స్పీకర్ ఎన్నికే కీలకం... కన్నడ నాట రసవత్తర రాజకీయం

స్పీకర్ ఎన్నికే కీలకం... కన్నడ నాట రసవత్తర రాజకీయం
x
Highlights

ఓ వైపు మైనార్టీ సర్కారు.. మరోవైపు విశ్వాస పరీక్ష.. యడ్యూరప్పకు ముందు ముందు అగ్ని పరీక్ష ఎదురుకానుంది. ముఖ్యంగా బలనిరూపణ విషయంలో అసెంబ్లీలో అనుసరించే...

ఓ వైపు మైనార్టీ సర్కారు.. మరోవైపు విశ్వాస పరీక్ష.. యడ్యూరప్పకు ముందు ముందు అగ్ని పరీక్ష ఎదురుకానుంది. ముఖ్యంగా బలనిరూపణ విషయంలో అసెంబ్లీలో అనుసరించే వ్యూహాలే ప్రభుత్వానికి కీలకం కానున్నాయి. స్పీకర్ ను ఎన్నుకుంటారా..? విపక్ష సభ్యలను తమవైపుకు తిప్పుకుంటారా..? లేకపోతే వారిని సభకు హాజరుకాకుండా చూస్తారా..? కర్ణాటక అసెంబ్లీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్పకు.. బలనిరూపణ కోసం 15 రోజుల గడువిచ్చారు. దీంతో కర్ణాటక అసెంబ్లీలో యడ్యూరప్ప విశ్వాసపరీక్ష అత్యంత ఆసక్తిగా.. మారింది. సభ ప్రారంభం నుంచి బలపరీక్ష ఎదుర్కొనే క్రమంలో.. కొత్త స్పీకర్ పాత్ర కీలకం కానుంది. ఇంకా చెప్పాలంటే తొలిరోజు స్పీకర్ తీసుకునే నిర్ణయాలపై యడ్యూరప్ప తదుపరి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.

మరోవైపు కర్ణాటక శాసనసభలో సీనియర్ ఎమ్మెల్యే అయిన ఆర్ వీ దేశ్ పాండేను.. ప్రొటెం స్పీకర్‌గా అసెంబ్లీ సచివాలయం సిఫార్సు చేసింది. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కావడంతో ఇప్పుడు ప్రొటెం స్పీకర్ పాత్ర కీలకంగా మారనుంది. అయితే ప్రొటెం స్పీకర్.. తాత్కాలికంగా సభా వ్యవహారాలను చూస్తారు కానీ.. బలపరీక్ష నిర్వహించడం అతని విధి కాదని చెబుతున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే విశ్వాస పరీక్షను నిర్వహిస్తారని.. శాశ్వత స్పీకర్ ను సభ ఎన్నుకోని పక్షంలో మాత్రమే.. ప్రొటెం స్పీకర్ బలనిరూపణను నిర్వహిస్తారని వివరిస్తున్నారు.

ఇక అసెంబ్లీలో ఎమ్మెల్యేల సభ్యుల ప్రమాణం తర్వాత.. సభానాయకుడు స్పీకర్‌ ఎన్నికను కోరే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే.. స్పీకర్‌ ఎన్నికకు నామినేషన్లు స్వీకరిస్తారు. పోటీ ఉంటే సభలో సభ్యుల అభిప్రాయం తెలుసుకుని ఫలితాన్ని ప్రకటిస్తారు. ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీ.. స్పీకర్ ఎన్నికల్లో ఓడిపోతే.. ఆ ప్రభుత్వానికి శాసనసభ్యుల మద్దతు లేదని అక్కడే తేలిపోనుంది. అయితే కన్నడ అసెంబ్లీలో కాంగ్రెస్, జేడీఎస్ కు కలిపి.. మొత్తం 116 మంది సభ్యులున్నారు. ఒకవేళ స్పీకర్ కోసం ఎన్నిక జరిగితే.. ప్రతిపక్షాలు నిలబెట్టిన అభ్యర్థే ముందున్నట్లు తేలిపోతుంది. దీంతో యడ్యూరప్ప సర్కారుకు బలనిరూపణ ప్రశ్నే లేకుండా వైదొలగాల్సి వస్తుంది.

దీంతో స్పీకర్ ఎన్నికే యడ్యూరప్పకు సవాల్‌ మారనుంది. సాధారణ మెజారిటీ కన్నా 8 మంది ఎమ్మెల్యేలు తక్కువగా ఉండటంతో.. యడ్యూరప్ప సర్కారు తమకు నచ్చిన స్పీకర్‌ను ఎలా ఎన్నుకుంటుందన్న ప్రశ్న ఆసక్తిగా మారింది. ఒకవేళ యడ్యూరప్ప ప్రభుత్వం స్పీకర్‌ను ఎన్నుకోగలిగి, కొంతమంది విపక్ష శాసనసభ్యులు హాజరు కాకుండా చూసినా.. లేదా తమవైపు వచ్చేలా చూసుకున్నా.. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత అంశాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఫిరాయింపుల విషయం.. స్పీకర్ విచక్షణాధికారం కాబట్టి.. ఆయన నిర్ణయం తీసుకునే వరకు ప్రభుత్వం మాత్రం అధికారంలో ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories