గద్వాల ఎమ్మెల్యే గన్‌మెన్ల సరెండర్ వెనక అసలు స్టోరి ఏంటి?

గద్వాల ఎమ్మెల్యే గన్‌మెన్ల సరెండర్ వెనక అసలు స్టోరి ఏంటి?
x
Highlights

ఆయన మేనత్తనే ఓడగొట్టి, అత్తకు తగ్గ అల్లుడనిపించిన నాయకుడు. అత్తగారి సంస్థానాన్ని కైవసం చేసుకున్న నేత. అన్ని సంవత్సరాలు పోరాడి పోరాడి అత్త మీద విజయం...

ఆయన మేనత్తనే ఓడగొట్టి, అత్తకు తగ్గ అల్లుడనిపించిన నాయకుడు. అత్తగారి సంస్థానాన్ని కైవసం చేసుకున్న నేత. అన్ని సంవత్సరాలు పోరాడి పోరాడి అత్త మీద విజయం సాధిస్తే, పార్టీలో తనకిచ్చే గౌరవం ఇదేనా అంటూ రగిలిపోతున్నారట సదరు ఎమ్మెల్యే. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రితో విసిగివేసారిపోతున్నారట. అధిష్టానం కూడా అతినికే వంతపాడుతుండటంతో మరింత మండిపోతున్నాడట. ఇంతగా ఆగ్రహంతో ఊగిపోతున్న ఈ ఎమ్మెల్యే చివరకు ఏం చేశాడో తెలుసా ఏకంగా తన ప్రభుత్వంపైనే ఎలాంటి నిరసన వ్యక్తం చేశాడో తెలుసా ఆ జిల్లాలో ఆయన నిరసన చూసి, గులాబీ అధినేతే షాకయ్యారట. ఇంతకీ ఏం చేశాడాయన.

ఉమ్మడి మహబూబ్ నగర్‌ జిల్లాలో, అధికార పార్టీ నేతల మధ్య ప్రచ్నన్నయుద్ధం ఓ రేంజ్‌లో సాగుతోంది. ఏ స్థాయిలో అంటే, చివరికి ప్రాణాలే పణంగా పెట్టి, గన్‌మెన్లను సరెండర్ చేసేదాకా. జోగులాంబ గద్వాల జిల్లాలో ఇంచార్జి మంత్రికి, గద్వాల ఎమ్మెల్యేకి మధ్య పచ్చగడ్డి వేసినా, వేయకున్నా భగ్గుమంటోంది. వీరిమధ్య రగడ గులాబీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన గన్‌మెన్లను సరెండర్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు, ఇన్‌ఛార్జి మినిస్టర్‌తో గొడవ కారణంగా, ఏకంగా అంగరక్షకులను తిరిగి పంపడం, కలకం రేపుతోంది. ఇంతకీ మంత్రి, ఎమ్మెల్యేల మధ్య గొడవకు కారణమేంటి?

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నిరంజన్ రెడ్డికి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి గొడవ మొదలైంది జోగులంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్మన్ అభ్యర్థి విషయంలో. తాను సూచించిన వారికి కాకుండా నిరంజన్ రెడ్డి సూచించిన వారినే జడ్పీ చైర్మన్‌గా అధిష్టానం సైతం బలపరచడంతో, ఎమ్మెల్యే బండ్ల రగిలిపోతున్నారు. అంతటితో ఆగక కొత్తగా జిల్లా పరిషత్‌కు రావలసిన జడ్పీ సీఈవో విషయంలో కూడా కృష్ణమోహన్ రెడ్డి సూచించిన అధికారిని కాకుండా మంత్రి చెప్పిన అధికారినే సీఈఓగా పంపడంతో వివాదం మరింత ముదిరింది. ఇదే కాకుండా గద్వాల నియోజకవర్గ పరిధిలోని పలు అంశాలలో కూడా మంత్రి జోక్యం చేసుకుంటున్నారని, బండ్ల వర్గం కారాలు మిరియాలు నూరుతోంది.

జరుగుతున్న ఇలాంటి పరిణామాలతో రగిలిపోతున్నారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి. గద్వాల నియోజకవర్గానికి, జిల్లాకు సంబంధించిన అన్ని విషయాల్లో సీనియర్ నేతలు, అటు అధిష్టానం కూడా మంత్రి వైపే మొగ్గుచూపుతుండటం కూడా ఎమ్మెల్యే అసహనానికి కారణమైనట్టు తెలుస్తోంది. సీనియర్ నాయకురాలైన డికె అరుణను సైతం ఓడించిన తనకు, అధిష్టానం ఇచ్చే గౌరవం ఇదేనా, సపోర్ట్ చెయ్యకుండా మంత్రి అనుచర వర్గాన్నే సమర్థిస్తున్నారన్న కోపంతో మనస్తాపం చెందిన ఎమ్మెల్యే, ఏకంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపైనే నిరసన జెండా ఎగరేశారు. ప్రభుత్వం తనకు కేటాయించిన గన్‌మెన్లను తిరిగిచ్చేసినట్టుగా జోరుగా ప్రచారం జరుగుతుండటం, గద్వాల గులాబీలో కలకలానికి కారణమవుతోంది.

ఇప్పటికైనా అధిష్టానం స్పందించకపోతే వివాదం మరింతగా ముదిరే అవకాశం ఉందంటూ గద్వాల టీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుకుంటున్నారు. దీని కారణంగానే తాజాగా జడ్పీ ఛైర్మన్ ప్రమాణ స్వీకారానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరు కావాల్సి ఉండగా, ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని తెలుస్తోంది. ఆయన అటెండ్ కాకపోవడం, ఎమ్మెల్యే అనూహ్యంగా తన గన్‌మెన్లను ప్రభుత్వానికి సరెండర్ చెయ్యడం, రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని గద్వాల జిల్లాలోని గులాబీ శ్రేణులు ఆందోళనకు గురౌతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories