logo

ఇప్పుడు విద్వేషాలు రెచ్చగొట్టేవాడే మొనగాడా.?

మొన్నటి వరకు మాట్లాడే వాడే మొనగాడనుకున్నాం. ఇప్పుడు విద్వేషాలు వెళ్లగక్కేవాడే మొనగాడు అనుకునే దౌర్బాగ్య పరిస్థితి చూస్తున్నాం. ఢిల్లీ నుంచి గల్లీ వరకు, రెచ్చగొట్టే ప్రసంగాలు రాజ్యమేలుతున్నాయి. భావ సంఘర్షణను సమాజ సంఘర్షణగా మార్చుతోందెవరు?

ఏ మతగ్రంథమైనా, రాజనీతి శాస్త్రమైనా, సమర్థించేవాళ్లుంటారు, వ్యతిరేకించే వాళ్లుంటారు. ప్రశ్నలు ఉదయిస్తాయి. బైబిల్‌ వద్దంటే విత్తు మొలకెత్తకమానదు. ఖురాన్ కాదంటే తూర్పున ఉదయించే సూర్యుడు పశ్చిమాన ఉదయించడు. ప్రశ్నలూ అంతే. వాటిని ఆపడం ఎవరి తరమూ కాదు. చర్చ జరగాల్సిందే. భావ సంఘర్షణ జరిగి తీరాల్సిందే. భావప్రకటనా స్వేచ్చకు ఇదే మూలం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆలోచనా ఇదే. అందుకే రాజ్యాంగంలో భావ ప్రకటనా స్వేచ్చకు పెద్దపీట వేశారు. కానీ జరుగుతున్నది ఏంటి? భారత రాజ్యాంగమిచ్చిన వాక్‌ స్వాతంత్ర్యం ఏమవుతోంది?

సినీ విమర్శకుడు, హేతువాది కత్తి మహేష్‌ చేసిన వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజుల నుంచి వాడీవేడిగా చర్చ జరుగుతోంది. రామాయణం, శ్రీరాముడు, రావణుడు, సీతాపహరణం వంటి సున్నితమైన అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు కత్తి మహేష్. ముఖ్యంగా శ్రీరాముడిపై ఆయన చేసిన కామెంట్లపై రచ్చరచ్చ అవుతోంది. కూకట్‌పల్లితో పాటు పలు పోలీస్‌ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. హిందూ సంఘాలు, సాంప్రదాయవాదులు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

రామాయణం హిందువుల పవిత్ర గ్రంథాల్లో ఒకటి. కోట్లాదిమంది ఆరాధ్యదైవం శ్రీరాముడు. మత గ్రంథాలపై చర్చ జరగాల్సిందే. కానీ కామెంట్లు చేసేటప్పుడు, అందులో కొన్ని పదాలు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నది సామాజికవేత్తల మాట. శ్రీరాముడిపై వివాదస్పద పదప్రయోగమే ఇప్పుడు కత్తిపై కత్తులు నూరే పరిస్థితి తెచ్చింది.

గతంలో కంచ ఐలయ్య పుస్తకం, రాజాసింగ్ రెచ్చగొట్టే ప్రసంగాలు, అక్బరుద్దీన్ స్పీచ్, స్వామి పరిపూర్ణానంద కాంట్రావర్సియల్ కామెంట్లపై రచ్చ జరిగింది. జాతీయస్థాయిలోనైతే, ములాయం, సాధ్వీ, యోగి ఆదిత్య నాథ్, లెక్కలేనంతమంది కాషాయ నాయకులు నోటికిపని చెప్పారు. సమాజంలో విద్వేషాలు రగిలించేలా మాట్లాడారు. కానీ కులమతాలు, సెంటిమెంట్లకు సంబంధించి వ్యాఖ్యలు చేసేటప్పుడు సంయమనంతో వ్యవహరించాలి. మాటైనా, తూటైనా ఒక్కసారి బయటికొచ్చిందంటే, చేయాల్సిన నష్టం చేసేస్తాయి. అంశం ఏదైనా చట్టపరంగా చర్చ జరగాలి. హద్దు మీరితే చట్టప్రకారమే చర్యలు తీసుకోవాలి.

భావప్రకటనా స్వేచ్చ అంటే, సమాజంలో కల్లోలం రేపడమా? వాక్‌ స్వాతంత్ర్యం అంటే కులమతాల మధ్య చిచ్చురేపడమా? మాట్లాడే హక్కంటే మనోభావాలను దెబ్బతీయడమా? ఇలాంటి వ్యాఖ్యలు దేశానికి మంచి చేస్తాయా? ఇవి ఒక జాతి, నీతిని రీతిని నిలబెడతాయా? జాతీయస్థాయిలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ సాగుతున్న మాటల యుద్ధంలో చివరికి మిగిలేదేంటి?

arun

arun

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top