అర్థాంగికి నయా నిర్వచనం

అర్థాంగికి నయా నిర్వచనం
x
Highlights

ప్రేమ అనేది ఎంతో స్వచ్ఛమైంది. అది తల్లి బిడ్డల మధ్య కావచ్చు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, భార్యభర్తలు, స్నేహితుల మధ్య కావచ్చు. అలాంటి ప్రేమ ఎంతో...

ప్రేమ అనేది ఎంతో స్వచ్ఛమైంది. అది తల్లి బిడ్డల మధ్య కావచ్చు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, భార్యభర్తలు, స్నేహితుల మధ్య కావచ్చు. అలాంటి ప్రేమ ఎంతో విలువైనది, మధురమైనది. ఈ ప్రపంచంలో ప్రేమను పొందలేని వారుంటారేమో గానీ, ఇవ్వలేని వారు మాత్రం ఉండరు. అలాంటి ప్రేమల్లో భార్యభర్తల మధ్య ఉంటే అనురాగం, ఆప్యాయత ఎంతో అద్భుతంగా ఉంటుంది. అది జీవితాంతం కొనసాగితే ఆ ఆనందమే వేరు. కానీ, వారిరువురూ దూరమైనప్పుడు ఆ బాధను తట్టుకోనూ లేరూ. అలానే ఓ 60 ఏళ్ల వృద్ధుడు తన భార్యపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు.

అర్ధాంగి అనే పదానికి సరైన నిర్వచనం చెప్పాడో 60 ఏళ్ల ముసలాయన. చిన్న చిన్న తప్పులకే భార్యను వదిలేయడం లేదంటే చంపడం వంటి అకృత్యాలకు పాల్పడుతున్న నేటి సమాజంలో భార్యపై ఉన్న ప్రేమను చంపుకోలేక భార్య చనిపోయిన తర్వాత కూడా నిలువెత్తు విగ్రహరూపంలో ఆమె రూపాన్ని ప్రతిష్టించి ప్రతిరోజు ఆమె విగ్రహం చెంతనే కాలం గడుపుతున్నాడు. భార్య బ్రతికున్నప్పుడు ఆమెకు చేదోడు వాదోడుగా ఎలా ఉన్నాడో ఆమె చనిపోయాక కూడ ఆమె విగ్రహం పక్కన తన విగ్రహం ప్రతిష్టించుకొని జీవనం సాగిస్తున్నాడు.

నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌ పల్లి మండలం నర్సాపూర్‌ గ్రామానికి చెందిన పడాల గంగాధర్ కిరణా షాపుపెట్టుకుని బతుకు బండిలాగిస్తున్నాడు. ప్రమాదవశాత్తు మరణించిన భార్య చంద్రబాగు జ్ఞాపకాలను మరువలేకపోయాడు. దీంతో ఆమెపై ఉన్న ప్రేమతో తన పొలంలో ఆమె నిలువెత్తు విగ్రహాన్ని నిర్మించుకున్నాడు. పెళ్లైన నాటి నుంచి ఏరోజూ గొడవ పడకుండా ఒకరినొకరు అర్ధం చేసుకుంటూ అన్యోన్యంగా బతికారు ఆ దంపతులు. ప్రతి రోజూ ఆ విగ్రహంలో తన భార్య రూపాన్ని చూసుకుంటూ కాలం గడుపుతున్నారు గంగాధర్‌. అంతటితో ఆగకుండా తాను బతికుండగానే తన భార్య విగ్రహం పక్కన తన విగ్రహాన్నికూడ ప్రతిష్టించుకుని తన భార్యతో తనకున్నఅనుబంధాన్ని పదిమందికీ చాటిచెబుతున్నాడు.

ప్రేమించి పెళ్లి చేసుకుని దూరమవుతోన్న ఈరోజుల్లో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడని స్ధానికులు, బంధువులు చెప్పుకుంటున్నారు. ప్రేమకు వయసుతో పరిమితం లేదని ఇయనను చూస్తే అర్థమవుతోందంటున్నారు. భార్యపై ప్రేమతో ఆమె మరణించాక దేవాలయం నిర్మించి ఆమెను ఓ దేవతగా శిలావిగ్రహం పెట్టి పూజిస్తున్న భర్త మహనీయుడంటున్నారు గ్రామస్తులు. జీవితాంతం కలిసిమెలిసి ఉండాలన్న పెళ్లినాటి ప్రమాణాన్ని గుర్తు చేసుకుంటున్న ఆయన చిన్న చిన్న గొడవలకే కాపురాలను నాశనం చేసుకుంటున్న యువతకు రోల్‌మోడల్‌ అంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories