ఇసుకాసురులను ఎప్పుడు వధిస్తారు?

ఇసుకాసురులను ఎప్పుడు వధిస్తారు?
x
Highlights

తెలంగాణలో ఇసుక మాఫియా బరితెగింపుకు ఇంకా బ్రేకులు పడలేదు. ఇసుకాసురుల విజయ యాత్ర కొనసాగుతూనే ఉంది. కామారెడ్డి జిల్లాలో డ్యూటీలో ఉన్న వీఆర్ఏ ను ట్రాక్టర్...

తెలంగాణలో ఇసుక మాఫియా బరితెగింపుకు ఇంకా బ్రేకులు పడలేదు. ఇసుకాసురుల విజయ యాత్ర కొనసాగుతూనే ఉంది. కామారెడ్డి జిల్లాలో డ్యూటీలో ఉన్న వీఆర్ఏ ను ట్రాక్టర్ తో తొక్కించి మరీ ప్రాణాలు తీశారు. ఈ ఘటనతో ఊడలుదిగిన ఇసుకమాఫియా విశ్వరూపం మరోసారి సర్కారుకు సవాలు విసిరినట్టయింది.

కామారెడ్డి జిల్లాలోని పిట్లం మండలం కంబాపూర్ గ్రామశివారులో ఉన్న కాకివాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు వీఆర్ఏ సాయిలుకు సమాచారం అందింది. కుటుంబ సభ్యులకు ఆ విషయం చెప్పి.. సాయిలు కాకివాగు వద్దకు బయల్దేరాడు. అప్పటికే ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్న ముఠా సభ్యులను సాయిలు అడ్డుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో తీవ్రమైన ఆగ్రహంతో ఊగిపోయిన ఇసుక ముఠా వీఆర్ఏ సాయిలు మీదుగా ట్రాక్టర్‌ను తొక్కించారు. అనూహ్యమైన ఘటనతో తీవ్రంగా గాయపడిన సాయిలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఇసుక ముఠా నిర్వాకం తెలుసుకున్న పిట్లం గ్రామస్తులు, సాయిలు కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకొని ఆందోళన నిర్వహించారు. బాధితుల తరఫు బంధువులు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకోవడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సాయిలు కుటుంబాని న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఆరు నెలల క్రితం సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో ఇసుక మాఫియా అరాచకాలు యావత్ తెలంగాణను ఓ కుదుపు కుదిపాయి. మాఫియాను ప్రశ్నించినందుకు బీసీలు, దళితులపై పోలీసులు చాలా కిరాతకంగా వ్యవహరించారన్న విమర్శలు వచ్చాయి. మాఫియా దురాగతాలను కట్టడి చేయలేకపోయిన పోలీసులు.. మాఫియాను ప్రశ్నించిన యువకుల మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. పోలీసుల ప్రతాపానికి కొందరు యువకుల అవయవాలు తీవ్రస్థాయిలో దెబ్బతినడం గమనార్హం. నేరెళ్ల ఘటనపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఉద్యమించడంతో అది అప్పట్లో జాతీయ ఇష్యూగా మారింది. మాజీ స్పీకర్ మీరాకుమార్ నేరెళ్లలో పర్యటించి కన్నీళ్లు పెట్టుకున్నారు. అధికార పార్టీ నేతల బంధువులే ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్నారని ప్రతిపక్షాలతో పాటు మావోయిస్టు పార్టీ కూడా ఆరోపించడం విశేషం. ఆ ఘటనపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆలస్యంగా స్పందించడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories