తెలుగింటి వెలుగులు

తెలుగింటి వెలుగులు
x
Highlights

తెలుగు గుబాళింపులు నలుదిశలా విస్తరించేలా, విజయపర్వాన్ని మోసుకెళ్తున్న తెలుగు వనితలకు కొరతేం లేదు. సంఘసేవ అయినా, గ్లామర్ ఫీల్డ్ అయినా రంగమేదైనా...

తెలుగు గుబాళింపులు నలుదిశలా విస్తరించేలా, విజయపర్వాన్ని మోసుకెళ్తున్న తెలుగు వనితలకు కొరతేం లేదు. సంఘసేవ అయినా, గ్లామర్ ఫీల్డ్ అయినా రంగమేదైనా దక్షిణాది మహిళలు అందునా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మహిళల సక్సెస్ రేట్ చాలా ఎక్కువ. తెలుగు రాష్ట్రాలను ప్రభావితం చేస్తున్న మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాజకీయాలు, పారిశ్రామిక రంగం, సినిమా, కళలు ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా తమ ప్రత్యేతను చాటుకుంటూ దూసుకుపోతున్నారు. కుటుంబ నేపథ్యం ఉన్నా లేకపోయినా ఒంటరిపోరాటానికి సై అంటూ, విజయం రుచిని ఆస్వాదిస్తూ, ఎందరికో రోల్ మోడళ్లలా పోరాట పటిమను నింపుతున్నవారిపై ప్రత్యేక కథనం మీకు అందిస్తోంది కుటుంబం.

తండ్రికి తగ్గ తనయ కవిత...
కల్వకుంట్ల కవిత.. ఈపేరు చాలు తెలంగాణలో ఆమెకు వెనకా ముందు ఎటువంటి పరిచయ వాక్యాలు అక్కర్లేదు. తండ్రి కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, స్వయంగా పలు విషయాలపై తనకున్న పట్టును ప్రదర్శిస్తూ, పార్టీ పనులు, తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవానికి కృషి చేస్తున్న ఆడబిడ్డగా ఎదిగారు. పార్లమెంటులో కవిత చేసే ప్రసంగాలు వినితీరాల్సిందే. ఇక తెలంగాణ రాష్ట్ర సమస్యలపై హస్తినలో గట్టిగా గొంతు వినిపించే కవిత మంచి వక్త కూడా. తెలంగాణలోని లాక్మే సెలూన్లన్నింటినీ ఫ్రాంచైజీలు తీసుకుని సక్సెస్‌ఫుల్ బిజినెస్ వుమెన్‌గా కూడా రోల్‌మోడల్ అయ్యారు. ఎప్పుడూ చలాకీగా, ఉత్సాహంగా కనిపించే ఎనర్జీ లెవెల్‌తో, కవితా ఉన్నచోటంతా సందడిగా ఉంటుంది.

ప్రజ్వలించే జ్వాల, సునీతా కృష్ణన్..
స్వతహాగా గ్యాంగ్ రేప్ బాధితురాలైనా తనలాంటి కష్టాలు మరెవ్వరూ పడరాదని ‘ప్రజ్వల’ ఫౌండేషన్‌ను స్థాపించి, అత్యాచార బాధితులతో పాటు సెక్స్ వర్కర్లకు పునర్జన్మ ప్రసాదిస్తున్న సునీతా నిజానికి వృత్తిపరంగా వైద్యురాలు. వైద్యం చదువుకుని సమాజానికి చికిత్స చేస్తూ, సంఘసంస్కరణలపై లెక్చర్లు దంచకుండా సైలెంట్‌గా విప్లవం తెస్తున్నారు. భాగ్యనగరంలోని అభాగ్యుల పాలిట తల్లిగా, పాతబస్తీలోని బాలికలు, స్త్రీల కోసం పోరాడుతున్న విప్లవనాయకి. సాధారణంగా ఎన్‌జీఓ నిర్వహిస్తున్న వారు చేసుకునే పబ్లిసిటీ బీభత్సంగా ఉంటుంది. కానీ ఇలాంటి హంగులకు దూరంగా సమస్య ఎక్కడుంటే అక్కడ, రేయనక పగలనక తన ప్రాణాలకు ముప్పున్నా కేర్ చేయని ధీరవనితగా వుమెన్ ట్రాఫికింగ్‌పై అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఈమె సేవలను గుర్తించిన ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. తనపై ఎన్నిసార్లు దాడులు జరిగినా తగ్గేదే లేదని సునీత వజ్రసంకల్పంతో ట్రాఫికింగ్‌పై పోరాడి 17వేల మందికి పైగా మహిళలను కాపాడి, వారికోసం ప్రత్యేక వసతిగృహాన్ని సైతం నిర్వహిస్తున్నారు. ఈ వసతిగృహంలో మీడియాను రానియ్యకుండా, పబ్లిసిటీకి దూరంగా డాక్టర్ సునీత విప్లవాన్ని కొనసాగిస్తున్నారు.

సాక్షి... భారతి రెడ్డి..
‘గుడ్ మార్నింగ్, ఇదొక్క అందమైన మార్నింగ్’ అంటూ తెలుగువారి గడపల్లో తెలతెలవారక ముందే పలుకరించే ‘సాక్షి’ పత్రిక యజమానిగా భారతి రెడ్డి సుపరిచితురాలు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోడలిగా, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ సతీమణిగా ఎన్నో ఆటుపోట్లు, ఎత్తుపల్లాలు చవిచూసిన భారతి నిండుకుండలా, నిబ్బరంగా కనిపిస్తారు. చెరగని చిరునవ్వే ఆభరణంగా, స్థితప్రజ్ఞత ప్రదర్శించే భారతిని చూసి నేటి మహిళలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఓవైపు కుటుంబం, మరోవైపు వ్యాపారాలు, ఇంకో వైపు జగన్ జైల్లో ఉన్నా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తూ సాగిన భారతి ప్రయాణాన్ని తెలుగువారెవ్వరూ మరచిపోలేరు. ఇవన్నీ ఒకఎత్తైతే సేవాకార్యక్రమాల్లో ముందుంటూ, పబ్లిసిటీకి తావులేకుండా, వివాదాలు దరిచేరకుండా పెద్దింటి కోడలిగా భారతి రెడ్డి విజయవంతంగా దూసుకెళ్తూ అత్యంత ప్రభావవంతమైన మహిళగా స్థానం సంపాదించారు. మనలో ఒకరిగా కనిపించే భారతి అంటే ఉద్యోగులు ఎనలేని ప్రేమను కనబరుస్తారు కూడా.

‘బుట్టా’ పట్టుపట్టారో...
రాయలసీమ జిల్లాల్లో బుట్టా రేణుకకు మంచి నేతగా పేరుంది. కుటుంబ నేపథ్యం కారణంగా ఇటు పొలిటికల్ సర్కిల్‌లో, అటు బిజినెస్ సెక్టార్‌లో మంచి నెట్‌వర్క్ ఉన్న బుట్టాకు రాజకీయాలంటే ఎనలేని ఆసక్తి. అందుకే పట్టుబట్టి చక్కగా ఇంగ్లీష్‌లో ప్రసంగించడం నేర్చుకున్నారు. అంతేకాదు తరచూ ఎంపీగా తన గళం వినిపిస్తూ, పార్లమెంట్ చర్చల్లో చురుగ్గా పాల్గొంటూ రాజకీయాలపై ఆసక్తి ఉన్న సామాన్యులపై ప్రభావంం చూపే వ్యక్తిగా ఇమేజ్‌ను సంపాదించు కున్నారు.

ఫ్యూచర్ లీడర్.. నారా బ్రాహ్మణి..
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడి కోడలుగా, స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ గారాలపట్టి అయిన నారా బ్రాహ్మణి విదేశాల్లో తన విద్యను పూర్తి చేసుకుని వచ్చి, హెరిటేజ్ సంస్థను అత్యుత్తమంగా నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. మంత్రి లోకేష్ అర్ధాంగిగా ఈ తరం యంగ్ లేడీగా చాలా చక్కటి కమ్యూనికేషన్ స్కిల్ ఉన్న నారా బ్రాహ్మణి రాబోయే కాలానికి కాబోయే నేతగా గుర్తింపు పొందుతున్నారు. చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకునే క్రమంలో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా హుందా ప్రవర్తించడంలో బ్రాహ్మణి తర్వాతే ఎవరైనా. నవతరం తెలుగమ్మాయిలకు అన్ని విధాలా ఆదర్శంగా నిలిచిన బ్రాహ్మణి మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ లేడీగా నిలబడ్డారు.

దేశం పరువు నిలిపిన సింధు..
దేశంలో ‘బేటీ బచావ్’ ఉద్యమం జోరుగా సాగుతున్న క్రమంలో ‘దేశ్ కా నామ్ బచాయీ’ అనే క్రెడిట్ సంపాదించుకున్న షట్లర్, మన తెలుగుతేజం పీవీ సింధు. ఒలింపిక్స్‌లో మనదేశం చతికిలపడింది అంటూ ఉసూరుమన్న క్రీడా ప్రేమికుల పాలిట ఆశాదీపంగా నిలిచి రజత పతకం సాధించి, అంతర్జాతీయ వేదికపై మన త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన సింధు, మధ్యతరగతి అమ్మాయిలు క్రీడల్లో బహుచక్కగా రాణిస్తారని చాటారు. వరుసగా అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లు గెలుస్తూ దేశమంతా గర్వించేలా నిలిచిన సింధు, అమ్మాయిలపై చాలా ప్రభావాన్ని చూపుతున్నారు.

తెలుగు సుమం మన సుమ..
తరాలు మారినా తెలుగులో యాంకరింగ్ అంటే చెదరని చిరునవ్వుతో గలగలా మాట్లాడే యాంకర్లకు చిరునామాగా నిలిచిన సుమ, మనందరి కుటుంబాల్లో ఓ సభ్యురాలైపోయారు. టీవీ ఆన్ చేశామో రోజూ ఏదో ఒక టైంలో మనల్ని పలకరించే సుమ మన తెలుగు కుటుంబాలపై చూపిన ప్రభావం అంతా ఇంతా అని చెప్పలేము. సుమను చూసి యాంకర్లు కావాలనుకునేవారు కుప్పలు తెప్పలున్నారు. ఇక అగ్ర దర్శక, నటులు మొదలు రాజకీయ నేతలవరకూ అందరూ సుమకు ఫ్యాన్సే. అందరూ ఈమెనే తమను ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటారు. మళయాళ కుట్టి అయినా.. హైదరాబాద్‌లో పెరిగిన సుమ తెలుగులో మనకంటే బాగా మాట్లాడతారు. అందుకే ఆల్ టైం ఫేవరెట్‌గా నిలిచారు.

మహిళా పారిశ్రామిక వేత్తలకు ‘మార్గదర్శి’ శైలజా కిరణ్..
మీడియా మొగల్ రామోజీరావు కోడలు శైలజా కిరణ్ ప్రభావం తెలుగు మహిళలపై చాలా ఉంది. పౌల్ట్రీ పరిశ్రమలో రారాజుగా వెలిగిన సుందరనాయుడు కుమార్తె కూడా కావడంతో.. లీడర్‌షిప్ క్వాలిటీస్‌ను ఆయన నుంచి పుణికిపుచ్చుకున్నారు. మార్గదర్శి, కళాంజలి వంటి సంస్థల ద్వారా సుపరిచితురాలైన శైలజ, స్వయంగా ఈ రెండు సంస్థలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. అందుకే మన తెలుగు రాష్ట్రాల్లో కళాంజలిలో షాపింగ్ చేయడం అంటే ఇష్టపడనివారుండరు, మార్గదర్శిలో పొదుపు చేయాలనుకునేవారికి కొదవే లేదు. అత్యుత్తమ వ్యాపారవేత్త అవార్డు దక్కించుకున్న శైలజా కిరణ్ మోస్ట్ పవర్‌ఫుల్ వుమెన్‌గా చోటు దక్కించుకున్నారు.

నేతగా మారిన అధికారి...కొత్తపల్లి గీత
నిత్యం వివాదాల్లో ఉండే కొత్తపల్లి గీత వెనుకబడిన వర్గాల్లో మంచి శక్తిశాలి మహిళగా ఎదిగారు. ప్రభుత్వ ఉన్నతాధికారిగా సంచలనం సృష్టించే లా కుంభకోణాల్లో చిక్కుకుని ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చినా, బాగా చదువుకున్న మహిళగా, రాజకీయాల్లోనూ రాటుతేలారు. పార్లమెంట్‌లో చాలా చక్కగా ప్రసంగించే తెలుగు మహిళ ల్లో ముందు వరుసలో ఉండే కొత్తపల్లి గీత ఎస్సీల్లో పవర్‌ఫుల్ లేడీగా కొనసాగుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories