ఫోన్లలో రెచ్చిపోతున్న రాజకీయ నేతలు...తాము చెప్పింది వింటే సరే...లేదంటే నరకమే

x
Highlights

ముందు నోరు జారడం ఆ తర్వాత నాలుక్కరుచుకోవడం ఇదంతా ప్రజా ప్రతినిధులకు అలవాటే. బహిరంగ సభలు, సమావేశాల్లో ప్రజా ప్రతినిధుల నోటికి కొంచెం అదుపులో ఉంటుంది....

ముందు నోరు జారడం ఆ తర్వాత నాలుక్కరుచుకోవడం ఇదంతా ప్రజా ప్రతినిధులకు అలవాటే. బహిరంగ సభలు, సమావేశాల్లో ప్రజా ప్రతినిధుల నోటికి కొంచెం అదుపులో ఉంటుంది. ఇక అంతర్గతంగా, ఫోన్‌లలో అయితే నేతల నోటికి అడ్డూ అదుపు ఉండదు. తమకు ఎదురుతిరిగినా చెప్పినట్లు వినకపోయినా ప్రత్యర్థులైనా, అధికారులైనా చివరికి సొంత పార్టీకి చెందిన వారైనా బెదిరింపులు మాములుగా ఉండవు. బూతులు కూడా ఓ రేంజ్‌లో ఉంటాయ్‌.

రాజకీయ నేతలు బహిరంగ సభలు, సమావేశాలు, మీడియా సమావేశాల్లో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటారు. తాము మాట్లాడిన అంశం వివాదాస్పదమైతే అలాంటి వ్యాఖ్యలే చేయలేదని తప్పును కప్పి పుచ్చుకుంటారు. బహిరంగ సమావేశాల్లో ఇష్టమొచ్చినట్లు మాట్లాడి నాలుక్కరుచుకున్న నేతలు ఎంతో మంది ఉన్నారు. మీడియా ముందు నోరు జారి వివాదాస్పదమైతే కొంత మంది తప్పును సరిదిద్దుకుంటారు. మరి కొందరు ఎవరేమనుకున్నా లెక్కలోకే తీసుకోరు.

ప్రజాప్రతినిధులు బహిరంగసభలు, సమావేశాల్లో నేతల మాటలకు కొంత అదుపు ఉంటుంది. ఫోన్‌లో అయితే నేతల మరింత రెచ్చిపోతున్నారు. ముందు వెనుక ఆలోచించకుండా నోటికి పని చెబుతున్నారు. నేతలు చెప్పిన పని చేయకపోయినా ఎదురు తిరిగినా నేతల ఆగ్రహం మాములుగా ఉండదు. అవతలి వ్యక్తి ఫోన్‌లో వినలేని భాష ఉపయోగిస్తారు. బూతులు ఉపయోగించడంలోనూ నేతల తర్వాతే ఎవరైనా. బాధితుడు ప్రభుత్వ అధికారి అయినా లేదంటే సొంత పార్టీ వారైనా ప్రత్యర్థి అయినా తిట్టిన తిట్టు తిట్టకుండా భాషను ఉపయోగిస్తున్నారు.

అయితే నేతల బెదిరింపులు, మాట తీరు కాస్తా బాధితులు రికార్డు చేస్తుండటంతో అడ్డంగా బుక్కవుతున్నారు. వారు మాట్లాడిన ప్రతి మాటను రికార్డు చేసి మీడియాకు విడుదల చేస్తున్నారు. దీంతో నేతల వ్యవహారశైలి కాస్తా బహిర్గతమవుతోంది. రాజకీయ నేతలు ఫోన్‌లో మాట్లాడేటపుడు ఎవరితోనైనా జాగ్రత్తగా మాట్లాడకపోతే విమర్శలు పాలు కావాల్సిందే. తమ వాయిస్‌ను ఎవరు రికార్డు చేయరని అనుకుంటే తప్పులో కాలేసినట్లే.

తెలంగాణలో అధికార పార్టీ నేతలయితే మరింత రెచ్చిపోతున్నారు. తాము చెప్పింది వింటే సరే లేదంటే వారికి చూపించే నరకం మరోలా ఉంటుంది. మొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం, నిన్న మంచిర్యాల జిల్లాకు చెందిన చిన్నయ్య, తాజాగా ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి మందా జగన్నాథం ముగ్గురు కూడా ఫోన్‌లలో రెచ్చిపోయారు. ఎవరికి తెలియదని ఫోన్‌లో నోటితో ఉపయోగించలేని భాషను ఉపయోగిస్తున్నారు.

తెలంగాణలో పార్టీ నేతల వ్యవహారశైలి అధికార పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయ్. ఒకరి తర్వాత ఒకరు ఫోన్‌లో బెదిరింపులకు దిగి విమర్శలు పాలవుతున్నారు. బాధితులు కాస్తా నేతల మాటలన్ని రికార్డు చేసి మీడియా లేదంటే సోషల్ మీడియాలో పెడుతున్నారు. దీంతో నేతలు జనంలో అబాసు పాలవుతున్నారు.

మాజీ ఎంపీ, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న మందా జగన్నాథం ఓ మీడియా ప్రతినిధిని ఫోన్‌లో ఇష్టమొచ్చినట్లు తిట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి మందా జగన్నాథం కాంగ్రెస్‌లో చేరుతున్నారంటూ వార్త రాశారు. దీంతో జగన్నాథం కోపం నషాళానికి ఎక్కింది ఇంకేముందీ తిట్టిన తిట్టు తిట్టకుండా రిపోర్టర్‌కు ఫోన్ చేసి తిట్టాడు. గల్లీ లీడర్‌ కంటే ఘోరంగా మాట్లాడిన మందా జగన్నాథం బెదిరింపులు సోసల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయ్.

గతడ డిసెంబర్‌లో ఎమ్మెల్యే వేముల వీరేశం నల్గొండ జిల్లాకు చెందిన డీసీసీబీ బ్యాంక్ సీఈవోను ఫోన్‌లో బెదిరించారు. నల్గొండ డీసీసీబీ బ్యాంకులో డీజీఎమ్‌గా పనిచేస్తున్న లక్ష్మమ్మ 2015లో సస్పెండ్ అయ్యింది. రెండేళ్లుగా సస్పెన్షన్ ఎత్తివేయకపోవడంతో బాధితురాలు ఆమె ఎమ్మెల్యే వీరేశంను ఆశ్రయించింది. లక్ష్మమ్మను తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవాలని డీసీసీబీ బ్యాంకు సీఈవోకు హుకుం జారీ చేశారు వీరేశం. అలా జరగకపోతే 10 లక్షలు లంచం డిమాండ్ చేశావని సీఎంకు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించారు. బాధితుడు వీరేశం వాయిస్‌ను ఫోన్‌లో రికార్డ్ చేసి మీడియాకు విడుదల చేయడంతో కావాల్సినంత డ్యామేజ్‌ జరిగిపోయింది.

మంచిర్యాల జిల్లాకు చెందిన బెల్లంపల్లి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్ అవిశ్వాసం విషయంలో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య రెచ్చిపోయారు. 34వ వార్డు కౌన్సిలర్ సత్యవతి కూతురుకి ఫోన్‌ చేసి ఛైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న క్యాంపు నుంచి బయటికి రావాలంటూ ఫోన్‌లో బెదిరింపులకు దిగాడు. మాట వినకపోతే ఏం చేయాలో మాకు తెలుసన్న చిన్నయ్య ఎవర్ని ఎలా ఇబ్బంది పెట్టాలో కూడా తెలుసంటూ వార్నింగ్ ఇచ్చారు. ఏ అధికారి అయినా ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటారని ప్రభుత్వం తలచుకుంటే క్యాంపు రాజకీయాలు ఎంత సేపంటూ కౌన్సిలర్‌‌ను కూతుర్ని హెచ్చరించారు. కౌన్సిలర్ కూతురు ఎమ్మెల్యే వాయిస్‌ను రికార్డ్ చేసి మీడియాకు విడుదల చేసింది. ప్రజాప్రతినిధుల వాయిస్‌ను రికార్డ్ చేసి మీడియా లేదంటే సోషల్ మీడియాలో పెడుతుండటంతో జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఇప్పటికైనా నేతలు ఫోన్‌లో మాట్లాడేటపుడు నోటిని అదుపులోకి పెట్టుకోకపోతే విమర్శల పాలుకాక తప్పదు.

Show Full Article
Print Article
Next Story
More Stories