ఫలించిన బుజ్జగింపులు.. వెనక్కి తగ్గిన రెబెల్స్‌

ఫలించిన బుజ్జగింపులు.. వెనక్కి తగ్గిన రెబెల్స్‌
x
Highlights

అగ్రనేతల బుజ్జగింపులు ఫలించాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు సమయానికి తిరుగుబాటు అభ్యర్థులు దారిలోకి వచ్చారు. చాలామంది రెబెల్స్ నామినేషన్లు...

అగ్రనేతల బుజ్జగింపులు ఫలించాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు సమయానికి తిరుగుబాటు అభ్యర్థులు దారిలోకి వచ్చారు. చాలామంది రెబెల్స్ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. టిక్కెట్ ఆశించి భంగ పడిన ఆశావహులు అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగరవేసి చివరి నిమిషంలో మెత్తబడ్డారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసే సమయానికి పోటీ నుంచి తప్పుకున్నారు. పార్టీ నిర్ణయం మేరకే తాము నడుచుకుంటామని, పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తామని ప్రకటించారు. దీంతో ప్రధాన పార్టీల నేతలతో పటు అభ్యర్థులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.

కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి హనుమంత రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అలాగే చేవెళ్లలో కాంగ్రెస్‌ రెబెల్‌ అభ్యర్థి పడాల వెంకట స్వామి సైతం వెనక్కి తగ్గారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రత్నంకే మద్దతు ఇస్తానని ప్రకటించారు. అలాగే మేడ్చల్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి జంగయ్య యాదవ్ కూడా తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. కోదాడ నియోజకవర్గంలో టీఆర్ఎస్ రెబెల్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన శశిధర్‌ రెడ్డి పోటీ నుంచి వైదొలిగారు. మిర్యాలగూడలో కాంగ్రెస్‌ రెబెల్‌ అభ్యర్థి అలుగుబెల్లి అమరేంద్రరెడ్డి కూడా నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. పార్టీ అభ్యర్థి ఆర్.కృష్ణయ్యతో కలిసి ఆర్డీవో కార్యాలయానికి వచ్చిన అమరేంద్రరెడ్డి నామినేషన్‌ వెనక్కి తీసుకున్నారు.

వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడైన నాయిని రాజేందర్‌ రెడ్డి వరంగల్‌ వెస్ట్ స్థానానికి వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. పీపుల్స్ ఫ్రంట్ పొత్తుల్లో భాగంగా వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గాన్ని టీడీపీకి కేటాయించడంతో నిరాశ చెందిన నాయిని రాజేందర్‌ రెడ్డి రెబెల్‌గా పోటీలో నిలిచారు. చివరి నిమిషంలో ఆయన వెనక్కి తగ్గారు. పార్టీ సూచన మేరకు నామినేషన్‌ను ఉపసంహరించుకున్నానని నాయిని రాజేందర్‌ రెడ్డి ప్రకటించారు. వరంగల్‌ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజా కూటమి తరఫున ప్రచారం చేస్తానని, టీడీపీ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌ రెడ్డికి మద్దతిస్తానని స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లాలో కూడా కాంగ్రెస్ అసంతృప్త నేతలు వెనక్కి తగ్గారు. కాంగ్రెస్ రెబెల్‌గా నామినేషన్ వేసిన ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల అసమ్మతి నేతలు సుభాష్ రెడ్డి, మాల్యాద్రిరెడ్డి నామినేషన్లు ఉపసహరించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories