాధి అవకాశాలను వివరిస్తూ ప్రచారంలో సుస్మిత దూసుకుపోతోంది. యువతరంపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందంటున్న సుస్మిత తనలాంటి యువత గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందంటూ సెంటిమెంట్ రగిలిస్తున్నారు.

సుస్మితకు తోడుగా తండ్రి, ఇతర కుటుంబ సభ‌్యులు ప్రచారం సాగిస్తున్నారు. లక్షల్లో జీతం వదులుకుని రావడం ఇబ్బందిగానే అనిపించినా గ్రామంపై ఉన్న మమకారం, రాజకీయాన్ని సేవగా భావించే కూతురు ఉండటం తనకు గర్వకారణమని సుస్మిత తండ్రి చెబుతున్నారు. తాను మూడు దశాబ్ధాల్లో చేయలేని అభివృద్ధి తన కూతురు ఐదేళ్లలో చేసి చూపుతుందంటూ భరోసా వ్యక్తం చేస్తున్నారు.

సుస్మిత ప్రచారానికి గ్రామస్తులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. అవినీతి రహిత ప్రణాళికతో ముందుకు వస్తున్న సుస్మితకు తమ ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందంటూ భరోసానిస్తున్నారు. ప్రస్తుతం గ్రామ సర్పంచ్‌గా ముగ్గురు వ్యక్తులు పోటీ పడుతున్నారు. ఈ నెల 25న గ్రామానికి జరగనున్న ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తిగా మారింది. విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్న సుస్మిత గ్రామమే తన కుటుంబమంటూ ప్రచారం చేస్తున్నారు .గెలుపు ఓటములతో సంబంధం లేకుండా గ్రామాభివృద్ధి పాటు పడతానంటూ తేల్చి చెబుతూ ప్రచారం సాగిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories