నిజామాబాద్ జిల్లాలో రసవత్తరంగా రాజకీయం...ప్రచారం ఆ మూడు చోట్లే

x
Highlights

అధికార పార్టీకి ధీటుగా ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు ప్రచార పర్వం కొనసాగిస్తున్నారు. ప్రచారానికి ఆ పార్టీ అగ్రనేతలు సైతం ఓ దఫా తమ పార్టీ...

అధికార పార్టీకి ధీటుగా ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు ప్రచార పర్వం కొనసాగిస్తున్నారు. ప్రచారానికి ఆ పార్టీ అగ్రనేతలు సైతం ఓ దఫా తమ పార్టీ అభ్యర్ధుల విజయం కోసం సుడిగాలి పర్యటన చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల వేడి కొనసాగుతుండగా ఆ మూడు నియోజవర్గాల్లోనే సందడి ఉంది. మిగతా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ శ్రేణుల్లో మహా కలవరం మొదలైంది. సీట్ల పీటముడి వీడక అభ్యర్ధుల్లో టెన్షన్ ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ప్రచారం సరళిపై ప్రత్యేక కథనం.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ - కాంగ్రెస్ పార్టీల మధ్య ఢీ అంటే ఢీ అన్నట్లుగా ప్రచార పర్వం కొనసాగుతోంది. జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు అధికార పార్టీ అభ్యర్ధులకు గట్టి పోటీ ఇస్తున్నారు. టీఆర్ఎస్, ఒకే దఫా 9 మంది సిట్టింగ్ అభ్యర్ధులకు టికెట్లు ఖరారు చేసింది. ప్రచారంలో ఆ పార్టీ ముందు వరుసలో ఉంది. అదే స్ధాయిలో ఆ పార్టీ అభ్యర్ధులపై వ్యతిరేకత ఉంది. ఆ అవకాశాన్ని చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ అభ్యర్ధులు ప్రచారంలో జోరు పెంచాల్సి ఉన్నా కేవలం మూడు నియోజకవర్గాల్లోనే అధికార పార్టీ అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం చేస్తున్నారు. మిగతా ఆరు నియోజకవర్గాల్లో ప్రజా కూటమి పీటముడి వీడక స్తబ్దత నెలకొంది. ఒక్కొ నియోజకవర్గం నుంచి సగటున నలుగురు అభ్యర్ధులు పోటీ పడుతుండగా పొత్తులో భాగంగా ఆ సీట్లు ఎవరికి వస్తాయో తెలియక కాంగ్రెస్ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉండగా.. కామారెడ్డి, బోధన్, ఆర్మూర్‌లో అభ్యర్ధులు దాదాపుగా ఖరారయ్యారు. కామారెడ్డిలో షబ్బీర్ అలీ తరపున ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ బహిరంగ సభ సక్సెస్ అయ్యింది. అంతకు ముందు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపింది.

ఇటు బోధన్‌లో సుదర్శన్ రెడ్డి ప్రచారం ప్రారంభించారు. సుదర్శన్ రెడ్డికి మద్దతుగా రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. బోధన్, కామారెడ్డిలో అధికార పార్టీ అభ్యర్ధులకు కాంగ్రెస్ అభ్యర్దులు చమటలు పట్టిస్తున్నారు. ఆర్మూర్‌లో ఆకుల లలిత ఇంటింటి ప్రచారం చేస్తున్నా చివరి నిమిషం వరకు ఆమెకు టికెట్టు వస్తుందనే ఆశ కనిపించడం లేదు. ఎమ్మెల్సీగా ఇంకా పదవీ కాలం ఉండటంతో అధిష్ఠానం ఆలోచనలో పడింది. తనకు టికెట్టు ఖాయమని లలిత ప్రచారంలో జోరు పెంచింది. ఈ మూడు నియోజకవర్గాలు మినహా నిజామబాద్ అర్బన్, రూరల్, బాల్కొండ, బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డిలలో అభ్యర్ధిత్వాలు ఖరారు కాకపోవడంతో ప్రచారంలో స్తబ్దత నెలకొంది.

ప్రజాకూటమి పొత్తులో భాగంగా టీడీపీ, తెలంగాణ జన సమితి చెరో రెండు సీట్లకు పట్టుబడుతున్నారు. టీడీపీ బాల్కొండ, రూరల్ నియోజకవర్గాలను పట్టుబడుతుండగా జనసమితి అర్బన్, ఎల్లారెడ్డి నియోజకవర్గాలపై కన్నేసింది. బాన్సువాడ, జుక్కల్‌లో ఇద్దరు చొప్పున అభ్యర్ధులు పోటీపడుతున్నారు. రెండు వర్గాలుగా చీలిపోయారు. టికెట్టు ఎవరికి వచ్చినా మరొకరు సహకరించే పరిస్ధితి లేక ఎవరిని ఖరారు చేయాలో తెలియక అధిష్ఠాన పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. దీంతో మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ శ్రేణుల్లో పుల్ జోష్ ఉండగా, ఆరు నియోజకవర్గాల్లో మాత్రం స్తబ్దత ఉంది. టీఆర్ఎస్‌కు, కాంగ్రెస్‌ గట్టి పోటీనిస్తున్నా, అభ్యర్ధులు పూర్థిస్దాయిలో ఖరారు కాక ప్రచారంలో వెనకబడింది. త్వరిత గతిన అభ్యర్ధులను ఖరారు చేస్తే.. పోరు మరింత రంజుగా మారే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories