ఇంద్రవెల్లి మారణహోమానికి 38ఏళ్లు...పిట్టల్లా కాల్చిచంపిన పోలీసులు

ఇంద్రవెల్లి మారణహోమానికి 38ఏళ్లు...పిట్టల్లా కాల్చిచంపిన పోలీసులు
x
Highlights

ఆదివాసీలు పిడికిలి బిగించారు హక్కుల కోసం గిరిజన మహిళలు తిరగబడ్డారు దోపిడీని ఎదిరించడానికి దండులా కదిలారు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం యుద్ధం...

ఆదివాసీలు పిడికిలి బిగించారు హక్కుల కోసం గిరిజన మహిళలు తిరగబడ్డారు దోపిడీని ఎదిరించడానికి దండులా కదిలారు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం యుద్ధం ప్రకటించారు ఇంద్రవెల్లి సాక్షిగా దోపిడీ వ్యవస్థపై సమరశంఖం పూరించారు. 38ఏళ్ల క్రితం జరిగిన ఇంద్రవెల్లి పోరాటంలో ఎందరో గిరిజనులు అసువులు బాశారు. మరో జలియన్ వాలాబాగ్‌ ఇంద్రవెల్లిపై hmtv ప్రత్యేక కథనం.

దేశంలో పరాయి పాలన అంతమై అప్పటికి మూడు దశాబ్దాలైంది. అయినా ఆనాటి ఆదిలాబాద్‌ జిల్లాలో దోపిడీ వ్యవస్థ అంతం కాలేదు. అక్కడంతా పెత్తందార్లు, భూస్వాములదే ఆధిపత్యం ఆరుగాలం కష్టించి సాగుచేసిన పంటను సైతం దోపిడీ చేసేవారు. పెత్తందార్లు, భూస్వాములు, వ్యాపారులు అంతా కలిసి గిరిజనులను రాబందుల్లా పీక్కుతినేవారు. దాంతో ఈ అరాచకాలకు ముగింపు పలకాలనే లక్ష్యంతో రైతు కూలీ సంఘం ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా ఇంద్రవెల్లిలో 1981 ఏప్రిల్ 20న సభ నిర్వహించాలని నిర్ణయించారు. దాంతో చిన్నాపెద్దా యువకులు, వృద్ధులు, మహిళలు ఇలా అందరూ దండులా కదిలివచ్చారు. అయితే సభకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి రద్దు చేసింది ప్రభుత్వం. అదే సమయంలో గిరిజన మహిళతో జరిగిన చిన్నపాటి గొడవతో పోలీసులు ఎలాంటి హెచ్చరికల్లేకుండా కాల్పులు జరిపారు. దొరికినవాళ్లను దొరికినట్లు పిట్టల్లా కాల్చిచంపారు. దాంతో ఇంద్రవెల్లి క్షణాల్లోనే నెత్తుటి మడుగుగా మారిపోయింది. సభకు వచ్చిన వేలాది మంది చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురయ్యారు. ఆనాటి మారణహోమంలో సర్కారు లెక్కల ప్రకారం 13మంది మరణించగా, నిజనిర్ధారణ సంఘాలు మాత్రం 80మందికి పైగా చనిపోయారని తేల్చింది. ఇక క్షతగాత్రుల సంఖ్య వందల్లో ఉంది.

ఇంద్రవెల్లి పోరాటం భారతదేశ చరిత్రలో లిఖించదగినదని, కానీ తమకు ఒరిగిందేమీ లేదని గిరిజనులు వాపోతున్నారు. ఆనాటి మారణహోమం ఎన్నో కుటుంబాల్లో కోలుకోలేని విషాదాన్ని నింపిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బాధిత కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం జరగలేదంటున్న గిరిజనులు జలియన్ వాలాబాగ్‌ మాదిరిగా ఇంద్రవెల్లిలో స్మృతి వనం నిర్మించాలని, తెలంగాణ అమరవీరులకు ఇచ్చినట్లుగా సహాయం అందించాలని కోరుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories