పులి కోసం 45 నిమిషాల పోరాటం.. తీరా చూస్తే

పులి కోసం 45 నిమిషాల పోరాటం.. తీరా చూస్తే
x
Highlights

చుట్టు చిమ్మచీకటి...దూరంగా ఏదో జంతువు ఒంటిపై చారలు... అమ్మో పులి... ఆ సీన్ చూసిన వెంటనే పోలీసులకు పులి వచ్చింది రక్షించండి బాబోయ్ అంటూ ఫోన్ కాల్...

చుట్టు చిమ్మచీకటి...దూరంగా ఏదో జంతువు ఒంటిపై చారలు... అమ్మో పులి... ఆ సీన్ చూసిన వెంటనే పోలీసులకు పులి వచ్చింది రక్షించండి బాబోయ్ అంటూ ఫోన్ కాల్ వెళ్లింది. ఇక అప్పటి నుంచి మొదలైంది హడావిడి. పులిని పట్టుకునేందుకు ఆర్మీ, ప్రత్యేక అటవీ సిబ్బందితోపాటు స్థానికులు భారీగా తరలి వచ్చారు. ఆ చీకట్లో ఎప్పుడు పులి మీద పడుతుందో అనే టెన్షన్ లో జనం సుమారు 45 నిమిషాల పాటు ఆందోళన పడ్డారు. చివరకు అంతా తెగ నవ్వుకున్నారు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది?

స్కాట్లాండ్ ఈశాన్య ప్రాంతానికి చెందిన ఓ రైతుకు వ్యవసాయ క్షేత్రం ఉంది. గత శనివారం రాత్రి తన తోటలో ఉన్న ఆవులను ఓ సారి చూసొద్దామని బయలు దేరాడు. ఆవుల షెడ్‌కు సమీపంలో అతనికి పులి కనిపించింది. వెంటనే కంగారుగా పోలీసులకు ఫోన్ చేశాడు. హుటాహుటిన పోలీసులకు అక్కడకు చేరుకున్నారు. ఆ నోటా ఈ నోటా ఆవిషయం తెలిసి ఊరి జనం కూడా అక్కడికి క్యూ కట్టారు అంతటా ఒకటే ఉత్కంఠ.

దూరంగా పులి కనిపిస్తోంది. అటు వైపుగా తిరిగి పడుకొని ఉంది కానీ కదలడం లేదు. పోలీసులు నిజమైన పులి అవునో కాదో అని తెలుసుకునేందుకు ఫొటో తీసి తమ కంట్రోల్ రూమ్‌కు పంపించారు. అక్కడ ఉన్న నిపుణుడు అది కచ్చితంగా పులే అని నిర్ధారించాడు. అయితే ఆవును తినేసి భుక్తాయసంతో అది కదల్లేకపోతోందని అనుకున్నారు పోలీసులు. పులేనని కన్ఫామ్ కావడంతో అదనపు బలగాలతోపాటు ఆ పులిని పట్టుకునేందుకు వాహనాల్లో భారీ యంత్రాంగంతో కూడిన ప్రత్యేక బృందాలు, డాగ్ హ్యాండ్లర్, సిబ్బందిని వ్యవసాయం క్షేత్రానికి రప్పించారు.

పులిని పట్టుకునేందుకు సిబ్బంది ఆ ప్రయత్నాల్లో ఉంటే అక్కడికి వచ్చిన జనం ఆ పులి షెడ్‌లోని ఆవుని చంపి తిందా? దాని చెవులు చూసేందుకు వెరైటీ ఉన్నాయి. అది కదలకుండా స్థిరంగా ఎందుకు ఉందని జనం చెవులు కొరుక్కుంటున్నారు. అసలా పులి ఇక్కడికి ఎలా వచ్చింది. గతంలో ఎవరిమీదనైనా దాడి చేసిందా ఇలా రకరకాల వాదనలు అక్కడ వినిపిస్తున్నాయి. కనిపించేంత దూరంలోనే పులి ఉండటంతో అంతా ఎప్పుడు మీద పడుతుందోననే భయంలోనే దాని గురించి చర్చించుకుంటున్నారు.

అప్పుడు అక్కడ ఏదో అలికిడయ్యింది. వ్యవసాయ క్షేత్రం కావడంతో గాలి బాగా వీస్తోంది. చల్లగాలి వీస్తున్నా అక్కడి జనానికి మాత్రం చిరు చెమటలు పడుతున్నాయి. పులంటే భయపడుతూనే దాన్ని చూడాలనే ఆతృతతో అక్కడే దూరం నిలబడి చూస్తున్నారు. కొంతమంది సేఫ్ సైడ్ చెట్టేక్కి పులిని పట్టుకోవడం చూస్తున్నారు. నిమిష నిమిషానికి జనంపెరిగిపోతున్న వాళ్ల అలికిడి ఎక్కువైనా పులి మాత్రం అదరట్లేదు బెదరట్లేదు. అలాగే కదలకుండా ఉంది. అప్పుడే ఓ అధికారికి అనుమానం వచ్చింది. ఎలాగో ధైర్యం చేసి పులి దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశాడు. అధికారి అడుగుల చప్పుడైనా పులి మాత్రం కదల్లేదు. ఇక లాభం లేదనుకొని దగ్గరగా వెళ్లి చూశాడు అయినా కదల్లేదు. అప్పుడు అర్ధమైంది అసలు అది నిజం పులి కాదు. బొమ్మపులి అని. అంతే అక్కడున్న వాళ్లంతా ఒకరి ముఖం మరొకరు చూసుకొని నవ్వుకున్నారు. ఈ తతంగమంతా దాదాపు 45 నిమిషాల పాటు సాగింది. ఈ విషయాన్ని తాజాగా స్థానిక పోలీసులు సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories