శ్రీగౌతమి యాక్సిడెంట్‌ కేసులో కొత్త మలుపు

Submitted by arun on Tue, 06/26/2018 - 13:11
SRI GOUTHAMI

ఏడాదిన్నర క్రితం ఏపీలో తీవ్ర సంచలనం సృష్టించిన దంగేటి శ్రీగౌతమి యాక్సిడెంట్‌ కేసు కొత్త మలుపు తిరిగింది. రోడ్డుప్రమాదంగా ఆనాడు కేసును క్లోజ్‌ చేసినా.... సీఐడీ రంగప్రవేశంతో అసలు నిజం బయటపడింది. శ్రీగౌతమిని పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లు సీఐడీ గుర్తించింది. కొన్ని నెలలుగా దర్యాప్తు చేస్తోన్న సీఐడీ అధికారులు శ్రీగౌతమిది హత్యేనని తేల్చారు. శ్రీగౌతమి హత్యలో మొత్తం ఏడుగురి పాత్ర ఉన్నట్లు గుర్తించిన సీఐడీ వైజాగ్‌కి చెందిన ఇద్దర్ని నరసాపురానికి చెందిన ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 

శ్రీగౌతమి యాక్సిడెంట్‌ కేసులో నిందితులైన ఇద్దరి బ్యాంకు ఖాతాల్లో రెండుసార్లు పెద్ద మొత్తంలో నగదు పడినట్లు గుర్తించిన సీఐడీ తీగ లాగితే మొత్తం డొంకంతా కదిలింది. ప్రాథమిక విచారణ, కాల్‌ లిస్ట్‌ ఆధారంగా శ్రీగౌతమిది హత్యేనని తేల్చారు. అంతేకాదు శ్రీగౌతమి మర్డర్‌ వెనుక రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు హస్తమున్నట్లు తెలుస్తోంది.

2017 జనవరి 18న రాత్రి ఎనిమిదిన్నర సమయంలో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం–పాలకొల్లు మార్గంలో దిగమర్రు కొత్తోట దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీగౌతమి, ఆమె చెల్లెలు పావనిలు యాక్టివాపై నరసాపురం వస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఇన్నోవా బలంగా ఢీకొట్టడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. అయితే శ్రీగౌతమి చికిత్స పొందుతూ మరణించగా, చెల్లెలు పావని ప్రాణాలతో బయటపడింది. అయితే అప్పటివరకూ అందరూ రోడ్డుప్రమాదంగా భావించిగా పావని స్పృహలోకి వచ్చి అసలు విషయం బయటపెట్టింది. తన అక్క శ్రీగౌతమిని రెండో పెళ్లి చేసుకున్న టీడీపీ లీడర్‌ సజ్జా బుజ్జి తమపై హత్యాయత్నం చేశాడని ఆరోపించింది. అయితే పోలీసులు యాక్సిడెంట్‌గా క్లోజ్‌ చేయడంతో పావని అలుపెరగని పోరాటం చేసింది. పావని పోరాటం కారణంగా రంగంలోకి దిగిన సీఐడీ చివరికి శ్రీగౌతమిది హత్యేనని తేల్చింది.

English Title
sri gouthami murder case mystery reveals

MORE FROM AUTHOR

RELATED ARTICLES