హృదయ విదారక ఘటన

హృదయ విదారక ఘటన
x
Highlights

గుంటూరు: గుంటూరు జిల్లా శివారు అడవి తక్కెళ్లపాడులో విషాద ఘటన జరిగింది. వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. జీజీహెచ్‌లో చికిత్స...

గుంటూరు: గుంటూరు జిల్లా శివారు అడవి తక్కెళ్లపాడులో విషాద ఘటన జరిగింది. వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆ బాలుడు మృతి చెందాడు. ఈ దాడి ఘటన చూపరులను కలిచివేసింది. రాజీవ్ గృహకల్ప సముదాయంలో ఆడుకుంటున్న ఈ బాలుడిపై వీధికుక్కలు ఒక్కసారిగా గుంపుగా వచ్చి దాడి చేశాయి. ఒళ్లంతా గాయపరిచాయి. ఆ బాలుడిని కాపాడాల్సిన జనం వీడియోలు తీస్తూ కనిపించారు. వారి తీరుపై ఆ దృశ్యాలు చూసిన వారు తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక పక్క ప్రాణాపాయ స్థితిలో బాలుడు గిలగిలాకొట్టుకుంటే కాపాడాల్సింది పోయి సెల్ ఫోన్లో వీడియోలు తీస్తుండటం అమానుషమని వాపోతున్నారు. పైగా ఆ విజువల్స్‌లో బాలుడు కొన ఊపిరితో కొట్టుకుంటూ కాళ్లూచేతులూ కదిలించడం చూపరులను కంటతడి పెట్టించింది. అంత ప్రమాద పరిస్థితిలో ఉన్న బాలుడిని రక్షించాల్సింది పోయి వీడియోలు తీయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వారి తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు.

సకాలంలో ఆసుపత్రికి తరలించి ఉంటే బతికుండేవాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలా ఒక మనిషి కొన ఊపిరితో కొట్టుకుంటుంటే వీడియోలు తీస్తూ తమాషా చూడటం ఇవాళ కొత్తేమీ కాదు. పలు చోట్ల ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా మనుషుల ప్రవర్తనలో మార్పు రాకపోవడంపై మానవతావాదులు భగ్గుమంటున్నారు. సెల్ ఫోన్‌లో వీడియో తీసి, నెట్‌లో పెట్టి సంచలనం చెయ్యాలన్న తపనే తప్ప ప్రాణానికి విలువనివ్వడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివారు ప్రాంతం కావడంతో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని, గతంలో ఎన్ని సార్లు మున్సిపాలిటీ వారికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. మున్సిపాలిటీ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories