ఎక్కడి బాబా... ఇక్కడికెలా వచ్చాడు?

Submitted by santosh on Mon, 09/17/2018 - 13:47
prabhodananda swamy

జేసీ సోదరులు ... ప్రబోధానంద ఆశ్రమాన్ని ఎందుకు టార్గెట్ చేసుకున్నారు. చిన్న గొడవగా ప్రారంభమైన వివాదం రోజుల తరబడి ఎలా నడిచింది? జేసీ సోదరులు కావాలనే ఆశ్రమాన్ని ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణల వెనుక అసలు నిజమేంటి? స్వామి ప్రబోధానందస్వామి నాలుగు దశాబ్దాల క్రితం తాడిపత్రి పరిధిలోని చిన్నపొలమడ గ్రామంలో ఆశ్రమం ఏర్పాటు చేశారు. త్రైత్ర సిద్ధాంత భగవద్గీత పేరుతో పలు గంధ్రాలు రాసిన ఆయన ... కృష్ణుడి జీవన విధానంపై ప్రసంగాలు చేస్తూ ఉంటారు. ప్రభోదానంద స్వస్థలంపై స్పష్టమైన ఆధారాలు లేకపోయినా .. గతంలో ఇదే ప్రాంతాంలో ఉండేవారని .. జేసీ సోదరులతో  వివాదాలు రావడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లి ... తిరిగి వచ్చారనే ప్రచారం ఉంది. ఇరువురి మధ్య పాత తగాదాలు ఉన్నాయన్న విషయం స్ధానికులు చెప్పుకుంటున్నారు.

ఆరు నెలల క్రితం స్వామి ప్రబోధానంద కుమారుడు బీజేపీలో చేరారు. 2019 ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుంచే పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కమ్మ సామాజిక వర్గానికి ప్రబోధానందస్వామి ఇటీవల తాడిపత్రి మండలంలోని రావివెంకటాంపల్లి సమీపంలో కాకతీయ కమ్మసేవా సంఘం కల్యాణ మండపం నిర్మాణానికి ఆర్థిక సాయం చేశారు. భవన నిర్మాణ శంకుస్థానకు మాజీ డీజీపీ రాముడు సహా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నేతలతో పాటు జేసీ వ్యతిరేకిగా ముద్రపడిన అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి కూడా హాజరయ్యారు. దీంతో జేసీ సోదరులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు సమాచారం. 

ఇందులో భాగంగానే అదునుకోసం వేచిచూస్తున్న జేసీ.. తాజా వివాదాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని జేసీ అనుచరులు ఖండిస్తున్నారు. అన్నదమ్ముల్లా ఉన్న చిన్నపొలమడ, పెద్దపొలమాడ గ్రామాల ప్రజలను విడగొట్టి... ఆశ్రమం పేరుతో భూములు లాక్కునేందుకు ప్రయత్నించారంటూ ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో గ్రామస్తులకు తాము అండగా నిలవడం వల్లే దాడులు చేశారంటూ విమర్శిస్తున్నారు. జేసీ, ప్రబోధానందస్వామిల మధ్య వివాదం గత కొద్దికాలంగా రగులుతూనే ఉంది. ఆశ్రమాన్ని ఇసుక తీసుకెళుతున్నారంటూ గతంలో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఫిర్యాదు చేయగా .. కులం పేరుతో తమను దూషించారంటూ ఆశ్రమ నిర్వాహకులు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు . ఈ వ్యవహారంలో జేసీపై హోంమంత్రితో పాటు డీఐజీకి కూడా ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి నివురు గప్పిన నిప్పులా ఉన్న ఈ వ్యవహారం తాజా పరిణామాలతో ఒక్కసారిగా ఎగిసిపడింది.

English Title
prabhodananda swamy

MORE FROM AUTHOR

RELATED ARTICLES