అభ్యర్థులు వర్సెస్ అసమ్మతి నేతలు... ఇదీ గులాజీ రాజకీయం

అభ్యర్థులు వర్సెస్ అసమ్మతి నేతలు... ఇదీ గులాజీ రాజకీయం
x
Highlights

అభ్యర్ధులను ప్రకటించింది టిఆర్ఎస్. దీంతో అభ్యర్ధులు భారీ ర్యాలీలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే అటు అసమ్మతి నేతలు కూడా, వారికి...

అభ్యర్ధులను ప్రకటించింది టిఆర్ఎస్. దీంతో అభ్యర్ధులు భారీ ర్యాలీలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే అటు అసమ్మతి నేతలు కూడా, వారికి వ్యతిరేకంగా, ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. పోటాపోటీగా, సొంత పార్టీ నేతలకే సవాల్ విసురుతున్నారు. అభ్యర్థులను మార్చాలి, తమ పేరును ప్రకటించాలి, లేదంటే ఇండిపెండెంట్లుగా పోటీకి సై అంటున్నారు. నల్లగొండ, మిర్యాలగూడలో ఎమ్మెల్యే అభ్యర్థులు వర్సెస్ అసమ్మతి నేతల పోటాపోటీర్యాలీలు, సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి.

నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా కంచర్ల భూపాల్ రెడ్డిని అధిష్టానం ప్రకటించింది. దీంతో ముందు నుంచి పార్టీలో టికెట్‌ ఆశిస్తున్నవారు, అసమ్మతి స్వరం పెంచారు. కంచర్ల భూపాల్ రెడ్డి, టిడిపి నుంచి టిఆర్ఎస్‌లో చేరి ఏడాది కూడా కాలేదు, అప్పుడే టికెట్‌ ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. కానీ పార్టీ ఆవిర్భావం నుంచి తామంతా పనిచేస్తున్నామని, తమకు టికెట్ ఇచ్చినా, లేదంటే మొదటి నుంచి పార్టీలో పనిచేసినా వారికి టికెట్ ఇచ్చినా పనిచేస్తామని, ఆయా వర్గాలు వరుసగా కంచర్ల భూపాల్ రెడ్డికి వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి.

ఇప్పటికే టిఆర్ఎస్ రాష్ట్ర్ర సహాయ కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ముఖ్య అనుచరులతో సమావేశం నిర్వహించారు. మరోవైపు గత ఎన్నికల్లో టిఆర్ఎస్ తరపున పోటిచేసి ఓడిపోయిన దుబ్బాక నర్సింహ్మారెడ్డి, నల్లగొండ టికెట్ ఆశించిన తిప్పర్తి జడ్పీటిసి తండు సైదులు గౌడ్‌తో కలిసి నార్కట్‌పల్లిలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇద్దరు నేతలు కలిసి నల్లగొండ నియోజకవర్గంలో భారీ ర్యాలీ,సభ నిర్వహించేందుకు ఫ్లాన్ చేస్తున్నారు. కంచర్ల భూపాల్ రెడ్డికి తప్ప ఎవరికి టికెట్ వచ్చిన పార్టీ కోసం పనిచేస్తామని ..ముఖ్య కార్యకర్తలు సమావేశంలో వెల్లడించారు అసమ్మతి నేతలు. ఒకవేళ పార్టీ గుర్తించకపోతే, బిసి సామాజిక వర్గానికి చెందిన తండు సైదులు గౌడ్‌ను స్వతంత్ర అభ్యర్ధిగా నిలిపి ఎన్నికల బరిలో దిగుతామని దుబ్బాక నర్సింహ్మారెడ్డి ముఖ్యకార్యకర్తలతో అన్నారు.

ఇదే సీన్ మిర్యాలగూడలోను కనిపిస్తోంది. ప్రస్తుతం టిఆర్ఎస్ అభ్యర్ధిగా భాస్కర్ రావును ప్రకటించారు. గతంలో కాంగ్రెస్‌లో గెలిచిన ఈ‍యన, టిఆర్ఎస్‌లో చేరారు. చాలాకాలంగా టిఆర్ఎస్‌లో ఉన్న అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి, మిర్యాలగూడ టిఆర్ఎస్ టికెట్ ఆశించారు. గత ఎన్నికల్లో మిర్యాలగూడ నుంచి టిఆర్ఎస్ అభ్యర్ధిగా, భాస్కర్ రావు మీద పోటి చేసి ఓడిపోయారు. దీంతో తనకు టిఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిందని, భాస్కర్ రావు అభ్యర్ధిత్వాన్ని మార్చాలని మిర్యాలగూడలో భారీ ర్యాలీ నిర్వహించి, సమావేశం నిర్వహించారు. భాస్కర్ రావును మారిస్తే సరి, లేదంటే స్వతంత్ర అభ్యర్ధిగా దిగేందుకు అమరేందర్ రెడ్డి సిద్దమయ్యారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీకి అభ్యర్ధులు ప్రకటించడంతో అసమ్మతుల సమావేశాలు జోరుందుకున్నాయి. కానీ టిఆర్ఎస్ అధినేతతో పాటు కేటీఆర్ సైతం పర్సనల్ ఫోన్లు చేసి అసమ్మతి నేతలను బుజ్జిగిస్తున్నట్లు సమాచారం. అయినా నేతలు వినడం లేదని తెలుస్తోంది. అసమ్మతి సెగలు త్వరగా చల్లారుతాయని, ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, నల్గొండ టిఆర్ఎస్ అభ్యర్ధి కంచర్ల భూపాల్ రెడ్డి అంటున్నారు. నల్లగొండ ,మిర్యాలగూడ నియోజకవర్గాల్లో మాత్రం అసమ్మతి నేతలు స్వతంత్రులగా పోటి చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటుండంతో ప్రస్తుతం అభ్యర్ధిగా నిలిచిన నేతల్లో గుబులు మొదలైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories