కేవలం 20 సెకన్లు ఆలస్యమైతే...రాహుల్‌ విమానం గాల్లోనే పేలిపోయి ఉండేది

Submitted by arun on Sat, 09/01/2018 - 13:45
Rahul Gandhi

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పెద్ద గండం నుంచి తప్పించుకున్నారు. కేవలం ఇరవై అంటే 20 సెకన్ల తేడాతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏప్రిల్‌ 26న రాహుల్‌ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌‌పై డీజీసీఏ షాకింగ్‌ నిజాలు బయటపెట్టింది. మరో 20 సెకన్లు ఫ్లైట్‌ గాల్లో ఉంటే జరగరానిది జరిగేదంటూ సంచలన విషయాలు పెద్ద బాంబు పేల్చింది.

నిమిషం కాదు...అర నిమిషం కూడా కాదు...కేవలం ఇరవైంటే 20 సెకన్లు... ఆలస్యమైతే...ఎవ్వరూ ఊహించని ఘోరం జరిగి ఉండేది. ఎంతో ఘనచరిత్ర కలిగిన ఓ పార్టీ అధ్యక్షుడు, జాతీయ నాయకుడు, ప్రధాని అభ్యర్ధికి జరగరాని ప్రమాదం జరిగి ఉండేది అవును మీరు వింటున్నది నిజమే కేవలం 20 సెకన్లు ఆలస్యమైతే ఏఐసీసీ ప్రెసిడెంట్‌ రాహుల్‌ గాంధీ ప్రయాణిస్తున్న విమానం గాల్లోనే పేలిపోయి ఉండేదని, లేదా కుప్పకూలి పోయేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ డీజీసీఏ బాంబు పేల్చింది.

కర్నాటక శాసనసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ‎ఏప్రిల్ 26న రాహుల్‌ గాంధీ ఢిల్లీ నుంచి హుబ్లీకి ప్రత్యేక విమానంలో వచ్చారు. ఆరోజు హుబ్లీ ఎయిర్‌పోర్ట్‌లో రాహుల్‌ ప్రయాణిస్తున్న విమానం సాంకేతిక లోపంతో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. ఈ ఘటనపై అప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. దాంతో చిన్న సాంకేతిక సమస్య మాత్రమేనంటూ అప్పట్లో డీజీసీఏ వివరణ ఇచ్చింది. అయితే ఫ్లైట్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌‌పై అనుమానం వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఆనాడు కర్నాటక డీజీపీకి ఫిర్యాదుచేసింది. దాంతో హుబ్లీ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు రాహుల్‌ ప్రయాణించిన ఫ్లైట్‌ పైలెట్లు, సిబ్బందిని అదుపులోకి తీసుకొని వివరాలు సేకరించారు.

ఏప్రిల్‌ 26న ఉదయం 9:20కి ఢిల్లీ నుంచి హుబ్లీ బయల్దేరిన ప్రత్యేక విమానం 20 నిమిషాలపాటు జాడ తెలియకుండా పోయింది. షెడ్యూల్‌ కంటే ఆలస్యంగా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్‌ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే 10:45కి విమానం కుదుపులకు లోనైందని, ఎడమవైపునకు వంగిపోయి, కిందకి జారడం ప్రారంభించిందని, ఇందులో కుట్ర కోణం ఉందంటూ రాహుల్‌ సహాయకుడు కౌశల్‌ కర్నాటక డీజీపీకి కంప్లైంట్ చేశారు. దాంతో విమానం అత్యవసర ల్యాండింగ్‌‌పై సమగ్ర విచారణకు డీజీసీఏ ఓ త్రిసభ్య కమిటీని నియమించింది. 

దాదాపు 4నెలల గ్యాప్‌ తర్వాత డీజీసీఏ త్రిసభ్య కమిటీ సంచలన విషయాలను బయటపెట్టింది. ఆరోజు మరో 20 సెకన్లు విమానం గాల్లోనే ఉంటే కుప్పకూలిపోయి ఉండేదని కళ్లు బైర్లు కమ్మే షాకింగ్‌ నిజాలను వెల్లడించింది. ఆనాటి ఘటనపై మొత్తం 30 పేజీల నివేదికను సమర్పించిన డీజీసీఏ త్రిసభ్య కమిటీ ఇందులో కుట్ర కోణమేమీ లేదని తేల్చిచెప్పింది. అయితే విమానంలో సాంకేతిక లోపాలను పైలట్‌ ముందుగా గుర్తించలేదని, ఆటోపైలట్‌ మోడ్‌ పనిచేయడం లేదని తెలిసిన వెంటనే స్పందించలేదని తెలిపింది. ఇదంతా కేవలం పైలట్‌ నిర్లక్ష్యంగానే జరిగిందని నివేదిక ఇచ్చింది.  

ఆనాటి ఘటనపై డీజీసీఏ సమగ్ర కమిటీ సమగ్రంగా వివరణ ఇచ్చింది. ఆటో పైలెట్ సిస్టమ్‌లో సాంకేతిక లోపం తలెత్తిన 15 సెకన్ల తర్వాత, రెడ్ లైట్‌, ఆడియో అలర్ట్ రూపంలో చివరి హెచ్చరిక వచ్చిన తర్వాత పైలెట్లు గుర్తించారని తెలిపింది. ఒకవైపు ఒరిగి వేగంగా కిందకు దూసుకొస్తుండగా ప్రమాదాన్ని గుర్తించిన పైలట్లు వెంటనే లోపాన్ని సరిదిద్ది విమానాన్ని తిరిగి తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారని దాంతో పెను ముప్పు తప్పిందని నివేదికలో పేర్కొంది. ఆ 24 సెకన్లలోనే విమానం ఏకంగా 735 అడుగుల మేర కిందకు వచ్చిందని మరికొన్ని క్షణాలు ఆలస్యమయి ఉంటే విమానం కుప్పకూలిపోయేదని షాకింగ్‌ న్యూస్ బయటపెట్టింది.

మొత్తం మీద ఏప్రిల్‌ 26న రాహుల్‌గాంధీ పెద్ద గండం నుంచి తప్పించుకున్నారని డీజీసీఏ ఆలస్యంగా బయటపెట్టింది. కేవలం ఇరవై అంటే 20 సెకన్ల తేడాతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని తేలింది. అయితే ఒక జాతీయస్థాయి నాయకుడు, ప్రధాని అభ్యర్ధి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఉన్నట్లు ముందుగానే గుర్తించలేకపోవడం, ముందుజాగ్రత్తలు తీసుకోకపోవడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోజు రాహుల్‌గాంధీకి జరగరానిది ఏదైనా జరిగి ఉంటే పరిస్థితి ఏంటంటూ కాంగ్రెస్‌ నాయకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 

English Title
Rahul Gandhi's plane was just 20 seconds away from crashing: DGCA report

MORE FROM AUTHOR

RELATED ARTICLES