logo

కృషి ఉంటే.. మనుషులు రుషులౌతారు!

కృషి ఉంటే.. మనుషులు రుషులౌతారు!

పశ్చిమబెంగాల్ల్లో ఓ మారుమూల ఊరు బబ్తా. ఆ ఊళ్లో ‘బాబర్ ఆలీ అనే చిన్న కుర్రవాడు. అతనికి చదువంటే ఇష్టం. అందుకనే కిలోమీటర్ల కొద్దీ దూరం నడిచి నడిచి ఓ బడికి వెళ్లి చదువుకునేవాడు. అంతవరకూ బాగానే ఉంది. కానీ తన తోటి పిల్లలంతా చదువు మీద దృష్టి పెట్టకుండా ఆటపాటల్లో గడిపేయడం అతన్ని ఆలోచింపచేసింది. ఆ తర్వాత అతను ఏం చేశాడు అన్నది ఓ చరిత్ర! బాబర్ ఆలీ ఐదో తరగతి చదువుకుంటుండగా... చదువుకునే అవకాశం లేని తన తోటి పిల్లలకి కూడా ఏదన్నా చేయాలన్న ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా తన ఇంటి ముందర ఉన్న జామచెట్టు కింద నలుగురినీ పోగేసి చదువు చెప్పడం మొదలుపెట్టాడు. తన చెల్లెలుతో సహా ఓ ఎనిమిది మంది పిల్లలు అతని దగ్గర చదువుకోవడం మొదలుపెట్టారు.

మొదట్లో బాబర్ ఏదో సరదాగా ఈ ఇంటిబడిని మొదలుపెట్టాడు. కానీ ఇతరులకి చదువు నేర్పడంలో ఉన్న తృప్తి ఆ పిల్లవాడికి ఓ లక్ష్యాన్ని ఏర్పరిచింది. తన ఊళ్లో చదువుకోని ప్రతి ఒక్కరికీ, తనకి తెలిసిన విద్యని నేర్పాలన్న తపన మొదలైంది. దాంతో ఇంటింటికీ తిరిగి పిల్లలని తన బడికి పంపమని ప్రాథేయపడటం మొదలుపెట్టాడు. తన చేతిలో ఉన్న చిల్లర డబ్బుల్తోనే పిల్లలకి కావల్సిన చాక్‌పీసులు, పుస్తకాలు కొనిపెట్టే ప్రయత్నం చేశాడు. పిల్లలని బడికి ఆకర్షించేందుకు స్వీట్లు కొనిపెట్టేవాడు. బాబర్ తండ్రి చాలా చిన్న ఉద్యోగి. మొదట్లో తన పిల్లవాడి తపన ఆయనకు అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే బాబర్ లక్ష్యాన్ని గ్రహించాడో... తను కూడా తనకి చేతనైన సాయం చేయడం మొదలుపెట్టాడు. బడి నడిపేందుకు బాబర్ కుటుంబం నుంచి పూర్తి సహకారం వచ్చేసింది. కానీ గ్రామస్తులకి మాత్రం అతని మీద చాలా అనుమానాలు మొదలయ్యాయి. ఏ స్వార్థమూ లేకుండా తమ పిల్లలకి అతను చదువెందుకు చెబుతున్నాడు? కొంపదీసి తమ పిల్లలని వేరే మతంలోకి కానీ మార్చడు కదా? లాంటి సందేహాలతో అతన్ని ఛీదరించుకోవడం మొదలుపెట్టారు. కానీ బాబర్ మాత్రం వెనక్కి తగ్గలేదు. రోజూ ఠంచనుగా తన బడి నుంచి వచ్చిన వెంటనే ఇంటిబడిని మొదలుపెట్టేసేవాడు. ఒకోసారి అతనికి ఇంత తిండి తినే అవకాశం కూడా ఉండేది కాదు.

2002లో బాబర్ మొదలుపెట్టిన ఈ చిన్న బడి క్రమంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించడం మొదలుపెట్టింది. 2009లో బీబీసీ పత్రికలో అతని మీద ఒక కథనం వచ్చింది. ‘ప్రపంచంలోనే అతి చిన్న వయసు హెడ్మాస్టర్ అంటూ ఆ కథనం ప్రకటించింది. దాంతో బాబర్ బడికి కావల్సినంత ప్రచారం దక్కింది. అతను మరింతమంది పిల్లలని చేర్చుకునేందుకు, కొత్త బడిని నిర్మించేందుకు దాతలు ముందుకు వచ్చారు. ఇక కర్ణాటకలోని ఇంట‌ర్మీడియ‌ట్ పాఠ్యపుస్తకాలలో బాబర్ గురించి ఓ పాఠమే ఉంది.

ఇప్పుడు బాబర్ నేర్పుతున్న బడిలో 300 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. వారికి చదువు చెప్పేందుకు 10 మంది టీచర్లు ఉన్నారు. వారిలో ఆరుగురు టీచర్లు ఒకప్పుడు బాబర్ బడిలో చదువకుని పైకి వచ్చినవారే! అలా ఓ జాబచెట్టు కింద మొదలైన బాబర్ బడికి ఇప్పుడు ‘ఆనంద శిక్షానికేతన్ అన్న పేరుతో అద్భుతాలు సృష్టిస్తోంది. చదువు సంగతి అలా ఉంచితే, నలుగురికీ మంచి చేయాలన్న ఆలోచన ఉంటే... ఎంతటివారైనా అద్భుతాలు సాధించగలరని నిరూపిస్తోంది.

lakshman

lakshman

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top