logo

నిజమవుతున్న ఐన్‌స్టీన్‌ మాటలు

నిజమవుతున్న ఐన్‌స్టీన్‌ మాటలు

అరచేతిలో అద్భుతం. అదో ప్రపంచం. ఎక్కడెక్కడో ఉన్న వారిని కలుపుతుంది. క్షణాల్లో వారి యోగక్షేమాలను తెలుసుకుంటుంది. ఉదయాన్నే గుడ్‌ మార్నింగ్‌ అంటూ విష్‌ చేయడం, రాత్రి పడుకునేటప్పుడు గుడ్‌నైట్‌ తప్పనిసరిగా చెప్పడం, బర్త్‌డేలు, మ్యారేజెస్‌, చిన్ని చిన్న ఫంక్షన్లు ఏవైనా అంతా నవ్వుతూ పలకరిస్తారు. కానీ ఇదంతా డైరెక్ట్‌గా అనుకుంటే పొరపాటే. ఓన్లీ సోషల్‌ మీడియా ద్వారా మాత్రమే ఈ ఉభయకుశలోపరి. అదే మనిషి ఎదురు పడితే మాటల్లేవ్‌ మాట్లాడుకోవడాల్లేవ్‌. ప్రపంచాన్ని కనెక్ట్ చేస్తూ‌ మనుషుల మనసులో చోటు కట్‌ చేస్తున్న సామాజిక మాధ్యమాలపై హెచ్‌ఎంటీవీ స్పెషల్‌ ఫోకస్‌.

సోషల్‌ మీడియా. మనసులోని భావాలని, కష్టాలని, ఇష్టాలని ఇలా... ఎలాంటి ఫీలింగ్‌నైనా షేర్‌ చేసుకోవచ్చు. హాయిగా నచ్చిన వాళ్లతో ఇష్టమైనంత సేపు మాట్లాడుకోవచ్చు. మరి ఆ షేరింగ్‌లో కేరింగ్‌ ఉంటుందా..? ఆ మాటల్లో ఆప్యాయత, అనురాగం ఉంటాయా..? సామాజిక మాధ్యమాల్లో మాట్లాడినంతగా, అదే మనిషి ఎదురుపడితే మాట్లాడగలుగుతున్నారా..?

మాయమవుతున్న మాటల మాధుర్యం. మనిషిని మనిషిని కలిపేది స్వచ్ఛమైన మాట, మనసుని మనసుని కలిపేది చిన్న చిరునవ్వు, పలకరింపు. ఇవన్నీ నేటి టెక్నాలజీ యుగంలో సోషల్‌ మీడియాలో తప్ప ప్రత్యక్ష్యంగా కనిపించడం లేదు. టెక్నాలజీ పుణ్యమా అంటూ అందరి మధ్య కమ్యూనికేషన్‌ పెరిగింది కానీ ఇదంతా వాట్సప్‌, మెసెంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో మాత్రమే కనిపిస్తుంది. అదే మనిషి ఎదురుపడితే మాత్రం ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఫలితంగా మనుషుల మధ్య మాటలు లేకుండా పోయే వచ్చింది. ఇది ఇప్పుటి నిపుణులు, మేధావులు, పెద్దలు చెప్తున్న మాటలు కాదు వందేళ్ల క్రితం ఐన్‌స్టీన్‌ చెప్పిన మాటలు నేడు నిజమవుతున్నాయి. మనల్ని సోషల్‌ మీడియా మాత్రమే కలుపుతుందని, మన సందేశాలను, అభిప్రాయాలను షేర్‌ చేసుకుంటున్నాం. దీంతో షేరింగ్‌ తప్ప కేరింగ్‌ లేదన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

ఇటీవల కాలంలో యువతలో ఎక్కువగా ఈ ధోరణి కనిపిస్తుంది. ఎక్కడైనా గెట్‌టుగెదర్‌ పేరుతో కలిసినా, లేదా ఏదైనా వేడుకల్లో కలిసినా అన్నీ పైపైన పలకరింపులే. అప్పటి వరకు ఫేస్‌బుక్‌లోనో, వాట్సాప్‌ లోనో బంధువులతో, స్నేహితులతో చకచకా మట్లాడుతాం. పొద్దున నిద్ర లేచిన సమయం దగ్గర నుంచి గుడ్‌ మార్నింగ్‌ విషెస్‌లతో మొదలు, రాత్రి నిద్రపోయే వరకు గుడ్‌నైట్‌లతో గ్యాప్‌ లేకుండా మాట్లాడుతూనే ఉంటారు. అదే మనం తరచూ సోషల్‌ మీడియాలో మాట్లాడుతున్న వాళ్లు ఫంక్షన్స్‌లో ఎదురైతే ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి.

అరచేతిలో ప్రపంచ అద్భుతాలన్నీ కనిపిస్తున్న తర్వాత హలో అనడం తప్ప, నోటి నుంచి ఒక్క మాటా పెగలడం లేదు. ఎదుటి వాళ్ల కళ్లలోకి చూస్తూ, ఓపిగ్గా పెద్దలు చెప్పేది వినే ఓపిక, బదులిచ్చే తీరిక అస్సలు లేనే లేదు. యువతలో ఓవైపు టెక్నికల్ స్కిల్స్‌ పెరుగుతుంటే, మరోవైపు సోషల్ స్కిల్స్‌ మాయమవుతున్నాయి. సామాజిక మాధ్యమాలకిచ్చే ప్రాధాన్యత సగటు మనిషికివ్వడం లేదున్నది జగమెరిగిన సత్యం.

సామాజిక మాధ్యమాలు చివరికి పచ్చటి కుటుంబంలో చిచ్చు పెడుతున్నాయనే చెప్పవచ్చు. పిల్లలతో సరదాగా ఆడిపాడాల్సిన పెద్దలు సోషల్‌ మీడియా బారిన పడుతున్నారు. ఇక పిల్లల సంగతి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వాళ్లు ఇంట్లో పెద్దలను ఫాలో అవుతున్నారు. ఇలా చివరికి ఇంట్లో డైనింగ్ టేబుల్‌ వద్దకు సామాజిక మాధ్యమం చొరబడిపోయింది. ము‌ఖ్యంగా 13 ఏళ్ల నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న యువతలో 90 శాతం మంది ఏదో ఒక సామాజిక మాధ్యమాన్ని ఉపయోగిస్తున్నారని ఇటీవల ఓ సంస్థ జరిపిన సర్వేలో తేలింది.

వందేళ్ల కిందట ఐన్‌స్టీన్‌ చెప్పింది... ఇప్పుడు పెద్దలు చెబుతున్నదీ ఒక్కటే... మాటల్లేవ్‌... మాట్లాడుకోవడాల్లేవ్‌! అంతా స్మార్ట్‌ ఫోన్‌తోనే. ఇలా వచ్చింది అలా షేర్‌ చేసేయడమే. పది మంది ఓ చోట కలిసినా... జస్ట్‌ హాయ్‌, హలో మాత్రమే చెప్పుకుంటున్నారు. ఆ తర్వాత అరచేతిలో ఫోన్‌లో లీనమై ఎవరికి వాళ్లు, బిజీబిజీ.

బంధాల్ని కలపాల్సిన సామాజిక మాధ్యమాలు రాబంధుల్లా దాపురించాయా..? పచ్చని కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయా..? ఆత్మీయ పలకరింపుని చెరిపేసి, భావోద్వేగాలను చంపేస్తున్నాయా..? సామాజిక మాధ్యమం ఊబిలో కూరుకుపోతూ సామాజిక విలువలని మర్చిపోతున్నారా..? అసలు మనిషి మనిషి మధ్య, మనసు మధ్య సోషల్‌ మీడియా ప్రభావం ఎంతుంది..?

గతంలో ఏ ఇద్దరు స్నేహితులు, బంధువులు కలిసినా ప్రేమగా మాట్లాడుకునేవారు. ఆ పలకరింపులో గాఢత ఉండేది. వేడుకల్లో, పార్టీల్లో ఏ నలుగురు కలిసినా సరదా కబుర్లతో సందడి నెలకొనేది. ఇప్పుడు అందంతా లేదా? అంటే ఉంది. కానీ... ‘అంత’ లేదు. మాటల తుళ్లింత కాసేపే, కాస్త గ్యాప్‌ దొరికితే చాలు ఆ ఖాళీని స్మార్ట్‌ఫోన్‌ ఆక్రమిస్తుంది. వేడుకలు, ఇతరత్రా కార్యకలాపాల్లో గమనిస్తే చాలామంది పరిస్థితి ఇదే. విచిత్రమేమిటంటే కొందరు వయసు పైబడిన వారిది కూడా అదే దారి. అదేమంటే పిల్లలు విదేశాల్లో స్థిరపడటంతో తల్లిదండ్రులు కూడా స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించడం నేర్చేసుకుంటున్నారు. ఒకరి నుంచి మరొకరికి సామాజిక మాధ్యమాల వినియోగం కార్చిచ్చులా విస్తరిస్తోంది. వీటిద్వారా ప్రపంచంతో ‘కనెక్ట్‌’ అవుతున్నారు కానీ మనసులో కట్‌ అవుతున్నారు.

సంభాషణలో అద్భుతమైన కెమిస్ట్రీ ఉంటుంది. మధుర సంభాషణ ఓ ఆల్కెమీ. హావభావాలు, భావప్రకటనలతో సాగే సంభాషణ మనుషుల మధ్య వారధి అవుతుంది. సాంఘిక జీవన మాధుర్యాన్ని పెంపొందిస్తున్నది సంభాషణలే. చిన్న కుటుంబాల ఫలితంగా ఇప్పటికే కుటుంబ సభ్యుల మధ్య మాటలు తరిగిపోతున్నాయి. సామాజిక మాధ్యమాలు పెరిగిపోవడంతో అంతంత మాత్రంగా ఉన్న ఆ మాటలు ఇప్పుడు పూర్తిగా మాయమయ్యే పరిస్థితి ఏర్పడుతోందని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు.

ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే, వాళ్లతో కొద్ది సమయం కూర్చుని మాట్లాడాలి, మంచి మర్యాదలు తెలుసుకోవాలి. అంత ఓపిక ఇప్పటి జనరేషన్‌కు ఉండడం లేదు. సోషల్‌ మీడియాలో మనకు నచ్చిన వ్యక్తితో, ఇష్టమైన అంశం గురించి మాట్లాడుకునే వీలుంది. మనదైన అందమైన లోకంలో ఇష్టం వచ్చినంత సేపు విహరించే వీలుంటుంది. దీంతో యువతతోపాటు అన్ని వయసుల వారు సామాజిక మాధ్యమాలకు అతుక్కుపోతున్నారు. సోషల్‌ మీడియాలో 75 శాతం మంది యువతీయువకులకు ఏదో ఒక సైట్‌లో సభ్యత్వం ఉంది. 51 శాతం మంది యువత రోజూ ఏదో ఒక సమయంలో సోషల్‌ నెట్‌వర్క్‌ సైట్‌ను ఉపయోగిస్తున్నట్లు ఓసర్వేలో వెల్లడైంది. అదే సమయంలో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో జోక్స్‌, కామెంట్స్‌తో ఇరగదీసే వాళ్లు... అదే మనిషి ఎదురుపడితే ఏం మాట్లాడాలో తెలియక గందరగోళపడిపోతున్నారు.

సామాజిక మాధ్యమాలను వినియోగించడం వల్ల నేరుగా మాట్లాడుకోవడం, ఆత్మీయ స్పర్శ వంటి సామాజిక నైపుణ్యాలను మనుషులు కోల్పోతున్నారు. దీంతో రానురాను భావోద్వేగాలు కూడా తగ్గిపోతున్నాయి. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎలా రియాక్ట్‌ అవ్వాలో నేటి పిల్లలకు తెలియకుండా పోతుందని సైకాలజిస్టులు చెప్తున్నారు. పేరుకి సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నా, ఫేస్‌ టూ ఫేస్‌ మాట్లాడాలంటే మాత్రం నోరు పెగలని పరిస్థితి.

సోషల్‌ మీడియాలు మనుషుల్ని కలపుతున్నాయా..? విడదీస్తున్నాయా..? సామాజిక మాధ్యమాలతో ఉపయోగమెంత..? నష్టమెంత..? ఒక వ్యక్తితో ముఖాముఖి మాట్లాడితే మనసుకు హాయిగా ఉంటుందా..? లేదా మెసేజ్‌లు చేస్తేనే సంతృప్తిగా ఉంటుందా..? సోషల్‌ నెట్‌వర్క్‌ని ఎలా వాడాలి, ఎంత సమయం వాడాలి?

అక్కడెక్కడో ఉన్న వ్యక్తిని ఏ వాట్సాప్‌లోనో, మెసెంజర్‌లో హ్యాపీగా పలకరిస్తాం.. కానీ మన పక్కనే ఉన్న వ్యక్తిని మాత్రం ఓ శత్రువులానో, ఓ ఏలియన్‌లానో చూస్తున్నాం. ఇదంతా కేవలం సోషల్‌ మీడియా ప్రభావమే అని అంటున్నారు సైకాలజిస్టులు, నిపుణులు. సోషల్‌ మీడియాతో ఎంత ఉపయోగం ఉందో, అంత నష్టం కూడా ఉంది.

ప్రతి సోషల్‌ మీడియా మెసేజ్‌కి కంగారు పడిపోకండి. రోజులో నిర్ణీత సమయంలో మాత్రమే మెసేజ్‌లు ఓపెన్‌ చేయడం, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌లకు ఎంత సమయం కేటాయించాలో షెడ్యూల్‌ రూపొందించుకోవడం, కుటుంబ సభ్యులతో భోజనం సమయంలో స్మార్ట్‌ ఫోన్‌ పక్కన పెట్టడం, గంటలు గంటలు వీటితో టైమ్‌ వేస్ట్‌ చేసుకోకుండా, మనలోని సృజనాత్మకతకు కూసింత చోటిస్తే ఇలాంటి కొన్ని కొన్ని పాటిస్తే అందమైన జీవితం మన సొంతమన్నది పెద్దల భావన.

యువత కోరుకున్న హైఎండ్‌ స్మార్ట్‌ ఫోన్లు.. హై కాన్ఫిగరేషన్‌ ల్యాపీలు, డెస్క్‌టా‌ప్‌లతో లైఫ్‌ని ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారు. అయినా ఏదో లోపం, మనసులో లేని సంతోషం. ఇదంతా కేవలం ఎలక్ట్రానిక్‌ గ్యాడ్‌జెట్స్‌ వల్లే. అదే సాధ్యమైనంత వరకు ఎప్పుడైతే స్మార్ట్‌ ఫోన్లకి, సోషల్‌ మీడియాకి దూరంగా ఉంటారో... ఆటోమేటిక్‌గా ఆనందం, సంతోషం వాళ్ల సొంతమవుతుందని ఓ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా ప్రతిరోజూ పేపర్లు చదువుతూ, ఆటలాడుతూ, స్నేహితులతో స్వయంగా కలుసుకునే వాళ్ల మనసు ప్రశాంతంగా ఉంటుందట.

ఏ బంధానికైనా మాటలే పునాది. సోషల్‌ మీడియా మనుషుల్ని కనెక్ట్‌ చేస్తుంది కానీ సోషల్‌ స్కిల్స్‌ని వదిలేలా కూడా చేస్తుంది. టెక్నాలజీ ఉపయోగపడాలే కానీ, దుర్వినియోగం కాకూడదు. అవసరానికి మించి టెక్నాలజీని వినియోగించకుండా, లిమిటెడ్‌ పిరియడ్‌లోనే వాడాలి. ఏ బంధంతో అయినా ముఖాముఖి మనలోని ఫీలింగ్స్‌, కష్టాలు, ఇష్టాలు అన్నీ షేర్‌ చేసుకోగలగాలి కానీ, సోషల్‌ మీడియా ద్వారా ఇది ఏ మాత్రం సాధ్యం కాదన్నది ప్రముఖులు చెప్తున్న మాట. అందుకే మాటలు ఉండాలి... మాట్లాడుకోవడం ఉండాలి.

లైవ్ టీవి

Share it
Top