logo

రాజీనామాల రాజకీయంలో జగన్‌ అస్త్రం ఇదేనా?

రాజీనామాల రాజకీయంలో జగన్‌ అస్త్రం ఇదేనా?

హోదా రణ క్షేత్రం మరోసారి వేడెక్కింది.. హోదా సాధన కోసం రాజీనామాలు చేశామంటున్న వైసిపి ఇక ఉప ఎన్నికల్లో తేల్చుకుందామని సవాల్ విసిరి కాక రేపుతోంది. తమ రాజీనామాలు ఆమోదం పొందాయని..తుది ప్రకటన త్వరలోనే వెలువడుతుందని వైసిపి ఎంపీలు చెబుతున్నారు.స్పీకర్ సుమిత్రా మహాజన్ ఒకటికి రెండు సార్లు ఎంపీలతో మాట్లాడిన తర్వాత చివరకు వారి రాజీనామాలను ఆమోదించారన్నది వైసిపి ఎంపీల కథనం.

వాస్తవానికి వైసిపి ఎంపీల రాజీనామాల వెనుక పెద్ద కథే నడిచింది. ప్రత్యేక హోదాతోనే ఏపికి న్యాయం జరుగుతుందని మొదట్నుంచీ చెబుతూ వచ్చిన వైసిపి జనసేన చేసిన సవాల్ ను స్వీకరించి పార్లమెంటులో అవిశ్వాస తీర్మానానికి సిద్ధపడింది. అయిదుగురు వైసిపి ఎంపీలు పార్లమెంటులో మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధపడ్డారు. ఇతర పార్టీల నేతలను కలసి తమకు మద్దతు పలకాల్సిందిగా కోరారు.. మారుతున్న రాజకీయ పరిణామాలను గమనించిన టిడిపి కూడా హోదా రాగం అందుకుంది. మొదట వైసిపి కి మద్దతిస్తామని చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత మాట మార్చి తామే అవిశ్వాసం పెడతామన్నారు.. టిడిపి ఎంపీలు మరో అవిశ్వాస తీర్మానంతో ముందుకొచ్చారు. ఏపి రాజకీయ పార్టీలన్నీ అవిశ్వాస తీర్మానాలకు నోటీసులిస్తున్నా.. పార్లమెంటు సజావుగా సాగకపోవడంతో అవి చర్చకే రాలేదు.. పార్లమెంటు చివరి రోజైన ఏప్రిల్ ఆరున వైసిపి ఎంపీలు11వ సారి అవిశ్వాస తీర్మానానికి నోటీసులిచ్చారు.. సభ నిరవధిక వాయిదా పడటంతో వారు నేరుగా స్పీకర్ ఛాంబర్ కెళ్లి స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామాలిచ్చి ఆపై ఏపి భవన్ కి వచ్చి ఆమరణ దీక్షలో కూర్చున్నారు.. ఆ తర్వాత నెల్లాళ్లకు స్పీకర్ సుమిత్రా మహాజన్ వైసిపి ఎంపీలను పిలిచి రాజీనామాలపై వివరణ కోరారు..

హోదా సాధన కోసమే తాము రాజీనామాలిస్తున్నట్లు వాటిని అంగీకరించాల్సిందిగానూ స్పీకర్ ను కోరారు. అయితే ఎంపీలు భావోద్వేగంతో రాజీనామా చేస్తున్నారని అంటే ఒత్తిడికి తలొగ్గి నట్లేనని కాబట్టి మరోసారి ఆలోచించుకోవాలని స్పీకర్ కోరారు.. అయితే నాలుగు రోజుల విరామం తర్వాత మరోసారి నిన్న స్పీకర్ వారికి కబురు పెట్టారు. అయితే ఎంపీలతో చర్చించాక ఇష్టపూర్వకంగా రాజీనామా ఇస్తున్నట్లు రీ కన్ఫర్మేషన్ లేఖలు కోరారు..దాంతో ఎంపీలు రీ కన్ఫర్మేషన్ లేఖలిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వైసిపి ఎంపీల రాజీనామా ఆమోదించినా ఎన్నికలకు ఏడాదే సమయం ఉన్న కారణంగా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదని వైసిపిది కేవలం డ్రామాయేనని టిడిపి అంటోంది.

ఉప ఎన్నికలకు ఆస్కారం లేకుండా ప్లాన్ చేసుకుని రిజైన్ చేసినందుకు ధన్యవాదాలంటూ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సెటైర్ విసిరారు.ఇక బిజెపి, వైసిపి కలసి ఆడుతున్న నాటకంలో ఈ రాజీనామాలు ఓ భాగమంటోంది టిడిపి. మరోవైపు తమ రాజీనామాలను స్పీకర్ ఆమోదించడం ఇక లాంఛనమే అంటున్న వైసిపి.. ఫిరాయింపు ఎంపీలపైనా చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరినట్లు దానికి స్పీకర్ సరేనన్నట్లు వార్తలొస్తున్నాయి. వైసిపి ఎంపీలు కొత్తపల్లి గీత, బుట్టా రేణుక, ఎస్పీవై రెడ్డి టిడిపిలోకి ఫిరాయించారు.. ఇది పార్టీ ఫిరాయింపు చట్టం కిందకే వస్తుంది కాబట్టి వారిని సస్పెండ్ చేయాలంటూ వైసిపి గత కొంత కాలంగా వాదిస్తోంది. అయితే ఫిరాయింపు ఎంపీలపై 24 గంటల్లోగా చర్యలు తీసుకుంటానని స్పీకర్ తెలిపారు.. మొత్తం మీద హోదా పోరు మరోసారి వేడెక్కింది. వైసిపి ఎంపీలు తమ రాజీనామా లేఖలతో ప్రజా క్షేత్రంలోకి దిగి ఉద్యమంలో మరింత చురుగ్గా పాల్గొంటామంటోంది వైసిపి.. రాజ్యాంగ పరంగా అయితే ఆరునెలల లోపు ఖాళీలు ఏర్పడితే ఎన్నికలు జరపరు.. కానీ ఇప్పుడు ఏడాది సమయం ఉన్న కారణంగా ఎన్నికలు జరుపుతారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

రాజీనామాలు చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నామంటున్న జగన్ పార్టీ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రజల్లోకి వెడతామంటోంది. పార్లమెంటు సమావేశాలు వాయిదా పడిన దగ్గర నుంచి ఇటు టిడిపి, అటు వైసిపి హోదా పేరుతో ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ప్రజల మధ్యే ఉంటున్నాయి.. ఇప్పుడు ఎంపీ ల రాజీనామా అస్త్రాలతో జగన్ టీమ్ లో కాస్త జోష్ పెరుగుతోంది. మరి వైసిపి పెట్టే ఒత్తిడిని టిడిపి ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

లైవ్ టీవి

Share it
Top