తెలంగాణకు జల తోరణం..కాళేశ్వరం కల సాకారం నేడే

తెలంగాణకు జల తోరణం..కాళేశ్వరం కల సాకారం నేడే
x
Highlights

కాసేపట్లో తెలంగాణ జల ఆశయం నెరవేరబోతోంది. దశాబ్దాలుగా తడి ఎరుగని తెలంగాణ మగాణులకు జలాభిషేకం శుభవేళ నీటికోసం పరితపిస్తున్న బీడు భూముల దాహార్తి తీర్చే...

కాసేపట్లో తెలంగాణ జల ఆశయం నెరవేరబోతోంది. దశాబ్దాలుగా తడి ఎరుగని తెలంగాణ మగాణులకు జలాభిషేకం శుభవేళ నీటికోసం పరితపిస్తున్న బీడు భూముల దాహార్తి తీర్చే మహోన్నత ఘట్టానికి కొద్దిసేపట్లో ఆవిష్కృతం కానుంది. వివిధ దశల్లో ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం ప్రారంభం కానుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును కాసేపట్లో గవర్నర్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులతోపాటు అతిరథ మహారథుల సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. గవర్నర్‌, పొరుగు సీఎంలతోపాటు తెలంగాణ మంత్రులు వివిధ బరాజ్‌లు, పంప్‌హౌస్‌లను ప్రారంభిస్తారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఉదయం 8 గంటలకు మేడిగడ్డ బరాజ్‌కి సీఎం కేసీఆర్‌ వస్తారు. హోమంలో పాల్గొంటారు.9 గంటలకు ఏపీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్‌, ఫడ్నవీస్‌ అక్కడికి వస్తారు. 10.50 గంటలకు మేడిగడ్డ బరాజ్‌ని ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరో నంబరు గేటును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కన్నెపల్లి పంపుహౌ్‌సలో ఆరో నంబరు మోటార్‌ను కేసీఆర్‌ స్విచ్ఛాన్‌ చేసి ప్రారంభిస్తారు. డిస్ర్టిబ్యూటరీ సిస్టం వద్దకు వెళ్లి గ్రావిటీ కెనాల్‌ ద్వారా అన్నారం బరాజ్‌కు గోదావరి జలాలు వెళ్లడాన్ని పరిశీలిస్తారు. సాయంత్రం 4 గంటలకు కేసీఆర్‌, తదితరులు తిరుగు పయనమవుతారు.

ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఎలాంటి ఆటంకాలు ఎదురవకుండా ఉండేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు దేవాదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో హోమాలు, రుద్రాభిషేకాలు, తులసీ అర్చనలు, కుంకుమార్చనతోపాటు ఇతర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడూ జలాలతో నిండి ఉండాలని, ప్రజల కష్టాలను తొలగించి, అవసరాలను సంపూర్ణంగా తీర్చాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్న సంకల్పంతో అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories