హత్య కేసులో కొత్త కోణాలు

Submitted by arun on Wed, 09/19/2018 - 10:18
Pranay's murder case

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్యకేసు మిస్టరీ వీడింది. ప్రణయ్ హత్యకు ప్లాన్ చేసిన ఏడుగురు నిందితులను పట్టుకున్నారు. నిందితులు దొరకడంతో హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూశాయి. ప్రణయ్ హత్యకు రెండు సార్లు యత్నించి విఫలమైనట్లు పోలీసులు తేల్చారు. అంతేకాదు..అమృతకు అబార్షన్ చేయించేందుకు కూడా ఆమె తండ్రి విఫలయత్నం చేశాడు.

ఈ నెల14న మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హ‍త్య కేసును నల్లగొండ పోలీసులు ఛేదించారు. మర్డర్ ప్లాన్‌ చేసిన ఏడుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. బీహార్‌కు చెందిన సుభాష్ శర్మ తప్ప అమృత వర్షిణి తండ్రి మారుతీరావు, ఉగ్రవాద మూలాలున్న అస్గర్‌ అలీ, మహ్మద్ బారీ, మిర్యాలగూడకు చెందిన రాజకీయ నేత అబ్దుల్ కరీం, అమృత బాబాయ్ శ్రవణ్, మారుతీరావు కారు డ్రైవర్ సముద్రాల శివ గౌడ్‌ను మీడియా ముందు ప్రవేశ పెట్టారు.

ప్రణయ్‌ను హత్య చేసింది బీహార్ రాష్ట్రంలోని సమస్థీపూర్ కు చెందిన సుభాష్ శర్మ అని నల్లగొండ ఎస్పీ రంగనాథ్ తెలిపారు. ప్రణయ్ హత్య కోసం అమృత తండ్రి మారుతీరావు హైదరాబాద్ మలక్ పేటకు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ బారీతో 50 లక్షల రూపాయల కాంట్రాక్ట్‌ కుదుర్చుకున్నాడని చెప్పారు. అబ్దుల్ కరీం ద్వారా ఒప్పందం కుదిరిందన్నారు. ప్రణయ్ అంతమొందించే పనిని బారీ అస్గర్ అలీకి అప్పగించాడని దీంతో అతని డైరెక్షన్‌లోనే జ్యోతి ఆస్పత్రి దగ్గర మర్డర్ జరిగింది.

నిజానికి ప్రణయ్‌ను ఆగస్టు 14నే హత్యకు చేయడానికి ముందుగా ప్లాన్ చేశారు. ఇందుకోసం ఆగస్టు 9 నుంచి రెక్కీ నిర్వహించారు. ప్రణయ్, అమృత జంట బ్యూటీపార్లర్‌ దగ్గరకు వెళ్లినప్పుడు మర్డర్ చేయాలని యత్నించారు. అయితే అమృత, ప్రణయ్‌తో పాటు ప్రణయ్‌ సోదరుడు కూడా వారితో ఉండడంతో ఇద్దరిలో ఎవర్ని చంపాలో తెలియక హత్యా ప్రయత్నాన్ని విరమించుకున్నారు.

ప్రణయ్ ను చంపడానికి రెండో సారి కూడా మారుతీరావు యత్నించాడు. ప్రణయ్, అమృతను కిడ్నాప్ చేసి ప్రణయ్ ‌ను చంపాలనుకున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌ నుంచి ఓ గ్యాంగ్‌ను మిర్యాలగూడలో దించారు. అయితే ఆ రౌడీలు తాగి తందనాలాడడంతో హత్య చేయడం వారి వల్ల కాదని తేల్చి తిప్పి పంపేశారు. 

అంతేకాదు...అమృత గర్భిణీ అన్న విషయం తెలుకున్న మారుతీ రావు అబార్షన్ చేయించడానికి కూడా యత్నించాడు. అమృత చెకప్ చేయించుకునే జ్యోతి ఆస్పత్రి డాక్టర్‌తో మాట్లాడి గర్భస్రావం చేయమని కోరాడు. అయితే డాక్టర్ జ్యోతి అందుకు అంగీకరించలేదు. ఇలా ప్రణయ్ హత్యకు రెండు విఫల యత్నాలు చేసిన మారుతీరావు చివరికి ఈ నెలలో అనుకున్నది సాధించాడు.  మొత్తానికి కూతుర్ని కులాంతర వివాహం చేసుకున్నాడనే చిన్న కారణంతో ప్రణయ్‌పై పగ పెంచుకున్న మారుతీ రావు అతన్ని చంపి ఊచలు లెక్కపెడుతున్నాడు. 

English Title
sp ranganath says pranay murder case details

MORE FROM AUTHOR

RELATED ARTICLES