వందశాతం వీవీప్యాట్లు లెక్కింపు: సుప్రీంలో చుక్కెదురు

వందశాతం వీవీప్యాట్లు లెక్కింపు: సుప్రీంలో చుక్కెదురు
x
Highlights

వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీం స్టాండ్ ఏంటో మరోసారి తేల్చిచెప్పింది. 100శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలన్న ప్రజాప్రయోజన వ్యాజ్యంపై...

వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీం స్టాండ్ ఏంటో మరోసారి తేల్చిచెప్పింది. 100శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలన్న ప్రజాప్రయోజన వ్యాజ్యంపై మండిపడ్డ అత్యున్నత న్యాయస్థానం పిటిషనర్లపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమన్న ద్విసభ్య ధర్మాసనం అసలు ఇది అర్ధంలేని పిటిషన్‌ అంటూ కొట్టివేసింది.

ఈవీఎంల్లో నమోదైన ఓట్లతో వీవీప్యాట్‌ స్లిప్పులు 100శాతం సరిపోయేలా కౌంటింగ్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇది అనవసర పిటిషన్ అంటూ మండిపడ్డ అత్యున్నత న్యాయస్థానం, అసలు ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించబోమని జస్టిస్‌ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం తేల్చిచెప్పింది.

చెన్నైకి చెందిన టెక్ ఫర్ ఆల్‌ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. వీవీప్యాట్‌ స్లిప్పుల కౌంటింగ్‌పై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని విస్తృత ధర్మాసనం ఇప్పటికే తీర్పు వెల్లడించిందని, మళ్లీ ఎందుకు ఇద్దరు న్యాయమూర్తుల వెకేషన్‌ బెంచ్‌ ముందుకు పిటిషన్‌ను తీసుకొచ్చారని మండిపడింది. సీజేఐ తీర్పును తాము అధిగమించలేమన్న ద్విసభ్య ధర్మాసనం ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకునే ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. అసలు ఇలాంటి అర్ధంలేని పిటిషన్‌ను విచారించబోమంటూ కొట్టేసింది.

కనీసం 50శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలంటూ ఇటీవల ప్రతిపక్షాలు చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అంతేకాదు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు వీవీప్యాట్లను లెక్కిస్తే సరిపోతుందంటూ విస్తృత ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను సమీక్షించాలంటూ విపక్షాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సైతం న్యాయస్థానం కొట్టివేసింది. ఇప్పుడు ఈవీఎంల్లో నమోదైన ఓట్లతో వీవీప్యాట్‌ స్లిప్పులు 100శాతం సరిపోయేలా కౌంటింగ్ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టేయడమే కాకుండా, అసలు ఈ పిల్‌ విచారణార్హం కాదంటూ పిటిషన్‌దారులపై ఆగ్రహం వ్యక్తంచేసింది. దాంతో వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీంకోర్టు స్టాండ్ ఏమిటో తేల్చిచెప్పినట్లయ్యింది.

Show Full Article
Print Article
Next Story
More Stories