వైసీపీ ఉచ్చులో పడొద్దని చంద్రబాబుకు ఆనాడే చెప్పా : మోడీ

Submitted by arun on Sat, 07/21/2018 - 10:38
modi

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విషయంలో వెనక్కితగ్గే ప్రసక్తే లేదన్నారు మోడీ. టీడీపీ అవిశ్వాస తీర్మానంపై సుదీర్ఘ వివరణ ఇచ్చిన నరేంద్రమోడీ ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై మళ్లీ పాత పాటే పాడారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబే యూటర్న్‌ తీసుకున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై గంటన్నరపాటు సమాధానమిచ్చిన ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆనాడు ఆంధ్రప్రదేశ్‌‌ను అడ్డదిడ్డంగా విభజించారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీయే మంచిదని ఏపీ ప్రభుత్వం ఒప్పుకున్న తర్వాతే 2016 సెప్టెంబర్‌లో ప్రకటన చేశామన్నారు మోడీ. అంతేకాదు ప్యాకేజీ బాగుందంటూ చంద్రబాబు తనకు స్వయంగా ధన్యవాదాలు చెప్పారని గుర్తుచేశారు. అయితే హోదా కంటే ప్యాకేజీయే బాగుందన్న చంద్రబాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఆ తర్వాత యూటర్న్‌ తీసుకున్నారంటూ మోడీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికి వచ్చాక చంద్రబాబుకి తానే స్వయంగా ఫోన్ చేశానన్న మోడీ వైసీపీ ఉచ్చులో పడొద్దని ఆనాడే చెప్పానన్నారు. ఏదిఏమైనా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చిచెప్పిన మోడీ ఏపీ అభివృద్ధే దేశాభివృద్ధి అంటూ ఆంధ్రులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దాదాపు గంటన్నరపాటు సాగిన మోడీ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి కొత్త హామీ ఇవ్వలేదు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో మళ్లీ పాత పాటే పాడారు.
 

English Title
PM Modi Assures Development To People Of Andhra Pradesh

MORE FROM AUTHOR

RELATED ARTICLES