అద్దెకు కాడెడ్లు..

అద్దెకు కాడెడ్లు..
x
Highlights

సైకిళ్లను అద్దెకిస్తున్నట్లే, ఇప్పుడు బాడుగ ఎడ్లు అంగట్లో దొరుకుతున్నాయి. వినడానికి వింతగా ఉన్నా ఓ సంతలో ఇదే తంతు కొనసాగుతోంది. నెలవారీగా అద్దెకు...

సైకిళ్లను అద్దెకిస్తున్నట్లే, ఇప్పుడు బాడుగ ఎడ్లు అంగట్లో దొరుకుతున్నాయి. వినడానికి వింతగా ఉన్నా ఓ సంతలో ఇదే తంతు కొనసాగుతోంది. నెలవారీగా అద్దెకు ఇస్తూ వ్యాపారులు ఎడ్లతో వ్యాపారం చేస్తుంటే ఎడ్లను ప్రాణంగా చూసే రైతులు అద్దెకు తీసుకెళ్లి వ్యవసాయం చేస్తున్నారు. అద్దె ఎడ్ల కోసం పోటీపడి రైతులు అడ్వాన్సులు చెల్లిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో అద్దెడ్ల వ్యవసాయంపై ప్రత్యేక కథనం.

ఒకప్పుడు పల్లెల్లో ఇంటికో జత ఎడ్లు ఉండేవి ప్రస్తుతం ఇంటికో ట్రాక్టర్ వచ్చింది. అయితే, ఎన్ని యంత్రాలు ఉన్నా పసుపు, మొక్కజొన్న, సోయా సాగుకు ఎడ్లు తప్పనిసరి కావడంతో బాడుగకు ఎడ్లను తీసుకెళ్తున్నారు. దాంతో నిజామాబాద్ జిల్లా బాల్కొండ అంగడి అద్దె ఎడ్లకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. నెల చొప్పున ఎడ్లను రైతులకు అద్దెకిచ్చి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు నెల చొప్పున అద్దెకు తీసుకుంటుంటే మరికొందరు వారం చొప్పున అద్దె చెల్లించి ఎడ్లను తీసుకెళ్తున్నారు. మార్కెట్లో ఎడ్ల ధర ఎంత పలుకుతుందో అంత నగదు అడ్వాన్సుగా చెల్లించి బసవన్నలను అద్దెకిస్తున్నారు.

వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగడంతో ఎడ్లు, నాగలి వాడే రైతుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మరోవైపు పశుగ్రాసం లేకపోవడం వల్ల ఎడ్ల పోషణ భారంగా మారి పశువులను అమ్ముకోవాల్సి వస్తోంది. అయితే, పసుపు సహా కొన్ని పంటల సాగుకు ఎడ్ల అవసరం తప్పనిసరి కావడంతో కాడెడ్లు లేని రైతులు వాటిని కిరాయికి తెచ్చుకుంటున్నారు. బాల్కొండ సంతలో అద్దె ఎడ్ల వ్యాపారం జోరుగా సాగుతుండటంతో నిజామాబాద్‌తోపాటు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల రైతులు బాడుగకు ఎడ్లను తీసుకెళ్తున్నారు. వ్యాపారి నుంచి అద్దె తీసుకున్న నాటి నుంచి వాటి మేత, నివాస ఖర్చులు రైతులే భరించాల్సి ఉంటుంది. విత్తనాలు వేసే సమయంలో నాగలి తప్పనిసరి కావడంతో కొన్నేళ్లుగా ఎడ్లను అద్దెకు తీసుకుని పనులు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు అన్నదాతలు. ఎడ్లను కొనే స్దోమత ఉన్నా వాటిని సాకే పరిస్ధితి లేక ఎక్కువ మంది రైతులు అద్దెకు ఎడ్లను తీసుకునేందుకే ఆసక్తి చూపుతున్నారు.

నెల రోజులపాటు ఒక రైతు ఇంట్లో సేవ చేసే ఎడ్లు మరో నెలలో ఇంకో రైతింటికి వెళ్తున్నాయి. జత ఎడ్లకు 50 నుంచి 70 వేలు అడ్వాన్స్ చెల్లిస్తేనే ఎడ్లను అద్దెకిస్తున్నారు. నెల పూర్తయ్యాక 20 నుంచి 30 వేలు కిరాయి తీసుకుని మిగతా మొత్తం రైతులకు తిరిగిస్తామని వ్యాపారులు చెబుతున్నారు. ఎడ్లకు ఏదైనా జరిగినా, మరణించినా అడ్వాన్స్‌ను తిరిగి ఇవ్వమంటూ ఒప్పందం కుదుర్చుకుంటారు. కర్ణుని చావుకు సవాలక్ష కారణాలన్నట్లుగా ఎడ్ల అద్దెకు రైతులు సవాలక్ష కారణాలు చెబుతున్నారు. పశుగ్రాసం కొరతతో ఎడ్లను అమ్ముకుంటున్న రైతులు అద్దెకు తెచ్చి తమ పనులు చేసుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories