పొన్నాలకే జనగామ టికెట్‌

పొన్నాలకే జనగామ టికెట్‌
x
Highlights

సస్పెన్స్ వీడింది. రాజీ కుదిరింది. జనగామ సీటుతో పాటు ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశంలో కాంగ్రెస్ , తెలంగాణ జనసమితి మధ్య తలెత్తిన తగవు సమసిసోయింది....

సస్పెన్స్ వీడింది. రాజీ కుదిరింది. జనగామ సీటుతో పాటు ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశంలో కాంగ్రెస్ , తెలంగాణ జనసమితి మధ్య తలెత్తిన తగవు సమసిసోయింది. కాంగ్రెస్ , తెలంగాణ జనసమితి నేతలు హైదరాబాద్‌లో అర్థరాత్రి సాగించిన చర్చలు విజయవంతమయ్యాయి. జనగామ సీటును పొన్నాలకే వదిలేయాలని కోదండరాం నిర్ణయించారు. అలాగే 12 స్థానాల్లో కాకుండా 8 చోట్లే టీజేఎస్ పోటీ చేయడానికి అంగీకరించారు. అలాగే అర్థరాత్రి సాగిన చర్చల్లో నాలుగు పార్టీల కూటమికి ఓ రూపు వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక కూటమికి ప్రజా కూటమిగా నామకరణం చేశారు. కూటమి కన్వీనర్‌గా కోదండరాంను నియమించారు. అంతేకాదు అధికారంలోకి రాగానే కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ కమిటీ ఏర్పాటు చేసి ఛైర్మన్‌‌గా కోదండరాంను నియమించాలని తీర్మానించారు.

కాంగ్రెస్, తెలంగాణ జనసమితి మధ్య ఎట్టకేలకు సీట్ల సర్దుబాటు చర్చలు ఫలించాయి. అర్థరాత్రి హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ జన సమితి కార్యాలయంలో రెండు విడతలుగా జరిగిన చర్చలు చివరికి విజయవంతమయ్యాయి. ముందుగా రాత్రి 11 గంటల సమయంలో జన సమితి పార్టీ కార్యాలయానికి వచ్చిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గంటకు పైగా కోదండరాంతో చర్చలు జరిపి వెళ్ళిపోయారు. కొద్దిసేపటి తర్వాత తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా, పీసీసీ మాజీ అధ్యక్షుడు, జనగామ సీటు ఆశిస్తున్న పొన్నాల లక్ష్యయ్య, ఉత్తమ్ వచ్చి కోదండరాంతో మరో విడత చర్చలు జరిపారు. దాదాపు నాలుగు గంటలపాటు టీకాంగ్రెస్ టీజేఎస్ అగ్ర నేతలు జరిపిన చర్చల ద్వారా రెండు పార్టీల మధ్య వివాద అంశాలను పరిష్కరించుకున్నారు.

కాంగ్రెస్ టీజేఎస్ మధ్య వివాదంగా మారిన జనగామ సీటుతో పాటు ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్న అంశాలపై కుంతియా, ఉత్తమ్, కోదండరాం చర్చలు జరిపారు. జనగామ సీటును ఒదులుకోవాలని కుంతియా కోదండరాంను కోరారు. కోదండరాం ఎన్నికల్లో పోటీ చేయకుండా కేవలం ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఈ ప్రతిపాదనకు అంగీకరించిన కోదండరాం జనగామ సీటును పొన్నాలకు ఇచ్చేందుకు అంగీరించారు. అలాగే టీజేఎస్ ఇంతకు ముందు ప్రకటించిన విధంగా 12 స్థానాల్లో కాకుండా 8 చోట్లే పోటీ చేసేలా ఒప్పించారు. కోదండరాం పెద్ద మనసుతో జనగామ సీటు వదులుకున్నారని కుంతియా అర్థరాత్రి భేటీ తర్వాత తెలిపారు. టీడీపీ 14 చోట్ల, సీపీఐ 3 స్థానాల్లో , టీజేఎస్ 8 చోట్ల పోటీ చేస్తాయని కుంతియా స్పష్టం చేశారు.

అంతేకాదు ప్రజా కూటమి కన్వీనర్‌ కోదడరాం వ్యవహరిస్తారని కుంతియా చెప్పారు. కూటమి పార్టీల్లో తలెత్తే సమస్యలను పరిష్కరించే బాధ్యత కోదండరాకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రజా కూటమి అధికారంలోకి వస్తే ఉమ్మడి అజెండా అమలు చేస్తామన్న కుంతియా ఇందుకోసం కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ కమిటీ ఛైర్మన్‌ గా కోదండరాం ఉంటారని చెప్పారు. కోదండరాంకు కేబినెట్ ర్యాంక్ ఉంటుందన్నారు. కూటమి నాలుగు పార్టీలు ఉమ్మడిగా ప్రచారం చేయాలని కూడా నేతలు తీర్మానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories