ప్రత్యర్థులకు మరిన్ని షాకులిచ్చేందుకు సిద్ధమవుతున్న రిలయన్స్‌ జియో

Highlights

వచ్చీ రావడంతోనే సంచలనాలకు వేదికై ఎన్నో రికార్డులను సాధించింది ప్రత్యర్థులకు కంటిమీద కునుకులేకుండా చేసింది అదేనండీ రిలయన్స్‌ జియో. సంచలనాలకు చిరునామాగా...

వచ్చీ రావడంతోనే సంచలనాలకు వేదికై ఎన్నో రికార్డులను సాధించింది ప్రత్యర్థులకు కంటిమీద కునుకులేకుండా చేసింది అదేనండీ రిలయన్స్‌ జియో. సంచలనాలకు చిరునామాగా మారిన జియో మరిన్ని కీలక ప్రకటనలు చేయబోతుందా? నేడు జరిగే వార్షిక సాధారణ సమావేశంలో రిలయన్స్‌ ఈసారి ఎలాంటి సంచలనాలకు తెర తీయనుంది?

ఉచిత కాల్స్‌, ఉచిత డేటాతో ప్రత్యర్థులకు కంటిమీద కునుకులేకుండా చేసిన రిలయన్స్‌ జియో మరిన్ని షాక్‌లు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకు నేడు జరిగే ఆ సంస్థ వార్షిక సాధారణ సమావేశం వేదిక కానుంది. ఏజీఎంలో రిలయన్స్‌ జియో మరిన్ని కీలక ప్రకటనలు చేయబోతుందంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. సంస్థ నుంచి 500 రూపాయలకే ఫోన్‌ వస్తుందని ఇది వరకే వార్తలు వచ్చాయి. అయితే, ఇదే సమావేశంలో దాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ఇంటెక్స్‌ సంస్థ తయారు చేస్తున్న ఈ ఫోన్‌ను రాయితీపై వినియోగదారులకు జియో అందివ్వనుంది. 4జీ ఓల్టేసదుపాయం కలిగిన ఈ ఫోన్‌ చౌక ధరకే ఇవ్వడం ద్వారా మరింత మంది వినియోగదారులకు చేరువయ్యేందుకు జియోకు అవకాశం ఏర్పడుతుంది.

వెల్‌కమ్‌ ఆఫర్‌, న్యూఇయర్‌ ఆఫర్‌, సమ్మర్‌ సర్‌ప్రైజ్‌ ఆఫర్ల పేరిట ఇంతకాలం ఉచిత సేవల్ని అందించిన జియో ఇటీవల మరో రెండు కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది. కొత్తగా 349 రూపాయలు, 399 రూపాయల ప్లాన్లను తీసుకొచ్చింది. తాజా సమావేశంలో 80-90 రూపాయల మధ్య ఓ ప్రత్యేక ప్లాన్‌ను ప్రవేశపెట్టే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది అయితే, ఈ ప్లాన్‌ కొత్తగా తీసుకొచ్చే జియో ఫీచర్‌ ఫోన్‌కా? లేక వినియోగదారులందరికా? అన్నది నేటి రిలయన్స్ ఏజీఎంలో తేలనుంది.

ఇదే ఏజీఎంలో జియో బ్రాడ్‌బాండ్‌ను కూడా ఆవిష్కరించే అవకాశం కనిపిస్తోంది. జియో ఫైబర్‌ పేరిట తీసుకొస్తున్న ఈ సేవలను ఇప్పటికే ఆరు నగరాల్లో జియో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది. ఈ కనెక్షన్‌ తీసుకుంటే 100 ఎంబీపీఎస్‌ వేగంతో 100 జీబీ డేటాను మూడు నెలల పాటు ఉచితంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే, ఇందుకు గానూ 4500 డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు. నేటి రిలయన్స్ ఏజీఎంలో జియో 10 కోట్ల మంది వినియోగదారులకు సంబంధించిన పూర్తి వివరాలు, అంకెలను ఏజీఎంలో ప్రకటించే అవకాశం కూడా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories