శ్రీదేవి గురించి గొప్ప నిర్వ‌చ‌నం చెప్పిన ఆర్జీవీ

శ్రీదేవి గురించి గొప్ప నిర్వ‌చ‌నం చెప్పిన ఆర్జీవీ
x
Highlights

అతిలోక సుందరి శ్రీదేవికి కోట్లాదిమంది అభిమానులున్నారు. ఎంతోమంది ఆరాధకులు, ఇష్టపడేవాళ్లు, ప్రేమించేవాళ్లూ ఉన్నారు. కానీ వాళ్లందరి ఆరాధన దర్శకుడు రామ్...

అతిలోక సుందరి శ్రీదేవికి కోట్లాదిమంది అభిమానులున్నారు. ఎంతోమంది ఆరాధకులు, ఇష్టపడేవాళ్లు, ప్రేమించేవాళ్లూ ఉన్నారు. కానీ వాళ్లందరి ఆరాధన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అచంచలమైన ప్రేమకు సాటి రావు. ఏ విషయాన్నైనా ఎవరికీ భయపడకుండా, మొహమాటపడకుండా చెప్పే వర్మ.. శ్రీదేవిపై తన ప్రేమనూ అలాగే కొన్ని వందలసార్లు బహిరంగంగా వెల్లడించాడు. శ్రీదేవి కోసమే సినిమాల్లోకి వచ్చిన వర్మ ఆమెతో కలిసి ఉండే అవకాశం కోసమే ఆమెతో సినిమాలు తీశాడు.

షూటింగ్ కు ఆలస్యంగా వచ్చిందని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఒకసారి శ్రీదేవిని బాగా కోప్పడ్డారట. మరి రాఘవేంద్రరావు స్థానంలో మీరుంటే ఏం చేసుండేవారు? అని ఓ ఇంటర్వ్యూలో వర్మను అడిగారు. "రాఘవేంద్రరావుకు శ్రీదేవిలో ఓ నటి మాత్రమే కనిపిస్తుంది. అందుకే ఆయనకు కోపం వచ్చింది. కానీ ఆమె నాకో దేవత. భక్తుడేం చేస్తాడు? ఆరాధించడం తప్పించి" అని శ్రీదేవిపై తన ప్రేమను ఒక్క ముక్కలో తేల్చేశాడు వర్మ.

శ్రీదేవి నటించిన పదహారేళ్ల వయసు, వేటగాడు వంటి సినిమాలను స్కూల్, కాలేజీలకు డుమ్మా కొట్టి చూసి చూసి ఆమె అందానికి దాసోహమైన వర్మకు ఆమె ఓ దేవతైపోయింది. తొలిసారి శ్రీదేవి నివాసం చూసి ఆశ్చర్యపోయాడు వర్మ. బ్రహ్మ అత్యద్భుత మూడ్ లో ఉన్నప్పుడు అనుకోకుండా తయారైన దేవత శ్రీదేవి. అలాంటి అద్భుతం మళ్లీ జరగడం అసంభవమంటాడు వర్మ. అనటమే కాదు తన గోవిందా గోవిందా సినిమాలో అలాంటి ఓపాటను ప్రత్యేకంగా శ్రీదేవిపై చిత్రీకరించి తన అభిమానాన్ని చాటుకున్నాడు వర్మ.

ఇంతగా తాను ఆరాధించే శ్రీదేవిని బోనీకపూర్ పెళ్లి చేసుకున్నా అతడిపై ఏనాడూ ఈర్ష్య పడలేదు వర్మ. నమ్మలేకపోయాడు. ఎందుకంటే శ్రీదేవిని వర్మ కూడా పెళ్లి చేసుకోవాలనుకోలేదు. మామూలు మనుషులు ఆమెనెలా పెళ్లి చేసుకుంటారని ప్రశ్నిస్తాడు వర్మ. శ్రీదేవిని దగ్గరగా చూసే అవకాశం కోసమే క్షణం క్షణం సినిమా తీసిన వర్మ.. ఆ సినిమా శ్రీదేవికి తాను రాసిన ప్రేమలేఖ అని చెప్పాడు. కథానాయికలను అందంగా చూపించడంలో నిష్ణాతుడైన వర్మ.. క్షణ క్షణం సినిమాలో శ్రీదేవిని అత్యద్భుతంగా ఆవిష్కరించాడు. ఆ సినిమా షూటింగ్ ఆసాంతం శ్రీదేవిని చూస్తూనే ఉండిపోయిన వర్మ.. కొన్నిసమయాల్లో వెంకటేష్ ను గమనించలేకపోయాడు కూడా.

సాధారణ మనుషుల్లా శ్రీదేవి టీ, టిఫిన్లు అందించడం చూసి బోనీకపూర్ ను లాగి కొట్టాలనిపించిందంటాడు వర్మ. శ్రీదేవి చనిపోయిందంటే ఆమెకూ నిజంగా గుండె ఉంటుందా.. అది ఆగిపోతుందా.. ? అని ఆశ్చర్యపోయాడు వర్మ. శ్రీదేవిని తీసుకెళ్లిన దేవుడిపై వర్మ ఆగ్రహాన్ని కూడా ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశాడు. శ్రీదేవి మరణాన్ని అంగీకరించని వర్మ.. ఇక ఆమె గురించి ట్వీట్ చేయడం మానేస్తానని, తన జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఆమె బతికే ఉందనుకొని బతికేస్తానంటున్నాడు. విషాదాలను పట్టించుకోని వర్మకు శ్రీదేవి మరణం మాత్రం జీవితకాల విషాదం అనడంలో ఏ సందేహమూ లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories