logo

తుపాన్ల వేగాన్ని లెక్కలు కట్టే ప్రమాణం ఏంటి?

తుపాన్ల వేగాన్ని లెక్కలు కట్టే ప్రమాణం ఏంటి?

సాధారణంగా సముద్రంలో 60 మీటర్ల లోతువరకు 26 డిగ్రీల సెంటీగ్రేడ్‌ని మించిన ఉష్ణోగ్రత నమోదవుతుంది. అప్పుడు తీవ్రస్థాయి భాష్పీభవనం జరిగి ఒక అల్పపీడన కేంద్రకం ఏర్పడుతుంది. దీనిచుట్టూ తేమతో కూడిన గాలులు బలంగా వీస్తాయి. క్రమంగా అది వాయుగుండంగా మారినప్పుడు గాలుల వేగం పెరుగుతుంది. ఇది చెల్లాచెదురుగా ఉన్న వర్ష మేఘాలను ఆకర్షించి దగ్గరకు లాక్కుంటుంది. అల్పపీడన కేంద్రకంలో పీడనం క్షణక్షణానికి పడిపోతూ తుపాను తీవ్రత ఎక్కువైపోతుంది. ఇలాంటి తుపాను తీరం దాటే సమయంలో సముద్రపు నీరు ఒక్కసారిగా భూమ్మీదకు వచ్చేస్తుంది. దీన్నే ఉప్పెన అంటారు. తుపాన్ల వల్ల గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయి. 24 గంటల వ్యవధిలో 50 సెంటీమీటర్ల వరకు కుంభవృష్టి కురుస్తుంది. ఏడు మీటర్ల ఎత్తును మించి భూమ్మీదకు అలలు విరుచుకుపడతాయి.

వాస్తవానికి గాలుల వేగం ఆధారంగా తుపాన్ల తీవ్రతను అంచనా వేస్తారు. గాలుల వేగం గంటకు 31 కిలోమీటర్ల కంటే తక్కువగా ఉంటే దాన్ని అల్పపీడనమని, 31-49 కిలోమీటర్లు ఉంటే అది వాయుగుండమని, గాలుల వేగం గంటకు 49-61 కిలోమీటర్లకు పెరిగితే అది తీవ్ర వాయుగుండమని పిలుస్తారు. అదే తీవ్రత 61-88 కిలోమీటర్లకు పెరిగితే అది తుపాను మారుతుంది. ఒకవేళ గాలుల తీవ్రత గంటకు 88-117 కిలోమీటర్లుగా ఉంటే అది పెను తుపానుగా రూపాంతరం చెందుతుంది. 117-220 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తుంటే అది తీవ్ర పెను తుపాన్‌గా, గంటకు 221 కిలోమీటర్ల వేగంతో బలాతి బలమైన గాలులు విరుచకుపడుతుంటే అది సూపర్‌సైక్లోన్‌గా పిలుస్తారు.

తుపాన్లు, వరదలు, కరవు తాకిడికి ఏపీ అల్లాడిపోవడం మాములే. 37 ఏళ్లలో సుమారు 60 ప్రకృతి బీభత్సాలు అతలాకుతలం చేశాయి. ప్రతీ మూడేళ్లకోసారి భారీ తుపాను ఆంధ్రను అల్లాడించేస్తుంది. విపత్తుల రూపంలో విపత్కర పరిణామాలు సామాజిక, ఆర్థిక స్థితిగతులను తలకిందులు చేస్తున్నాయి. ఈ లోటును పూడ్చడానికి పాలనా యంత్రాగంపై అదనపు భారం పడుతోంది.

santosh

santosh

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top