విభజన సమస్యల్లో ఒక సమస్య

విభజన సమస్యల్లో ఒక సమస్య
x
Highlights

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయి మూడేళ్లు కావోస్తోంది కానీ ఇంతవరకు ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయి మూడేళ్లు కావోస్తోంది కానీ ఇంతవరకు ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన వుండిపోయాయి. ఏపీ సచివాలయ భవనాల అప్పగింత, హైకోర్టు, ఉద్యోగుల విభజన, నీటి పంపకాలతోపాటు విభజన చట్టంలోని 9,10 షెడ్యూల్స్‌లో పేర్కొన్న సంస్థల విభజన, ఆస్తుల అప్పగింతపై నేటి వరకు ఇరు రాష్ట్రాలు పట్టించుకున్న పాపాన లేదు. వీటిని పరిష్కరించాలని గవర్నర్ చొరవ చూపినప్పటికీ..రెండు రాష్ట్రాల ఉన్నతాధికారుల మధ్య పలు దఫాలుగా సమావేశాలు జరిగినప్పటికీ విషయం మాత్రం నానుతూనే ఉంది. ఉన్న సమస్యలతోనే సతమతమవుతుంటే మరో సమస్యగా మారారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్.

ఉమ్మడి రాష్ట్రానికి ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు చేపట్టిన భన్వర్‌లాల్‌ను విభజన తర్వాత ఏపీకి కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే తెలంగాణ రాష్ట్రానికి ఇన్‌ఛార్జ్ సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వ సర్వీసు నిబంధనల ప్రకారం..మరో శాఖకు సంబంధించిన పూర్తి అదనపు బాధ్యతలను ఏ అధికారికైనా అప్పగిస్తే.. ఆయన జీతంలో 20 శాతం సొమ్మును అలవెన్సుగా చెల్లించాలి. భన్వర్లాల్ జీతం నెలకు రూ.2.25 లక్షలు..అంటే తెలంగాణ సీఈవోగా ఇన్‌చార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నందుకు గాను నెలకు రూ.45 వేలను అలవెన్స్‌గా చెల్లించాలి. కానీ నేటి వరకు టీ సర్కార్ ఆ సొమ్మును చెల్లించలేదు..మొత్తం రూ.16 లక్షలు భన్వర్‌లాల్‌కు ఇవ్వాల్సి ఉంది. తనకు రావాలసిన బకాయి కోసం భన్వర్‌లాల్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరగా..ఆయనకు భారీ షాక్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం.

మీరు తెలంగాణ ఉద్యోగి కాదని..అలాంటి వారికి అలవెన్స్ చెల్లించలేమని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారట. అంతేకాకుండా తాము సీఈవో పదవిని ఇంకా సృష్టించలేదని..అందువల్ల ఇన్‌చార్జ్ సీఈవో అన్న ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైనా..కేంద్ర ఎన్నికల సంఘమైనా ఈ భత్యాన్ని చెల్లించాలని..తమకు ఎలాంటి సంబంధం లేదని వాదించింది. దీంతో తన కేసును స్పెషల్‌గా పరిగణించి ఈ అలవెన్స్ చెల్లించాలని భన్వర్‌లాల్ మరోసారి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరగా..మళ్లీ అదే సమాధానం వచ్చింది..కానీ ఒక మినహాయింపు ఇచ్చింది. ఆ అలవెన్స్ కాకుండా..కావాలంటే గౌరవ భృతిగా కొంతసొమ్మును చెల్లిస్తామని ప్రభుత్వంలోని ఓ సీనియర్ అధికారి అన్నారట. ఇప్పటికే చాలా సంయమనంతో ఉన్న భన్వర్‌లాల్ అతి త్వరలో ఈ విషయాన్ని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దృష్టికి గానీ..కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి గానీ తీసుకువెళ్లే అవకాశం ఉంది. లేని పక్షంలో తనకు రావాల్సిన సొమ్మును రాబట్టుకోవడానికి న్యాయ పోరాటానికి దిగవచ్చు. ఆయన ఏం చేస్తారన్నది త్వరలో తేలిపోనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories