భగ్గుమంటున్న కూరగాయల ధరలు

భగ్గుమంటున్న కూరగాయల ధరలు
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయలకు ఎండదెబ్బ తగిలింది. దీంతో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. టమోట, పచ్చిమిరప ధరలైతే కాస్త ఎక్కువగా మండుతున్నాయి....

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయలకు ఎండదెబ్బ తగిలింది. దీంతో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. టమోట, పచ్చిమిరప ధరలైతే కాస్త ఎక్కువగా మండుతున్నాయి. గతేడాది ఏప్రిల్‌, మే నెలల్లో వీటి ధర సాధారణంగానే ఉన్నప్పటికీ గత నెల, ఈ నెలలో మాత్రం భారీగా పెరిగాయి. వచ్చే నెల వరకు ఈ ధరలు ఇలాగే ఉండే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇతర కూరగాయల ధరలు కూడా గతేడాది ఏప్రిల్‌-మే నెలల్లో ఉన్న ధరలకంటే ఇప్పుడు బాగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఇప్పుడు కొన్ని రకాల కూరగాయల ఉత్పత్తి తగ్గడంతోపాటు రైతుబజార్లకు వస్తున్న సరకు చాలా వరకు తగ్గింది. విజయవాడలోని స్వరాజ్‌మైదాన్‌ రైతుబజార్‌కు వచ్చిన సరకుల వివరాలు చూస్తే.. 2018 ఏప్రిల్‌లో టమోట 5359 క్వింటాళ్లు రాగా గత నెల 4916 క్వింటాళ్లు వచ్చాయి. మొత్తం రైతుబజార్లకు వచ్చిన సరకులోనూ తరుగుదల కనిపిస్తోంది.

ఏపీలో టమోటకు ప్రధాన కేంద్రమైన మదనపల్లెలో రెండ్రోజుల నుంచి ధర కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ సరకు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఈ సమయంలో మార్కెట్‌కు రోజకు 400-500టన్నుల వరకు టమోట రావాల్సి ఉండగా ఇప్పుడు కేవలం 180-190 టన్నుల మధ్యలోనే వస్తోంది. నీటి లభ్యత లేకపోవడం, పంట పూర్తి స్థాయిలో రాకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తింది. జనవరినుంచి టమోటకు కాస్త ధర వస్తుండడంతో చిత్తూరుతోపాటు కడప, అనంతపురంలో కొన్ని ప్రాంతాల్లో ఫిబ్రవరి, మార్చి నెలల్లో టమోట వేశారు. ఈ పంటలు ఈ నెలాఖరు నుంచి చేతికందే అవకాశం ఉంది.

పచ్చిమిరపకు ప్రధాన కేంద్రమైన కడప జిల్లా మైదుకూరు, ఖాజీపేట ప్రాంతాల్లో ఆకుముడత తెగులుతో ఒకటి రెండు కాపులు రాగానే పంట ఎండిపోతోంది. దీంతో దిగుబడి బాగా తగ్గింది. ఈ సమయంలో సాధారణంగా రోజుకు వేయి బస్తాల వరకు వచ్చేవని, ఇప్పుడు 150 బస్తాలకు మించడం లేదని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అక్కడ మనుము..అంటే 11.25కేజీల ధర 380 రూపాయల నుంచి 450 వరకు పలుకుతుండగా.. పంట దిగుబడి లేకపోవడంతో మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో మిరప అయిపోవడంతో కడప జిల్లా నుంచే మిరప రావాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ప్రభావం కూడా ధరలపై పడుతోంది.

హైదరాబాద్‌, బెంగళూరులాంటి ప్రాంతాల నుంచి వచ్చే క్యారెట్‌, బీన్స్‌, బీట్‌రూట్‌, బీర తగ్గుముఖం పట్టడంతో వాటి ధరలూ కాస్త పెరిగాయి. ఈ నెలలో పెళ్లిళ్లు కూడా ఎక్కువగా ఉన్నందున కూరగాయల ధరలు ఇప్పుడిప్పుడే తగ్గే అవకాశం లేదని విజయవాడకు చెందిన వ్యాపారులు తెలిపారు. ఎండల తాకిడి ఉల్లి ధర వేడిని పెంచే అవకాశం లేకపోలేదని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే మే నెలలో మార్కెట్‌లోకి వచ్చిన, వస్తున్న ఉల్లి తక్కువగా ఉండడం ఇందుకు కారణంగా విశ్లేషిస్తున్నాయి. ఉల్లి తగిన మొత్తంలో అందుబాటులో లేకపోవడంతో ఇప్పటికే ఉల్లి ధర కిలో 15 రూపాయల నుంచి 20 మధ్య ధర పలుకుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories