మరో శాఖపై కేసీఆర్ ఫోకస్‌...విప్లవాత్మక మార్పులకు శ్రీకారం

మరో శాఖపై కేసీఆర్ ఫోకస్‌...విప్లవాత్మక మార్పులకు శ్రీకారం
x
Highlights

ముఖ్యమంత్రి కేసీఆర్ సంస్కరణల బాటపట్టారు. ఇప్పటికే రెవెన్యూ, మున్సిపల్ శాఖల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన సీఎం ఇప్పుడు విద్యారంగంపై దృష్టిపెట్టారు....

ముఖ్యమంత్రి కేసీఆర్ సంస్కరణల బాటపట్టారు. ఇప్పటికే రెవెన్యూ, మున్సిపల్ శాఖల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన సీఎం ఇప్పుడు విద్యారంగంపై దృష్టిపెట్టారు. పెద్దమొత్తంలో జీతాలు చెల్లిస్తున్నా విద్యాశాఖలో ఆశించిన ఫలితాలు రావడం లేదని భావిస్తున్న కేసీఆర్‌ సమూల మార్పులకు సిద్ధమవుతున్నారు. విద్యాశాఖలో సంస్కరణలు, సమూల ప్రక్షాళనకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విద్యావిధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి నాణ్యమైన విద్య అందించాలని భావిస్తోంది. ప్రస్తుతమున్న ఉపాధ్యాయ వ్యవస్థలో బోధనా విధానంలో సమూల మార్పులకు ప్లాన్ చేస్తోంది.

ఒక్క విద్యాశాఖలోనే లక్షా 40వేల మంది ఉద్యోగులకు ఏటా 12వేల కోట్ల రూపాయలను జీతాలుగా చెల్లిస్తోంది ప్రభుత్వం. మరో 2వేల కోట్లను విద్యార్ధులకు స్కాలర్‌‌షిప్‌లుగా అందిస్తోంది. అంటే ప్రతి ఏటా ఒక్క విద్యాశాఖకే 14వేల కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. కానీ సర్కారు బడుల్లో విద్యార్ధుల ఉత్తీర్ణత శాతం ఆశించిన మేర రావడం లేదు. ఇక ఉన్నత విద్య, సాంకేతిక విద్యలో కూడా అంతంతమాత్రమే ఫలితాలు వస్తున్నాయి. దాంతో ప్రాథమిక విద్య నుంచి సాంకేతిక విద్య, యూనివర్శిటీల వరకు సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. కేజీ టు పీజీ విద్యలో భాగంగా ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు ఏర్పాటుచేసి నాణ్యమైన విద్యను అందజేస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం ప్రతి నియోజకవర్గానికో గురుకులం ఉండగా, ఇప్పుడు అదనంగా మరో 119 గురుకులాల ఏర్పాటుకు క్లియరెన్స్ ఇచ్చింది.

ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమయ్యాయనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇక ప్రభుత్వ టీచర్ల పనితీరుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లకుండా, బోధనను విస్మరించి వ్యక్తిగత పనుల్లో తలమునకలవుతున్నారని కేసీఆర్ దృష్టికి వచ్చింది. దాంతో ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించి, అలాగే పాఠశాలలను హేతుబద్ధీకరించి, అదనంగా ఉన్న టీచర్లను గురుకులాలకు మళ్లించాలని కేసీఆర్ సర్కార్ భావిస్తోంది. ప్రభుత్వ విద్యారంగంలో పడిపోతున్న ప్రమాణాలను మెరుగుపర్చి దేశంలోనే తెలంగాణ విద్యావిధానం ది బెస్ట్ అనే విధంగా విద్యాశాఖను నెంబర్‌‌వన్‌గా నిలబెట్టేందుకు సర్కార్ అడుగులు వేస్తోంది.

ఇప్పటికే రెవెన్యూ, మున్సిపల్ శాఖల్లో అవినీతి పేరుకుపోయిందంటూ సమూల ప్రక్షాళన దిశగా అడుగులేస్తోన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు విద్యాశాఖపై కూడా ఫోకస్‌‌ పెట్టడం సంచలనం రేపుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories