ఆగస్టులో అగ్రిగోల్డ్ బాధితులకు సొమ్ము పంపిణీ

ఆగస్టులో అగ్రిగోల్డ్ బాధితులకు సొమ్ము పంపిణీ
x
Highlights

అగ్రిగోల్డ్ బాధితులకు స్వాంతన కలిగించడానికి అవసరమైన అన్నిచర్యలూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోంది. దీనికి అవసరమైన కార్యక్రమాన్ని వేగవంతంగా అమలు చేయడానికి...

అగ్రిగోల్డ్ బాధితులకు స్వాంతన కలిగించడానికి అవసరమైన అన్నిచర్యలూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోంది. దీనికి అవసరమైన కార్యక్రమాన్ని వేగవంతంగా అమలు చేయడానికి అధికారులు ఉపక్రమిస్తున్నారు. దీంతో అగ్రిగోల్డ్ బాధితులకు త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి.

ఆర్థిక మంత్రికి అప్పగిస్తా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్

అగ్రిగోల్డ్‌ బాధితులను సీఎం జగన్‌ నేరుగా కలుసుకోనున్నారు. ఈ మేరకు వారితో ఒక సమా వేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను ఆయన ఆదేశించారు. గురువారం అగ్రిగోల్డ్‌ బాధితులు ముఖ్యమంత్రిని అసెంబ్లీ ప్రాంగణంలో కలిశారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు సత్వరమే న్యాయం చేసేలా రూ.1,150 కోట్లను న్యాయస్థానంలో జమచేసే ప్రక్రియ బాధ్యతను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు అప్పగిస్తామన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులతో ఏర్పాటు చేసే సమావేశానికి తాను హాజరవుతానని ఆయన హామీ ఇచ్చారు. దీంతో ఆగస్టు నెలలో రూ.20 వేలరూపాయల డిపాజిట్ దారులకు సొమ్ము అందించేందుకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం 1,150 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమవడంతో సీఐడీ అధికారులు డిపాజిటర్ల జాబితా సిద్ధం చేస్తున్నారు. ఏ విభాగంలో ఎంత మంది ఉన్నారు, వారిలో డేటా మ్యాచ్‌ అయిన వారెందరు, కాని వారి సంఖ్య ఎంత, ఎవరెవరికి ఎంత ఇస్తే ఎంతమందికి న్యాయం జరుగుతుంది... వంటి వివరాలతో జాబితాను సీఐడీ అధికారులు సిద్ధం చేశారు. రూ.20వేలు లోపు డిపాజిట్‌ చేసిన వారికి ఆగస్టులో క్లియర్‌ చేసే ఆలోచనలో జగన్‌ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. దీనికోసం అవసరమైన రూ.1,429కోట్లలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.1,150కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చింది. గత ప్రభుత్వం కేటాయించిన 250 కోట్లు, అగ్రిగోల్డ్‌ సంస్థకు సంబంధించిన కొన్ని ఆస్తులను అమ్మగా వచ్చిన నిధులను కలుపుకొని.. ఈ డిపాజిటర్లకు పంపిణీ చేస్తారని తెలుస్తోంది. ఈ మేరకు సీఐడీ అధికారులు తన జాబితాను హోంశాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్‌ఎం కిశోర్‌ కుమార్‌ ద్వారా ప్రభుత్వానికి అందజేశారు. దానిని పరిశీలన కోసం జిల్లాల్లోని న్యాయ కమిటీలకు పంపి ఆ తర్వాత హైకోర్టు అనుమతితో డబ్బులు పంపిణీ చేయబోతున్నారు. ఆస్తుల వేలానికి ప్రయత్నాలు..

ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లోని రూ.3,785కోట్ల విలువైన అగ్రిగోల్డ్‌ ఆస్తులను గుర్తించి సీఐడీ జప్తు చేసింది. అందులో అత్యధికంగా మన రాష్ట్రంలో రూ.2,585 కోట్లు విలువైన ఆస్తులు జప్తులో ఉన్నాయి. వాటిని వేలంలో విక్రయించి డిపాజిటర్లకు పంపిణీ చేయాలని మూడేళ్ల క్రితం డిపాజిటర్ల సంఘం పేరుతో హైకోర్టులో పిల్‌ దాఖలైంది. దీనిపై హైకోర్టు ఆదేశాల మేరకు ఆస్తుల వేలం ప్రక్రియను జిల్లా కమిటీలతో కలిసి సీఐడీ మొదలుపెట్టింది.

నోట్ల రద్దు, జీఎస్‌టీ లాంటి ఇబ్బందులతో కొనుగోలుదారులు ముందుకు రాలేదు. డిపాజిటర్లు రోడ్లెక్కి ఆందోళనకు దిగడంతో గతప్రభుత్వం రూ.250 కోట్లు ఇచ్చి 5వేల లోపు డిపాజిటర్లకు స్వాంతన చేకూర్చేందుకు ప్రయత్నించింది. అయితే ఎన్నికల తర్వాత జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, మొత్తం 1,150కోట్లు ఇచ్చేందుకు సిద్ధమయింది.

ఎంత అవసరం అవుతుంది?

సీఐడీ జాబితాను అనుసరించి.. దేశవ్యాప్తంగా అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లు 19,18,865 మంది ఉన్నారు. వారిలో ఒక్క ఏపీలో 11,57,497మంది ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లోని డిపాజిటర్ల నుంచి అగ్రిగోల్డ్‌ సేకరించిన మొత్తం రూ.6,380.31కోట్లు. ఇందులో ఏపీ డిపాజిటర్ల నుంచి సేకరించిందే రూ.3,944.70కోట్లు ఉంది. రూ.50వేల వరకూ డిపాజిట్లు చేసిన వారందరికీ డబ్బులు చెల్లించాలంటే రూ.1,851.81కోట్లు కావాలి, గత ప్రభుత్వం రూ.250కోట్లు ఇచ్చినందున మరో రూ.1,601.81కోట్లు అవసరం అవుతాయి.

ఎంత మొత్తానికి.. ఎంత క్లియరెన్స్‌..

రూ.5వేల నుంచి లక్ష రూపాలకు పైగా డిపాజిట్లు చేసిన వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని వివరిస్తూ సీఐడీ అధికారులు ప్రభుత్వానికి జాబితా అందజేశారు. ఆ జాబితాను అనుసరించి.. రూ.5వేల లోపు డిపాజిట్‌ చేసిన 7.35 లక్షల మందికి చెల్లించాలంటే రూ.212.23కోట్లు అవసరం. రూ.10వేలు డిపాజిట్‌ చేసిన 12.86లక్షల మందివరకూ పూర్తి చేయాలంటే రూ.720.29కోట్లు కావాలి. ఇక, రూ.20వేల వరకూ చెల్లించిన డిపాజిటర్ల వరకూ పూర్తి న్యాయం చేయాంటే రూ.1,429కోట్లు అవసరం.

కాగా, అగ్రిగోల్డ్‌ బాధితులు అధైర్యపడవద్దని, బాధితులందరికీ వారు కట్టిన ప్రతి రూపాయి తిరిగి ఇప్పించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని వైసీపీ అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ కన్వీనర్‌ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories