సీబీఐలో ప్రకంపనల వెనుక తెలుగు వ్యక్తి

సీబీఐలో ప్రకంపనల వెనుక తెలుగు వ్యక్తి
x
Highlights

సీబీఐలో పెను ప్రకంపనాలకు తెలుగు వ్యాపారవేత్త సాన సతీష్‌ బాబు వాంగ్మూలం మూల కేంద్రంగా మారింది. ఢిల్లీ వ్యాపారి మెయిన్ ఖురేషీ కేసులో మధ్యవర్తిగా రంగ...

సీబీఐలో పెను ప్రకంపనాలకు తెలుగు వ్యాపారవేత్త సాన సతీష్‌ బాబు వాంగ్మూలం మూల కేంద్రంగా మారింది. ఢిల్లీ వ్యాపారి మెయిన్ ఖురేషీ కేసులో మధ్యవర్తిగా రంగ ప్రవేశం చేసిన సతీష్‌ బాబు విదేశాల్లో కొందరి తరపున లాబీయింగ్ చేశారు. ఇదే సమయంలో హైదరాబాద్‌కు చెందిన నగల వ్యాపారి సుఖేష్ గుప్తా బెయిల్ వ్యవహరంలోనూ జోక్యం చేసుకున్నాడు. అయితే మెయిన్ ఖురేషీ వ్యవహారంలో సతీష్ సానా నుంచి సీబీఐ మాజీ డైరెక్టర్‌ అలోక్ వర్మ మూడు కోట్ల రూపాయలు తీసుకున్నాడంటూ మాజీ స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేశ్ ఆస్ధానా ఆగస్టు 24న కేంద్ర కేబినెట్ కార్యదర్శికి లేఖ రాశారు.

ఇదే సమయంలో రాకేష్ ఆస్ధానా టీం మెంబర్ డీఎస్పీ దేవేందర్ సానా సతీష్‌ బాబు వాంగ్మూలమంటూ ఓ నివేదికను రూపొందించారు. ఇందులో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ద్వారా సీబీఐ తాజా మాజీ డైరెక్టర్‌ అలోక్‌ వర్మకు మూడు కోట్ల మేర లావాదేవీలు జరిగినట్టు ఈ నివేదికలో పేర్కొన్నారు. ఓ వైపు ఈ విచారణ జరుగుతుండగానే సాన సతీష్‌ బాబును సీబీఐ అప్పటి డైరెక్టర్‌ నేతృత్వంలోని మరో బృందం ప్రశ్నించింది. ఈ సందర్భంగా తాను అప్రూవ్‌గా మారుతానన్న ఆయన సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇచ్చారు. ఈ సందర్భంగా స్పెషల్ డైరెక్టర్‌ రాకేశ్ ఆస్ధానా పేరుతో తన దగ్గర దుబాయికి చెందిన మనోజ్ ప్రసాద్ మూడు కోట్ల రూపాయలు తీసుకున్నట్టు వివరించారు. ఈ డబ్బు ఇచ్చిన తరువాతే విచారణ నిలిచిపోయిందన్నారు. ఈ వాంగ్మూలం ఆధారంగానే రాకేష్ ఆస్ధానపై ఎఫ్‌ఐఆర్ ‌నమోదు కావడం డీఎస్పీ దేవేందర్‌ను అరెస్ట్ చేయడం, ఇరువురు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం వెంటనే జరిగిపోయాయి.

వివాదం రోజురోజుకు ముదురుతూ ఉండటంతో ఇరువురు అధికారులను రాత్రికి రాత్రే కేంద్రం సెలవుపై పంపింది. అయితే ఈ కేసులో మూల కేంద్రంగా ఉన్న సానా సతీష్ బాబు తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన వ్యక్తి. విద్యుత్ శాఖలో పని చేస్తుండగా నేతలతో ఏర్పడిన పరిచయంతో ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యాపార రంగంలోకి ప్రవేశించాడు. అధికార, ప్రతిపక్ష నేతలతో ఉన్న సంబంధాలతో పలు సంస్ధలు ఏర్పాటు చేసి వ్యాపారవేత్తగా ఎదిగాడు. ప్రస్తుతం రస్మ ఎస్టేట్స్‌, గోల్డ్ కోస్ట్‌ ప్రాపర్టీస్ ప్రయివేటు లిమిటెడ్‌, మాట్రిక్స్ రెసోసైన్స్ ప్రయివేటు లిమిటెడ్‌, ఈస్ట్ గోదావరి బ్రూవరీస్‌ లిమిటెడ్ సంస్ధలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు .

జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన వాన్‌పిక్‌‌ గ్రూపులోనూ గతంలో ఇతను డైరెక్టర్‌‌గా ఉన్నాడు. 2007 నుంచి ఇప్పటి వరకు 24 కంపెనీల్లో డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఎంబీఎస్ జ్యూవెల్లరీస్‌ ఛైర్మన్‌ సుఖేష్ గుప్తా బెయిల్ వ్యవహారంలో తొలిసారి ఇతని పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు ఎమ్మార్ ప్రాపర్టీస్‌ కేసులో దాఖలైన చార్జ్‌షీట్‌లోనూ సాన సతీష్‌ బాబు పేరుంది. ఖురేషీ వ్యవహారంలోనే సీబీఐ డైరెక్టర్ ఏపీ సింగ్ అవమానకర రీతిలో పదవి నుంచి వైదొలిగారు. సీబీఐ వ్యవహారం వెలుగు చూసిన తరువాత సాన సతీష్‌ అజ్ఞాతంలోకి వెళ్లారు. కుటుంబ సభ్యులతో పాటు హైదరాబాద్‌ విడిచి వెళ్లిన ఆయన ఎక్కడున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories