రోజా ఔట్‌.. దేశంలోనే కర్నూలుకు ప్రత్యేకం

రోజా ఔట్‌.. దేశంలోనే కర్నూలుకు ప్రత్యేకం
x
Highlights

రంజాన్.. ముస్లీంలు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండగ. నెల రోజుల పాటు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు అత్యంత భక్తిశ్రద్దలతో కఠిన ఉపవాస...

రంజాన్.. ముస్లీంలు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండగ. నెల రోజుల పాటు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు అత్యంత భక్తిశ్రద్దలతో కఠిన ఉపవాస దీక్షలను పాటిస్తారు. ఆచార సంప్రదాయాలకు పుట్టినిల్లుగా నిలిచిన కర్నూలు జిల్లాలో రంజాన్ మాసంలో ఓ ప్రత్యేక పద్దతిలో జరుపుకుంటారు. అనాదిగా వస్తున్న వింత ఆచార సంప్రదాయాన్ని నేటికి పాటిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని పురాతన విధానం ఆచార సంప్రదాయం ఏంటో ఇప్పుడు చూద్దాం.

రాయలసీమకు ముఖ ద్వారం కర్నూలు నగరం. ఏపీలోనే ముస్లిం జనాభాలో అగ్రస్థానంలో నిలిచిన కర్నూలు పాతబస్తీ హైదరాబాద్ పాతబస్తీని పోలి ఉంటుంది. రంజాన్ మాసాన్ని ఓ వింత ఆచార సంప్రదాయంతో జరుపుకుంటారు. ప్రతి రోజు దీక్ష ప్రారంభ సమయంలో దీక్ష విరమణ సమయాలు గుర్తు చేస్తూపూర్వం పలు మసీదుల్లో సైరన్ మోగిస్తుండటం ఫిరంగులు పేల్చే వారు కర్నూలులో మాత్రం ఔట్ పేలుస్తారు. కాలక్రమేణా అంతటా మార్పు వచ్చినా కర్నూలులో పురాతన సంప్రదాయాన్నే పాటిస్తున్నారు. కర్నూలులో దర్గా ఇమామే ఔట్ తయారు చేసి పేల్చుతారు.

కర్నూలులోని మాసుంబాష దర్గా ఇమాం ఖలీల్ అహ్మద్ కుటుంబం తాతల కాలం నుంచి రంజాన్ మాసంలో పేల్చే ఔట్ తయారు చేస్తుంటారు. మాములు రోజుల్లో ముత్యాలు పూసలు అమ్ముకుని జీవనం సాగించే ఖలీల్ అహ్మద్ రంజాన్ మాసంలో ఔట్ పేల్చే పనికే పరిమితం అవుతారు. అధికారుల అనుమతితో శివకాశి నుంచి మందుగుండు సామాగ్రి, ముడిసరుకులు తెచ్చుకుంటారు. రోజుకు రెండు చొప్పున ఔట్లు తయారు చేస్తుంటారు.

ఇమాం ఖలీల్ అహ్మద్ సొంతంగా తయారు చేసిన ఔట్లను రంజాన్ మాసంలో ఒకటి తెల్లవారు జామున.. మరొకటి సాయంత్రం పేలుస్తుంటారు. చుట్టూ పది కిలో మీటర్ల వరకు పెద్ద శబ్దం వస్తుంది. దూర ప్రాంతాల్లో పొలాల్లో ఉండే వారే కాదు.. షెడ్లలో.. వ్యాపార పనుల్లో తలమునకలై ఉండే వారికి నమాజ్ వేళలు తెలుస్తాయంటున్నారు ఖలీల్. ఔట్ పేల్చే విధానాన్ని స్థానికులు కొనసాగించాలనడంతో ఖలీల్ కుటుంబ సభ్యులు ఔట్ తయారు చేయడాన్ని ఓ థార్మిక బాధ్యతగా తీసుకున్నారు. ఔట్ పేలుడు శబ్దంతో ఒక్క పొద్దు విడిచి ఇప్తార్ పాటిస్తామంటున్నారు ముస్లిం సోదరులు. రెండు వందల ఏళ్లుగా వస్తున్న ఔట్ పేల్చే శబ్దంతోనే మసీదుల్లో ప్రార్థన సమయ పాలన పాటిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories