కర్నూలు టీడీపీలో గందరగోళం...కోట్ల కుటుంబం దెబ్బతో బుట్టా రేణుక సీటుకు ఎసరు

కర్నూలు టీడీపీలో గందరగోళం...కోట్ల కుటుంబం దెబ్బతో బుట్టా రేణుక సీటుకు ఎసరు
x
Highlights

కర్నూలు జిల్లా అధికార పార్టీలో అసమ్మతి రాగం తారాస్థాయికి చేరింది. పార్టీ మారిన నేతలకు టీడీపీ అధినేత అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ లబోదిబో అంటున్నారు....

కర్నూలు జిల్లా అధికార పార్టీలో అసమ్మతి రాగం తారాస్థాయికి చేరింది. పార్టీ మారిన నేతలకు టీడీపీ అధినేత అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ లబోదిబో అంటున్నారు. అమరావతిలో తిష్ట వేసినా అధినేత తమను ఎప్పుడు కరుణిస్తారా? అంటూ చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్నారు. పార్టీ మారి తప్పు చేశామా అంటూ లోలోపల మధన పడుతున్నారు.

లోక్ సభ, రాష్ట్ర శాసనసభకు ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది. నామినేషన్ కి మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. టికెట్ కన్ఫర్మ్ చేసుకున్న నేతలు ఓవైపు ఓటరు మారాజుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే మరోవైపు టికెట్ ఖాయం కాని నేతలు మాత్రం అమరావతిలో అధినేత చుట్టూ తిరుగుతున్నారు. అయినా టికెట్ తమకేనన్న గ్యారెంటీ మాత్రం లేకపోడంతో అయోమయంలో చిక్కుకొన్నారు.

మరోవైపు వివాదాస్పదంగా మారిన నియోజకవర్గాలపై అధినేత పూర్తిగా దృష్టి కేంద్రీకరించినట్లు ఏమాత్రం కనిపించడం లేదు. నంద్యాల ఎంపీ, నంద్యాల ఎమ్మెల్యే స్థానాలతో పాటు కోడుమూరు, ఆలూరు, ఆదోని నియోజకవర్గాల అభ్యర్థులపైన సైతం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది టికెట్ తమకే వస్తుందన్న ధీమాతో కొందరు నేతలు ఉన్నారు. సమస్యాత్మకంగా మారిన ఈ నియోజకవర్గాల అభ్యర్థులంతా వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత టీడీపీలోకి వచ్చిన వారే కావడం విశేషం.

కర్నూల్ వైసీపీ ఎంపీగా గెలిచిన బుట్టా రేణుక ఆ తర్వాత అధికార పార్టీ లోకి వచ్చిన నేత అయితే తాజాగా కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి కుటుంబంతో సహా తెలుగుదేశంలో చేరడం తో ఆ స్థానం ఆయనకు కన్ఫర్మ్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. తన అల్లుడికి నంద్యాల ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరుతూ వచ్చిన ఆయన చివరకు తన సీటుకే ఎసరు వచ్చే పరిస్థితి ఎదురుకావడంతో ఎలాగైనా సీటు ఖాయం చేసుకోడానికి అమరావతిలోనే పాగా వేశారు. తనకు గానీ, తన కుమార్తెకు గాని ఎంపీ స్థానం కేటాయించాలని అధినేత వద్ద పంచాయతీ పెట్టారు.

మరోవైపు నంద్యాల ఎంపీ సీటు తనకే కేటాయించాలంటూ మాజీ పోలీసు అధికారి మాండ్ర శివానందరెడ్డి మరోసారి పావులు కదుపుతున్నారు. చివరకు అధిష్టానం సైతం ఆయన వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇలా వైసీపీ నుంచి వచ్చిన ఇద్దరు ఎంపీలకు ఇదే పరిస్థితి ఎదురుకావడంతో వారి అభిమానులు ,కార్యకర్తలు తీవ్రనిరాశలో పడిపోయారు. అలాగే ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాలలో సైతం గందరగోళం కొనసాగుతోంది. నామినేషన్ దాఖలు చేయటానికి సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో వీలైనంత త్వరగా తమకు స్థానాలు కేటాయించాలంటూ అభ్యర్థులు మొర పెట్టుకుంటున్నారు. మరి అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం మరో రెండు రోజులు వేచిచూడక తప్పదు.

Show Full Article
Print Article
Next Story
More Stories