బీజేపీ అహంకారంతో రాజకీయాలు చేస్తోంది: సోనియా గాంధీ

Submitted by arun on Sat, 03/17/2018 - 17:46
Sonia

బీజేపీ అహంకారంతో విభజన రాజకీయాలకు పాల్పడితే కాంగ్రెస్‌ పార్టీ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తోందని ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పష్టం చేశారు. అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కాంగ్రెస్‌ పార్టీ మొత్తం అండగా నిలవాలని సోనియా పిలుపునిచ్చారు. ప్రధాని మోడిపైన విమర్శలు కురిపించారు సోనియా. అటు కాంగ్రెస్‌ పార్టీని కంటికి రెప్పలా కాపాడిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలపై పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. 

కాంగ్రెస్‌ పార్టీ విజయమే దేశ విజయమన్నారు కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలకు సోనియా గాంధీ దిశానిర్దేశం చేశారు. 2019లో కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరణ జరుగుతుందన్న సోనియా కాంగ్రెస్‌ పార్టీ బిజేపీకి తలవంచే ప్రసక్తే లేదన్నారు. రాహుల్ గాంధీకి పార్టీ అండగా ఉంటుందని 2019లో ఎజెండాను రూపొందించాల్సి ఉందన్నారు. కాంగ్రెస్‌ సభ్యురాలిగా గర్విస్తున్నానన్న సోనియా పార్టీ అధ్యక్షురాలిగా తనకు సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. యూపీఏ పథకాలను నీరుగార్చడం మినహా మోడీ సర్కార్ చేసిందేమీ లేదన్నారు. కేవలం అహంకారంతో విభజన రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ సర్కార్ పనితీరును ఎండగట్టారు.

కాంగ్రెస్‌ పార్టీని సోనియా గాంధీ, మన్మోహన్‌ సింగ్, చిదంబరం లాంటి సీనియర్ నేతలు పార్టీని కంటికి రెప్పలా కాపాడారని రాహుల్‌ గాంధీ ప్రశంసించారు. పార్టీ అధ్యక్షుడి హోదాలో కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాన్ని రాహుల్ గాంధీ ప్రారంభించారు. పార్టీలోని సీనియర్ నేతల దర్శకత్వంలో యువ నేతలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సీనియర్ నేతలనూ, యువ నాయకత్వాన్ని కలుపుకొని పార్టీని ముందుకు తీసుకువెళ్తానన్నారు రాహుల్ గాంధీ. 

త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరన్నారు పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. దేశంలో రైతులు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారని...వాటిని పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందన్నారు. తొలి రోజు ప్లీనరీ సమావేశాల్లో పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, సీనియర్ నేతలు కమల్‌నాథ్‌, రణ్‌దీప్‌ సూర్జేవాలా, జ్యోతిరాదిత్య సింధియా, సచిన్‌ పైలెట్‌ లాంటి కీలక వ్యక్తులు బీజేపీపై విమర్శలు కురిపించారు. 

English Title
Sonia Gandhi targets Narendra Modi

MORE FROM AUTHOR

RELATED ARTICLES