పర్సులో పెట్రో మంట... జీఎస్టీలో చేర్చంది ఇందుకే!!

పర్సులో పెట్రో మంట... జీఎస్టీలో చేర్చంది ఇందుకే!!
x
Highlights

దేశంలో పెట్రో ఉత్పత్తుల రేట్లు ముందెన్నడూ లేనంతగా వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. వాటి వాస్తవ రేటుకు సమానంగా ప్రజలు పన్నులు చెల్లించాల్సి...

దేశంలో పెట్రో ఉత్పత్తుల రేట్లు ముందెన్నడూ లేనంతగా వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. వాటి వాస్తవ రేటుకు సమానంగా ప్రజలు పన్నులు చెల్లించాల్సి వస్తోంది. లీటర్ పెట్రోలు లేదా డీజిల్ వాస్తవ రేటు 40 రూపాయల లోపుగా ఉంటే మరో 40 రూపాయలు పన్ను రూపంలో చెల్లించాల్సి వస్తోంది. ఈ పన్ను లోనూ ఎన్నో మతలబులు. ఎక్కడ చూసినా వినియోగదారులను దగా చేయడమే కనిపిస్తోంది. ఒకే దేశం...ఒకే పన్ను అంటూ జీఎస్టీని అమల్లోకి తెచ్చిన కేంద్రప్రభుత్వం పెట్రో ఉత్పత్తులను మాత్రం ఎందుకు జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం లేదు

అనగనగా ఒక రాజు.... ఆ రాజుకు ఏడుగురు కొడుకులు... ఏడుగురు కొడుకులు వేటకు వెళ్ళారు...ఈ కథ అందరికీ తెలిసిందే. ఒక చేప ఎందుకు ఎండలేదో తెలుసుకునేందుకు కథలో ఎక్కడెక్కడికో వెళ్ళాల్సి వస్తుంది. పెట్రో ఉత్పత్తుల రేట్లు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసుకోవాలంటే కూడా అలా శ్రమపడాల్సిందే. పెట్రో ఉత్పత్తుల రేట్లు ఎందుకు పెరుగుతున్నాయో, ఎలా పెరుగుతున్నాయో ఇప్పుడు చూద్దాం. పెట్రో ఉత్పత్తుల రేట్లను రోజువారీగా సవరించే విధానం అమల్లోకి వచ్చిన తరువాత ముందెన్నడూ లేనంతగా పెట్రో ఉత్పత్తుల రేట్లు పెరిగాయి. ఇందుకు ఒక కారణం అంతర్జాతీయంగా ముడిచమురు రేట్లు పెరగడం ఒక కారణమైతే, వీటిని జీఎస్టీ నుంచి మినహాయించడం మరో కారణం. మధ్యలో మరెన్నో కారణాలున్నాయి.

గత పదిహేను నెలలుగా పెట్రో ఉత్పత్తుల రేట్లు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇందుకు ప్రధాన కారణం ముడి చమురు బారెల్ ధర 45 డాలర్ల నుంచి 71 డాలర్లకు పెరగడం. మరో వైపున పెట్రోల్, డీజిల్ పై పెట్రోల్ బంక్ ల కమిషన్ ను లీటర్ కు 1 రూపాయి వరకు పెంచారు. ఇక మూడో ప్రధాన కారణం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, రిఫైనరీలు తమ లాభాల మార్జిన్లను పెంచుకోవడం. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే...2018 తరువాత కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీని మొదట లీటర్ కు 2 రూపాయల చొప్పున, ఆ తరువాత లీటర్ కు 6 రూపాయల చొప్పున తగ్గించింది. మరి ఆ మేరకు ధరలు తగ్గాలి కదా....ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. తగ్గించిన ఎక్సయిజ్ సుంకం గురించి గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం ఆ తరువాత సైలెంట్ గా రోడ్ సెస్సు ను లీటర్ కు 8 రూపాయలు పెంచింది. ఆ విషయం మాత్రం పెద్దగా వెలుగులోకి రాకుండా చూసింది. దీంతో అసలేం జరిగిందో వినియోగదారులకు అర్థం కాలేదు. పెట్రోలు, డీజిల్ రేట్లు మాత్రం తగ్గలేదు. నిజానికి అసలు కథ ఇది కాదు... పెట్రోల్, డీజిల్ రేట్లు ఎందుకు తగ్గడం లేదో తెలుసుకోవాలంటే వాటిపై ఎన్ని రకాల పన్నులను ఎన్ని విధాలుగా విధిస్తున్నారో తెలుసుకోవాలి.

అంతర్జాతీయంగా ముడి చమురు ధర బారెల్ కు 71 డాలర్లుగా ఉంది. మరో వైపున రూపాయి మారకపు విలువ ఇటీవలి కాలంలో పటిష్ఠంగానే ఉంది. చమురును దిగుమతి చేసుకోవాలంటే బారెల్ వ్యయంతో పాటుగా 1.5 డాలర్లు ఓషియన్ ఫ్రైట్ గా చెల్లించాలి. అంటే దిగుమతి వ్యయం 72.5 డాలర్లకు చేరుకుంది. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ సుమారుగా 67.98 అనుకుంటే బారెల్ విలువ 4,930 రూపాయలు అవుతుంది. ఒక బారెల్ ముడిచమురు అంటే 159 లీటర్ల ముడిచమురు. మన లెక్కలో చూస్తే ఒక లీటరు ముడిచమురు ధర సుమారుగా 31 రూపాయలు అవుతుంది. ఇక ఇక్కడి నుంచి బేసిక్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల మాయాజాలం మొదలవుతుంది. అదెలానో చూద్దాం. పెట్రల్ కు, డీజిల్ కు ఈ లెక్కలు వేర్వేరుగా ఉంటాయి. ముందుగా పెట్రల్ లెక్క చూద్దాం. ఎంట్రీ టాక్స్, రిఫైనరీ ప్రాసెసింగ్, ల్యాండింగ్ కాస్ట్, ఇతర నిర్వహణ వ్యయాలు, లాభం అన్నీ కలసి లీటర్ కు 2 రూపాయల 62 పైసలు. ఇక ఓఎంసీ మార్జిన్, రవాణ, ఫ్రైట్ వ్యయం అన్నీ కలపి మరో 3 రూపాయల 31 పైసలు అవుతాయి. మొత్తం మీద రిఫైన్ చేసిన తరువాత పెట్రోలు ధర లీటర్ కు 36 రూపాయల 93 పైసలకు చేరుకుంటుంది. ఇదే తరహాలో డీజిల్ ధర లీటర్ కు 39 రూపాయల 78 పైసలు అవుతుంది. ఇప్పుడు వీటికి కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే ఎక్సయిజ్ డ్యూటీ, రోడ్ సెస్ కలపాలి. ఈ రూపంలో కేంద్ర ప్రభుత్వం వేసే భారం పెట్రోల్ పై లీటర్ కు19 రూపాయల48 పైసలుగా, డీజిల్ పై లీటర్ కు15 రూపాయల 33 పైసలుగా ఉంటుంది. అంటే కేంద్రప్రభుత్వం విధించే పన్ను భారం తొలగిస్తే వినియోగదారుడికి పెట్రోల్ పై లీటర్ కు 20 రూపాయల మేర ధర తగ్గుతుంది. అదే డీజిల్ పై లీటర్ కు 15 రూపాయల పైబడి ధర తగ్గుతుంది. కథ ఇక్కడితో ముగిసిపోలేదు. ఇంకా మరెంతో ఉంది. అది డీలర్ దగ్గరి నుంచి మొదలవుతుంది.

మార్కెటింగ్ కంపెనీలు వ్యాట్ కు ముందు డీలర్ కు లీటర్ పెట్రోల్ ను 56 రూపాయల 41 పైసలకు, లీటర్ డీజిల్ ను 55 రూపాయల 11 పైసలకు విక్రయిస్తాయి. ఇక డీలర్ వద్దకు వచ్చేసరికి వీటి అమ్మకం రేట్లు ఎలా పెరిగిపోతాయో చూద్దాం. డీలర్లకు పెట్రోల్ కు లీటర్ కు 3 రూపాయల 62 పైసలు, డీజిల్ కు లీటర్ కు 2 రూపాయల 52 పైసలు కమిషన్ గా చెల్లిస్తారు. అంటే వ్యాట్ కు ముందు పెట్రల్ ధర లీటర్ కు 60 రూపాయల 23 పైసలు, డీజిల్ ధర లీటర్ కు 57 రూపాయల 63 పైసలకు చేరుకుంది. ఇక వ్యాట్ ఎలా లెక్కిస్తారో చూద్దాం. వ్యాట్ అనేది ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుంది. ఢిల్లీని ఉదాహరణగా తీసుకుంటే అది పెట్రోల్ పై వ్యాట్ 27 శాతంగా ఉంది. డీజిల్ పై అది లీటర్ కు 16.75 శాతంగా ఉంది. ఇది గాకుండా పొల్యూషన్ సెస్, దానిపై సర్ చార్జ్ కూడా అదనంగా ఉంటాయి. ఈ విధంగా వ్యాట్ తదితరాలు లీటర్ పెట్రోల్ పై 16 రూపాయల 21 పైసలు, లీటర్ డీజిల్ పై 9 రూపాయల 91 పైసలుగా ఉంది. ఈ లెక్కలన్నీ ఢిల్లీకి సంబంధించినవి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో అయితే వ్యాట్ తదితరాలు పెట్రోల్ పై 35 శాతంగా ఉన్నాయి. డీజిల్ పై సుమారుగా 28 శాతం దాకా ఉన్నాయి అంటే లీటర్ పెట్రోల్ పై సుమారుగా 21 రూపాయలు. లీటర్ డీజిల్ పై సుమారుగా 15 రూపాయల దాకా ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు తలుచుకుంటే ...పన్ను భారాన్ని తొలగిస్తే..... లీటరు పెట్రోలు రేటును 21 రూపాయలు, డీజిల్ రేటును 15 రూపాయల దాకా తగ్గించవచ్చు.

ఇక్కడ గమనించాల్సిన అతి ముఖ్యమైన అంశం మరొకటి ఉంది. మీరు లీటర్ పెట్రోలు పోయించుకుంటే....నిజంగా అందులో పెట్రోలే ఒక లీటరు ఉండదు. పది శాతం దాకా ఇథనాల్ కలసి ఉంటుంది. అంటే మీరు పోయించుకుంటున్న పది శాతం ఇథనాల్ కు కూడా మీరు పెట్రోలు రేటునే చెల్లిస్తున్నారన్న మాట. మరి కనీసం ఆ పదిశాతం ఇథనాల్ కు సంబంధించి అయిన అసలు రేటు వసూలు చేసుకుంటూ రాయితీ ఎందుకు ఇవ్వడం లేదు ? పెట్రోలు తో పోలిస్తే ఇథనాల్ రేటు తక్కువ. ఇథనాల్ అనేది చెరకు నుంచి తయారు చేసే ఒక సహజ ఇంధనం. ఇథనాల్ రేటు లీటర్ కు 40 రూపాయల 85 పైసలు. ఇక్కడ కూడా ఎంతో తిరకాసు ఉంది. మనం కారులో 30 లీటర్ల పెట్రోలు పోయించుకుంటే అందులో నిజమైన పెట్రోలు 27 లీటర్లే. మిగిలిన మూడు లీటర్లు ఇథనాల్. కానీ మనం మాత్రం 30 లీటర్ల పెట్రోలు ధర చెల్లిస్తాం. ఇలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, కేంద్రం, రాష్ట్రం, డీలర్.....ఇన్ని దశల్లో రకరకాల లెక్కలతో పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచుతూ పోతున్నారు. అందుకే నేడు పెట్రోలు ధర లీటర్ కు 81 రూపాయల పైబడి ఉంది. అదే విధంగా డీజిల్ ధర 74 రూపాయలకు పైబడి ఉంది. ఈ కథ ఇక్కడితో ఆగలేదు. మరింకెంతో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories